ఏపీ విద్యామండలికి సుప్రీంలో ఊరట
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఏపీ ఉన్నత విద్యామండలి కొనసాగొచ్చునని, ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా సంస్థలకు ప్రవేశ పరీక్షలు నిర్వహించొచ్చునని న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రేలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఉన్నత విద్యామండలి ఉనికిలో లేదంటూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం నిలుపుదల చేసింది. ఉమ్మడి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ఉన్నత విద్యామండలి, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు […]
Advertisement
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఏపీ ఉన్నత విద్యామండలి కొనసాగొచ్చునని, ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా సంస్థలకు ప్రవేశ పరీక్షలు నిర్వహించొచ్చునని న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రేలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఉన్నత విద్యామండలి ఉనికిలో లేదంటూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం నిలుపుదల చేసింది. ఉమ్మడి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ఉన్నత విద్యామండలి, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై స్పందించాలంటూ కేంద్ర ప్రభుత్వం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో అంతా తమతమ అభిప్రాయాలను కౌంటర్ల రూపంలో దాఖలు చేయాలని, వాటికి పిటిషనర్లు రెండు వారాల్లో సమాధానాలు ఇవ్వాలని చెబుతూ తదుపరి విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేసింది.
ఏ విషయమైనా.. ఇరు రాష్ట్రాలూ కొట్టుకోవటం సరికాదని న్యాయమూర్తులిరువురూ అభిప్రాయపడ్డారు. సమైక్య రాష్ట్రంలో వసూలు చేసిన ఫీజులకు సంబంధించిన నిధుల్ని ఇప్పుడు ఇరు రాష్ట్రాలూ పంచుకోవాల్సిందేనని, ఒక రాష్ట్రానికే వాటిని కట్టబెట్టడం సమంజసంగా లేదని జస్టిస్ సేన్ పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో ఉన్నవి ఆ రాష్ర్టానికి చెందినా, పదేళ్లు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లో ఉన్న సంస్థలు, వాటి నిధులు మాత్రం ఇరు రాష్ట్రాలకూ పంపిణీ చేయాలన్నారు. హైదరాబాద్ సంస్థలు, వాటి నిధుల విభజనపై చట్టంలో ఎక్కడ పేర్కొన్నారని ప్రశ్నించారు. కానీ, ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న సిబల్.. చట్టం మాత్రం ఇవి తెలంగాణవేనని చెబుతోందని తెలిపారు. కేవలం ఆర్‌బీఐ, ట్రెజరీలు, బ్యాంకుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధుల్ని మాత్రమే పంచుకోవాలని చట్టం చెబుతోందన్నారు. అప్పుడు హైదరాబాద్ సంస్థలకు సంబంధించి తప్పకుండా వేరే నిబంధనలు ఉండి ఉండాలని జస్టిస్ సేన్ అన్నారు. ఇందుకు సిబల్, అభిషేక్ సింఘ్వీలు స్పందిస్తూ.. ఏపీలో అత్యంత ధనవంతమైన ఆలయానికి చెందిన పద్మావతి సంస్థల ఆదాయాన్ని కూడా పంచుకోవాలా? అని అడిగారు. ఇందుకు జస్టిస్ సేన్ స్పందిస్తూ.. పదేళ్లు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ సంస్థల విషయం ఇందుకు భిన్నమని సమాధానం ఇచ్చారు. విభజన జరగ్గానే ఈ నిధులన్నీ విజయవాడకు తరలించేస్తే ఏం చేసేవాళ్లు? అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కొనసాగొచ్చునని, అయితే ఏపీలోని విద్యా సంస్థలకు మాత్రమే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణను ఆరు వారాలపాటు వాయిదా వేశారు.
Advertisement