తెలుగు రాష్ట్రాల్లో పవన్‌కల్యాణ్ ముందు సవాళ్ళు
సినీ హీరో, అధినేత పవన్ కల్యాణ్ జనసేనకు రాజకీయ గుర్తింపు లభించడంతో ఇపుడాయన కొత్త సవాళ్ళు ఎదుర్కోబోతున్నారు. చాలా కాలం తర్వాత ఆయన మళ్ళీ రాజకీయంగా వార్తల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు తాను అనేక విషయాల్లో పరిమిత పాత్రే పోషించినప్పటికీ ఇకముందు ఆయన నిర్వహించాల్సిన పాత్ర చాలానే ఉంది. ఆయన ముందు ఇపుడు ప్రధానంగా రెండు కీలకాంశాలున్నాయి. ఒకటి తెలంగాణలో అయితే మరొకటి ఆంధ్రప్రదేశ్‌లో అంశం. రాజకీయ గుర్తింపు లభించిన తర్వాత మొట్టమొదటగా ఆయన చేపట్టాల్సింది […]
Advertisement
రాజకీయ గుర్తింపు లభించిన తర్వాత మొట్టమొదటగా ఆయన చేపట్టాల్సింది రాజధాని భూముల సమీకరణ అంశం. 33 వేల ఎకరాలు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణ అంశం అసంపూర్తిగా మిగిలిపోయింది. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉన్న పెనుమాక, ఉండవల్లి భూములు ఇప్పటికి కూడా ప్రభుత్వం సమీకరించలేక పోయింది. దీనికి ప్రధాన అడ్డంకి జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ ప్రాంత రైతులు ఆయన్ని ఆశ్రయించి తమ భూములకు రక్షణ కల్పించాల్సిందిగా అర్దించారు. ఆయన కూడా అంతే వేగంగా ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడి రైతులకు అభయమిచ్చారు. అంతకుముందు కూడా ఆయన అభయం ఇచ్చినప్పటికీ తాజాగా ఇచ్చిన అభయంతో రైతులకు కొంత భరోసా దక్కింది. దాంతో ప్రభుత్వం ఆ ప్రాంత భూముల స్వాధీనానికి కొంతమేర వెనక్కి తగ్గింది. రాజధాని నగరమైన అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అయిపోవడం… ఆ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ వేరే రాష్ట్రంలో ఉండి షూటింగ్ కారణంగా రాలేక పోవడం జరిగింది. ప్రధానమంత్రి మోదితోపాటు జపాన్, సింగపూర్ మంత్రులు వంటి ముఖ్యులు హాజరైన కార్యక్రమానికి కూడా ఆయన హాజరుకాకపోవడం కొంత చర్చనీయాంశమైనప్పటికీ జనం ఆ తర్వాత దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పవన్ రాకపోవడాన్ని కూడా ఓ వర్గం సమర్ధించింది. రామోజీరావు వంటి వారిని స్వయంగా ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ప్రభుత్వం ఏర్పాటుకు ప్రధాన కారణమైన పవన్‌కల్యాణ్‌ను స్వయంగా వెళ్ళి పిలవక పోవడం ఆ వర్గం జీర్ణించుకోలేక పోయింది. దాంతో ఆయన రాకపోవడమే సరైన నిర్ణయమని కూడా భావించింది. ఇపుడు ఆ దూరం అలాగే ఉంది. శంకుస్థాపన తర్వాత చంద్రబాబు, పవన్ ఇంతవరకు మాట్లాడుకోలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయం పవన్ కల్యాణ్ మాటకు విలువ లేకుండా చేసేదిగా ఉంది. పెనుమాక, ఉండవల్లి భూముల సమీకరణకు శక్తిమేర ప్రయత్నించి అపుడు కూడా వీలుకాకపోతే భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించడం పవన్‌కు ఒక విధంగా సవాలు వంటిదే. ఇపుడు పవన్ రైతుల తరఫునే నిలబడతారా? లేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతారా? అన్నది చూడాలి. ఇది ఆంధ్రప్రదేశ్‌లో పవన్ తీసుకునే కీలకమైన నిర్ణయం.
ఇక తెలంగాణ విషయానికి వస్తే… ఇపుడు ఆయన ముందున్న సవాలు… గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. గత ఎన్నికల్లో తెలుగుదేశం-బీజేపీ కూటమి తరఫున ఆయన ప్రచారం చేసి తన ఓటు బ్యాంకు అవసరాన్ని అందరికీ తెలిసేలా చేశారు. అయితే ఆతర్వాత తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పలుసార్లు తన గళం విప్పారు. అయితే బీజేపీతో ఆయనకు పెద్దగా సమస్యలు లేవు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చక పోయినా ఆయన పెద్దగా దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. అంటే బీజేపీతో ఆయనకు సత్సంబంధాలే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ గ్రేటర్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఒంటిరిగా పోటీ చేస్తారా? లేక టీడీపీ-బీజేపీ కూటమితో కలిసి పోటీ చేస్తారా? లేక ఒక్క బీజేపీకే అనుకూలంగా వ్యవహరించి తన అభ్యర్థులను పోటీలో పెడతారా? అనే దానిపైనే ఇపుడు చర్చ జరుగుతోంది. అయితే జనసేనకు ఇప్పటివరకు వ్యవస్థీకృత యంత్రాంగం లేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా సభ్యత్వం లేదు. జనం వెంట ఉన్నారని అనిపిస్తున్నా జనసేనకు సరైన రాజకీయ సైన్యం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఆయన అసలు గ్రేటర్ ఎన్నికల్లో ఎలా భాగస్వాములవుతారన్న ప్రశ్న ఉదయిస్తోంది.
అయితే తెలుగుదేశంపై రాజకీయ ఆగ్రహంతోనో… బీజేపీ వాగ్దానాలు అమలు చేయలేదన్న కోపంతోనో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే గ్రేటర్ పరిధిలోని ఆంధ్రప్రాంత ఓట్లు చీలి పోవడం ఖాయం. సహజంగా ఈ ఓట్లన్నీ టీడీపీ, బీజేపీలకు లభించేవే. వాటిని పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కూడా తీసుకుంటుంది. ఫలితంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి లాభపడుతుందని రాజకీయ పరిశీలకుల అంచనా. ఒకవేళ షూటింగ్‌లంటూ పవన్ కల్యాణ్ ఈ ఎన్నికలను నిర్లక్ష్యం చేస్తే జనసేనకు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారడం ఖాయం. కనీసం గతంలో మాదిరిగా బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేస్తే పవన్ పార్టీకి రాజకీయంగా కొంత గ్రౌండ్ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ అభిప్రాయం కొంతవరకు నిజమే అయినప్పటికీ వ్యవస్థాగత యంత్రాంగం లేని జనసేన చుక్కాని లేని నావ మాదిరిగా మారకూడదనుకుంటే ఇప్పటికైనా పవన్ కల్యాణ్ మేల్కొని సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం అవసరం.
– పీఆర్ చెన్ను
Advertisement