గుజరాత్ బంద్ హింసాత్మకం... ఆరుగురు మృతి
గుజరాత్ హింసాత్మకంగా మారింది. పటేళ్ళ బంద్ పిలుపు విధ్వంస రూపం ధరించింది. విషాదం నింపింది. బంద్ సందర్భంగా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. రాష్ట్రమంతటా అల్లర్లు చెలరేగాయి. అహ్మదాబాద్, వడోదర, సూరత్‌లో అల్లరి మూకలు పేట్రేగి పోవడంతో కర్ఫ్యూ విధించారు. ఒక్క అహ్మదాబాద్ ప్రాంతంలోనే తొమ్మిది చోట్ల కర్ప్యూ విధించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి స్టేట్ రిజర్వు పోలీసులతోపాటు 10 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు, ఐదు వేల మంది పారా మిలటరీ దళాలను కేంద్రం గుజరాత్‌కు పంపింది. […]
Advertisement
గుజరాత్ హింసాత్మకంగా మారింది. పటేళ్ళ బంద్ పిలుపు విధ్వంస రూపం ధరించింది. విషాదం నింపింది. బంద్ సందర్భంగా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. రాష్ట్రమంతటా అల్లర్లు చెలరేగాయి. అహ్మదాబాద్, వడోదర, సూరత్‌లో అల్లరి మూకలు పేట్రేగి పోవడంతో కర్ఫ్యూ విధించారు. ఒక్క అహ్మదాబాద్ ప్రాంతంలోనే తొమ్మిది చోట్ల కర్ప్యూ విధించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి స్టేట్ రిజర్వు పోలీసులతోపాటు 10 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు, ఐదు వేల మంది పారా మిలటరీ దళాలను కేంద్రం గుజరాత్‌కు పంపింది. తమను వెనుకబడిన తరగతుల్లో (ఓబీసీ) చేర్చాలని డిమాండు చేస్తూ బుధవారం బంద్‌కు పిలుపు ఇవ్వడంతో రహదారులన్నీ ఖాళీ అయిపోయాయి. కార్యాలయాలన్నీ మూత పడ్డాయి. పటేళ్ళ డిమాండ్లకు ప్రభుత్వం దిగి రాకపోవడంతో హింసనే ప్రధాన ఆయుధంగా ఎన్నుకున్నట్టు కనిపిస్తోంది. 30 బస్సులు అగ్నికి ఆహుతైపోయాయి. పదుల సంఖ్యలో ఇతర వాహనాలు దగ్గమై పోయాయి. మరెన్నో ఆస్తులు విధ్వంసానికి గురవుతున్నాయి. వదంతులు వ్యాపించకుండా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపి వేశారు. నిజానికి భద్రతా వ్యవస్థ అదుపు తప్పినట్టు చెప్పవచ్చు. బంద్ తీవ్రతను ఆలస్యంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సాయుధ బలగాల కోసం కేంద్రాన్ని అభ్యర్థించింది. దాంతో కేంద్రం వెంటనే తమకు అందుబాటులో ఉన్న భద్రతా దళాలను గుజరాత్‌కు పంపింది. కాగా హింస వల్ల, ఆందోళనల వల్ల సమస్యలు పరిష్కారం కావని, తక్షణం బంద్ విరమించాలని ప్రధాని నరేంద్ర మోడి ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వాలను వణికిస్తున్న పాతికేళ్ల కుర్రాడు
హార్దిక్ పటేల్… పాతికేళ్ల ఈ కుర్రాడి పేరు వింటేనే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంతో సహా కేంద్ర ప్రభుత్వం కూడా వణికి పోతోంది. అందుకు కారణం అతను చేపట్టిన ఉద్యమం. పటేల్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అతను చేస్తున్న ఉద్యమం రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తోంది. మంగళవారం అహ్మాదాబాద్‌లో మహా క్రాంతి ర్యాలీ పేరుతో హార్దిక్ భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాడు. ఈ సభకు 5 లక్షల మందికి పైగా పటేల్ సామాజిక వర్గ ప్రజలు హాజరయ్యారు. పటేల్ వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని హార్దిక్ పటేల్ హెచ్చరించాడు. సీఎం ఆనందీబెన్ పటేల్ స్వయంగా వచ్చి తమ వినతిపత్రం స్వీకరించే వరకు వేదిక వద్దే ఆమరణ దీక్ష చేస్తానని హార్దిక్ ప్రకటించడంతో పోలీసులు బలవంతంగా అతడిని అరెస్ట్ చేశారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ఉద్యమంపై ఆరా తీస్తోంది.
హార్థిక్ పటేల్ బీజేపీ తానులో ముక్కే?
గుజరాత్ సర్కార్‌ను వణికిస్తున్న 25 ఏళ్ల కుర్రాడు హార్దిక్ పటేల్…సంఘ్ పరివార్ తానులో ముక్కేనని గుజరాత్ మీడియాతోపాటు నేషనల్ మీడియా న్యూసై కూస్తోంది. హార్థిక్ తండ్రి బీజేపీ నేత అని, పటేల్ ఓటుబ్యాంకును కాపాడుకోవడానికే హార్థిక్‌ను ప్రోత్సహిస్తూ ఈ ఉద్యమాన్ని లేవదీశారనే వాదనలూ వినిపిస్తున్నాయి. బలమైనపటేల్ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ..బీజేపీ వేసిన ఎత్తులో భాగమే ఈ ఉద్యమమనే ప్రచారమూ సాగుతోంది. పటేల్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ హార్థిక్ పటేల్ చేస్తున్న ఉద్యమం ఉధృతమవుతోంది. లక్షల మందికి పైగా పటేల్ సామాజిక వర్గ ప్రజలు ఈ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. గుజరాత్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్న హార్థిక్ పటేల్ నాయకత్వం.. బీజేపీ గీసిన స్కెచ్ అని విమర్శలు వినిపిస్తున్నాయి.
Advertisement