ʹహిందువుగా బతకడం అంటే సహనంతో బతకడం " నేను నీ హిందుత్వను తిరస్కరిస్తున్నానుʹ
భారతీయ నగరాలలో నివసించే అనేక మంది సగటు వ్యక్తుల్లో నేనూ ఒకదాన్ని. రాజకీయాలకు అతీతంగా జీవించే వ్యక్తిని. రాజ కీయ అనుభవం లేని మనిషిని. కానీ నేను ఈ దేశాన్ని ప్రేమించే ఒక పౌరురాలిని. ఓ శ్రేయోభిలాషిని. ఎన్నికల సమయంలో ఎంతో బాధ్యతతో, నిశ్శబ్దంగా ఓటు వేసే నాపై మిగిలిన సమయా లలో రాజకీయాలు ఏమాత్రం ప్రభావం చూపవు. భారీ కుంభకోణాలు జరిగినప్పుడు భారంగా ఓ శ్వాసపీల్చి, మా అభిప్రాయాలను, ఉద్దేశ్యాలను కథలుగా చెబుతాను. తర్వాత కాళ్ళకున్న […]
భారతీయ నగరాలలో నివసించే అనేక మంది సగటు వ్యక్తుల్లో నేనూ ఒకదాన్ని. రాజకీయాలకు అతీతంగా జీవించే వ్యక్తిని. రాజ కీయ అనుభవం లేని మనిషిని. కానీ నేను ఈ దేశాన్ని ప్రేమించే ఒక పౌరురాలిని. ఓ శ్రేయోభిలాషిని.
ఎన్నికల సమయంలో ఎంతో బాధ్యతతో, నిశ్శబ్దంగా ఓటు వేసే నాపై మిగిలిన సమయా లలో రాజకీయాలు ఏమాత్రం ప్రభావం చూపవు. భారీ కుంభకోణాలు జరిగినప్పుడు భారంగా ఓ శ్వాసపీల్చి, మా అభిప్రాయాలను, ఉద్దేశ్యాలను కథలుగా చెబుతాను. తర్వాత కాళ్ళకున్న దుమ్ముని దులిపేసినంత సులభంగా దులిపేసి ముందుకు సాగిపోతాను తప్ప రాజకీయాలను నా ఇంటి గుమ్మం తొక్కనివ్వను. మా బెడ్రూమ్‌లో, వంటఇంటిలో రాజకీయాలు సంపూర్ణంగా నిషిద్ధం.
1995లో శివసేన ప్రభుత్వం అధికారంలో కొచ్చి మాకెంతో ఇష్టమైన ʹబొంబాయిʹ పేరును ʹముంబైʹ గా మార్చినప్పుడు నిశ్శబ్దంగా శాపాలు పెట్టాం… తిట్టుకున్నాం. ఆ తర్వాత ప్రాంతీ యతా భావాలతో వల్లించిన అందమైన పదాల భాషా శ్రావ్యతతో కొట్టుకుపోయి తెప్పరిల్లాం. ఎందుకంటే శివాజీ పాలించిన రాష్ట్రంలో (వెండి స్పూన్) పంచభక్ష పరమాన్నాలు తినడానికి అలవాటుపడ్డ జీవితాలు కదా!
మరాఠీ మనుషులు ప్రాంతీయ దురభి మానంతో బీహారీలను వారి సొంత రాష్ట్రానికి పంపేయమంటూ వాహనాలను తగులబెట్టిన రోజుల్లో చూసీచూడనట్లు వదిలేశాం! ఎందుకంటే ఏదో ఒకరోజు తెలుసుకోలేకపోతారా? అని. ఇంత నిర్లిప్తంగా, తటస్తంగా ఉన్న మా జీవితాల లోకి ʹహిందూత్వ భావజాలంʹ బొట్లుబొట్లుగా ప్రవేశిస్తున్నది. అయితే మా ఇష్టానికనుగుణంగా కాదు సుమా!
90వ దశకంలో భారతదేశ ఆర్థిక మంత్రిగా ʹభారత్ వెలిగిపోతుందన్నʹ భావాన్ని మనకందరికీ అందించిన ఆర్థిక శాస్త్రవేత్త, ఈ దేశ ప్రధాని అయిన రోజున సంతోషించాం! కానీ ʹమౌన మేధావిʹ ప్రధానమంత్రిగా మమ్మల్ని దారుణంగా నిరాశపరిచారు. అయినా భరిం చాం. ఎందుకంటే పాలనాధికారి మన్మోహన్ అయినా, పగ్గాలు మాత్రం అధినేత్రి సోనియా గాంధీ చేతిలోనే గదా! మన్మోహన్ సింగ్ హెడ్ లైట్ కాంతిలో ఇరుక్కున్న జింకలా కనబడ తాడెందుకో? కాంగ్రెస్ ప్రభుత్వంలో పొగడ్తల భూతం అందరినీ మింగేయడమే గాక, దేశం మొత్తాన్ని తినేస్తున్నది.
భారతీయ ఆత్మను ఓ ఇటాలియన్ యాస మింగేస్తున్నప్పుడు భరించాం. లేకుంటే దిగ్విజరుసింగ్ లాంటి సీనియర్ నాయకుడు ʹగాంధీʹల ప్రభావంలో కొట్టుకుపోవడం ఏమిటి? అమ్మ మాటలకు, అబ్బాయి చేష్టలకు ఒకేలా తల ఊపడం ఏమిటి?
రాహుల్ గాంధీ!…
అన్నట్లు మరిచాను. ఆ రాబర్ట్ వాద్రాలో ప్రియాంకకు నచ్చిందేమిటో? చూడటానికే గూండాలా కన్పించే అతని కుటుంబం మొత్తం పరమ రహస్యంగా మరణించడం వెనుక మర్మం ఏమిటి? ఓ మైగాడ్!
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ʹఫోర్బ్స్ʹ పత్రిక అత్యంత సంపన్న మహిళల జాబితాలో సోనియా గాంధీ మూడవస్థానంలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయినా సరే అత్యంత చవక ముతక నేత చీరల్లో ప్రత్యక్షమవ్వడం వెనుక అంతరార్థమేమిటో? ఎంత గొప్ప నటి? షబానా అజ్మీ కన్నా గొప్పగా నటిస్తుంది.
ఉఫ్! భారతదేశాన్ని బాలీవుడ్‌తో పోల్చడం! సుదీర్ఘమైన ఈ కథను క్లుప్తంగా చెబుతాను. 2014లో మరలా ఎన్నికలు వచ్చాయి. కుటుంబ వారసత్వ రాజకీయాలతో, కుంభకోణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం మా ఆశల మీద నీళ్ళు చల్లిందని అనేకానేకమంది నగరవాసుల్లాగా నేనూ భావించాను. ఓ కొత్త ఆశతో, ఓ మార్పుకోసం తపించాను. ఓ ఆశా కిరణం కనిపిస్తుందేమోనని వేచి చూశాను.
అరవింద్ కేజ్రీవాల్…
ఓ ప్రళయంలా, మహాత్మాగాంధీ మరో అవతారంలా నిరాహార దీక్షలతో మా ముందు ప్రత్యక్షమయ్యాడు. తాను సిఐఎ (ఫోర్బ్స్ ఫౌండేషన్) నుండి నిధులు పొందుతున్న సత్యాన్ని మరుగుపరచి ʹసామాన్యుడిʹ కోసం, సామాన్యుడి తరఫున అవినీతిపై యుద్ధానికి నిలిచిన యోధుడిలా కన్పించాడు. కానీ, అవకాశవాదంతో నెట్టివేయబడ్డాడు. కారుచీకట్లో కాంతిరేఖ ఆర్పివేయబడింది. ఏం చేయాలి? ఎవరివైపు చూడాలి?
దేశానికి దిక్సూచి లేనంత నిరాశ. ఓ నాయ కుడు కావాలి. దేశాన్ని పురోగమన దిశగా నడిపే దక్షుడు కావాలి. నిజాయితీకి ప్రతిరూపంగా ఉండాలి. ఓ ఆశావహ వాతావరణం కావాలి. అదిగో అదే! నరేంద్రమోడీ రూపంలో ప్రత్యక్ష మయ్యింది. ʹకర్మచారి, బ్రహ్మచారి, సంస్కారిʹ అన్న అందమైన పదబంధనంలో!
భారతదేశాన్ని భవిష్యత్తులోకి నడిపించగల ఏకైక నాయకుడిగా ఓ మాయాజాలం సృష్టించ బడింది. గుజరాత్ మోడల్‌గా, భారతీయ సాంప్ర దాయం పేరిట, ఇటాలియన్‌కి వ్యతిరేకంగా ఓ అద్భుత దృశ్యం ఆవిష్కరింపబడి మార్కెట్ చేయబడింది.
నిర్మొహమాటంగా, ధైర్యంగా ప్రశ్నిస్తున్నాను. ఇలా మాట్లాడినందుకు ʹరాజద్రోహంʹగా భావి స్తారా? శిక్షిస్తారా?
2012లో కర్ణాటక అసెంబ్లీలో అశ్లీల చిత్రాలు చూస్తున్న సిసి పుటేజి మరియు లక్ష్మణ్‌లను, పనిచేసే ప్రాంతాల్లో మహిళలు జీన్స్ ధరించ రాదన్న నిబంధనను, ఆల్కహాల్ సేవిస్తున్నారని చేసిన బిజెపి ప్రభుత్వ దాడులను అన్నిటినీ మోడీ ఫైవ్‌స్టార్ మాయాజాలంలో ప్రజా సంబంధాల బృందం మరుగున పడేసింది
ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్‌లలో ప్రజా సంబంధాలకై ఓ అవార్డ్ ఉంటే, అది పొందే అర్హత నిస్సందేహంగా నమో బృందానికే ఉంది.
మీ ప్రభుత్వం రాకముందు, అడుగంటిన మా ఆశల సాక్షిగా, మంచి దేశాన్ని, ఉజ్జ్వల భవిష్యత్తుని చూడాలన్న సగటు పౌరుల్లాగా నేను కూడా నా కుటుంబ సభ్యులను, మిత్రులను, సన్నిహితులను అందరినీ ʹనమోʹకి ఓటు వేయమని కోరాను.
సోషల్ మీడియా సాక్షిగా, రాహుల్‌గాంధీ కన్నా, నమో మిన్న అని భావించాను. కానీ పొరపాటు పడ్డాను. చాలా పెద్ద తప్పిదం చేశాను. ఆ రోజు, నా ప్రచారం సరైనదని అనేకా నేక నాగరీకుల్లా నేను కూడా భావించాను.
భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఎందువలన? గాంధీ వారసత్వ కుటుంబ పాలనను భరించలేని భారతీయ సమాజం వల్ల. మౌన మేధావి గారి అసమర్థ పాలన సహించలేని ప్రజాగ్రహం వలన. గాంధీ కుటుంబ పాలనకు ప్రత్యామ్నాయంగా భావిం చడం వలన.
తన ముద్దుల కొడుకుని, దేశ యువరాజు అన్న భ్రమలో ఉన్న రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడాలన్న ʹఅమ్మʹ కోర్కె స్థానంలో, మరో వ్యక్తి ప్రధాని పదవికి పోటీలో ఉండి ఉంటే ఖచ్చితంగా ఓట్లు చీలిపోయి ఉండేవి. అలా గాకపోవడం, ʹనమోʹ ప్రత్యర్థి రాహుల్ గాంధీ కావడం వలన అధికారాన్ని చేజిక్కించుకో గలి గారు. భారతీయ జనతాపార్టీ ఈ విషయంలో రాహుల్ గాంధీకి సదా కృతజ్ఞురాలై ఉండాలి.
భారతీయ ప్రజలందించిన విజయాన్ని ఏం చేశారు? మమ్మల్ని నిరాశ పరిచారు అని చెప్పడం చాలా చిన్న పదం. మీరు నిరాశపరచడం కాదు. మా ఆగ్రహానికి గురవుతున్నారు. మాలో భయాందోళనలకు కారణమవుతున్నారు. ఇది గర్హనీయం. ఖచ్చితంగా, నూటికి నూరుశాతం దీన్ని మేము అంగీకరించం. ఎందుకంటే ఇది నీచం… నిజంగా తుచ్ఛమైనది.
నాకు బాగా జ్ఞాపకం. నమోకి ఓటు వేయ మని ఓ ముస్లిం మిత్రుడ్ని కోరగా, అతనో జోక్ చెప్పాడు. అదేమిటో తెలుసా? బిజెపి అధికారం లోకి వస్తే తాను కరాచీకి నావలో ప్రమాణ మవ్వాలని. గోద్రా మత కల్లోలాల సంఘటనల తాలూకూ హింస జనాల హృదయాలలో పచ్చి గానే ఉందని నాకప్పుడు అర్థమయ్యింది. కానీ అతని అభిప్రాయం తప్పుకాదనిఇప్పుడనిపిస్తుంది.
ఆక్షణాన అతను అనవసరంగా భయపడు తున్నాడని నాకనిపించింది. అందుకే ముస్లింగా గుర్తింపబడే మైనార్టీ కార్డ్‌ని అనవసరమైన హక్కులకోసం, రాయితీలకోసం ఉపయోగించ కూడదని చెప్పాను. కానీ, మానసికంగా అతను కరాచీకి నావలో ప్రయాణం ఆలోచనలో ఉంటే, అసలు అతను ఎక్కడ ఉన్నట్లు? అదే ప్రశ్న నేను సంధించగా ʹʹనీ కర్థం కాదులే యస్‌కె (సుచిత్రా కృష్ణమూర్తి) అంటూ అతనో నిట్టూర్పు విడిచాడు. ఈరోజు గతాన్ని సింహవలోకనం చేసుకుంటే అతనన్నదే నిజమని నాకనిపిస్తున్నది.
ముస్లింలకు రిజర్వేషన్లు, మైనార్టీ హోదా ఇవన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలే తప్ప మరేమీ కాదని నా ఉద్దేశ్యం. ʹవిభజించు, పాలించుʹ అన్నది కాంగ్రెస్ సిద్ధాంతం. ముందుగా చెప్పినట్లే నేను రాజకీయాలకు కొత్త. కానీ నేను కళా కారిణిని. ప్రపంచ పోకడలను అర్థం చేసుకో గలిగినంత సామర్థ్యమున్న అమాయకురాలిని. అధికశాతం జనం మిమ్మల్ని భరించలేక పోతున్నారని మీకు విశదీకరించగలిగినంత అమాయకురాలిని.
అందుకే ఇలా ఈ మార్గంలో…
బిజెపి అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్స రంలోనే భరించలేనంత నిరాశ కల్గించింది. ఓ పెద్ద తప్పు చేశామన్న భావన మమ్ముల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది. మతతత్త్వానికి, ఫాసిస్ట్ ధోరణులకు ఆజ్యం పోసే కాలానికి ఓటు వేస్తున్నామని ఆనాడు మేము ఊహించలేదు. అసలేం జరుగుతుంది డబ్ల్యూ.టి.ఎఫ్.?
ప్రియమైన భాజాపా! దయచేసి మాకు అర్థమయ్యేలా చెప్పగలవా? కోళ్ళు, మేకలు ఏం పాపం చేశాయని చంపబడుతున్నాయి? ఆవు ఏం పుణ్యం చేసిందని రక్షింపబడుతుంది?
ఓ… గుర్తు వచ్చింది… మీ కన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధం విధించింది గదా! అందుకా? అయితే, వాళ్ళు మీలాగా బలవం తంగా రుద్దలేదు. అయ్యో, నేను హిందువుగా పుట్టినందుకు హఠాత్తుగా ఇప్పుడు ఎందుకు సిగ్గుపడుతున్నాను?
మీకు ప్రతీకారం కావాలి. కాంగ్రెస్ కన్నా పైస్థాయిలో ఉండాలి. అదేగా మీక్కావాల్సింది. మీరో సత్యం మరచిపోతున్నారు. పాలనలో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని, రైతుల ఆత్మహత్యలు, స్త్రీలపై అత్యాచారాలు, బోరుబావుల్లో మరణిస్తున్న పసిపిల్లలు, గజేంద్ర చౌహాన్… ఇంకా ఏమన్నా చెప్పాలా?
మరలా అడుగుతున్నాను. ఇవన్నీ అడుగు తున్నందుకు రాజ ద్రోహం పేరిట నన్ను శిక్షించ దలచుకున్నారా? నిర్మొహమాటంగా, ముక్కు సూటిగా అడుగుతున్నాను. అలాంటి ఉద్దేశ్యం మీకుందా? ఆ… అదేంటి? పాశ్చాత్య సంస్కృతిని పారద్రోలి భారతీయ సంస్కృతిని పరిరక్షిం చడమా? అసలు దాని అర్థం మీకు సుస్పష్టంగా తెలుసా? మా దేశపు మానవీయ విద్యాశాఖా మరియు మానవ వనరుల శాఖామంత్రి స్మృతి ఇరానీగారు?
తాను బి.ఎ. దూరవిద్యలో పాసయ్యిందో లేక ఊహల్లో బి.కాం పాస్ అయ్యిందో తనకే స్పష్టత లేని విద్యాశాఖామంత్రిగారికి ʹహిందూ మతానికి, హిందూత్వానికిʹ తేడాతెలుసా అసలు?
సహనం, జాలి, దయ ఇవన్నీ ఉన్న హిందూ మతాన్ని అర్థం చేసుకోలేకపోతే ఓ హిందువుగా పిలవబడటానికి కూడా అనర్హులే! హిందూమతం ఓ తత్త్వశాస్త్రం. ఓ జీవన విధానం. ఆచరిం చాలా లేదా అనేది ఎంపిక చేసుకొనే అధికారం నాకుంది.
రాముడా? గణపతా? లేక నాస్తికత్వమా? ఉపనిషత్తులా? భగవద్గీతా? మంత్రాలా? తంత్రాలా? నచ్చిన మార్గాన్ని ఎంచుకోవాల్సింది నేను. హిందూత్వమనేది బలవంతంగా రుద్ద బడుతున్న ఓ అంశం… మతాచరణకు సంబం ధం లేని ఓ సిద్ధాంతం. హిందూత్వ ఓ రాజకీయ అస్త్రం. మతానికి ఏమాత్రం సంబంధంలేని అంశం. నేను మారిపోతాననో మతాన్ని పోషిస్తాననో వాగ్దానం చేయడం లేదు. ఎందు కంటే మా పూర్వీకులు, తాతగారు ఆలయంలో అర్చకులు. మా నాన్నగారు నేటికీ వేదాలను నోటితో వల్లిస్తారు. ఎప్పుడూ చదవకపోయినా నా సోదరి వేదాలను నోటితో చెప్పగలదు. కారణం అది మా వంశంలో, మా రక్తంలో, మా వారసత్వంలో ఉంది. కాబట్టి ఓ భాజాపా నా మతం గూర్చి నువ్వు నాకు నేర్పవద్దు. నేను ఎలా ఆలోచించాలో, ఎవరిని పూజించాలో, ఏం తినాలో, ఎలా దుస్తులు ధరించాలో నువ్వు నాకు నేర్పాలని ప్రయత్నించవద్దు. పుట్టుక నిర్వచనం రీత్యా నేను హిందువుని. మానసిక స్వచ్ఛతరీత్యా పై స్థాయిలో ఉన్నదాన్ని.. అందుకే నేను నీ హిందూ త్వాన్ని తిరస్కరిస్తున్నాను. ఎలాగో తెలుసా? ముస్లింలు తాలిబాన్లను, ఐఎస్‌ఐఎస్‌ని తిరస్కరించినట్లుగా! ఓ హిందువుగా బ్రతకడం అంటే సహ నంతో బ్రతకడం. ఆ సహనం వలననే ఎన్నో దాడులను, విధ్వంసాలను ఈ జాతి ఎదుర్కో గలిగింది. నశించకుండా నిలబడగలిగింది. ఇది నువ్వు అర్థం చేసుకోలేక పోయినా, సహనాన్ని వహించకపోయినా, బలవంతంగా మతాచరణను ప్రోత్సహించినా, నువ్వొక హిందువుగా పిలవ బడవు. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం వహించడానికి తగవు. కాబట్టి ప్రియమైన బిజెపి… నీ హిందూ త్వాన్ని నేను తిరస్కరిస్తున్నాను. నీ ఫాసిజాన్ని తిరస్కరిస్తున్నాను. నీ నిరంకుశ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తున్నాను. ఇది భారతదేశం తరఫున నేను చేస్తున్న హెచ్చరిక. గుర్తుంచుకో…
(స్వేచ్ఛానువాదం డాక్టర్ శమంతకమణి)
– సుచిత్రా కృష్ణమూర్తి
రచయిత ప్రముఖ గాయని, నటి
(ప్రజాశక్తి సౌజన్యంతో…)