వావ్ వార‌ణాసి...అనిపించారు

కాశీ ఘాట్‌ని శుభ్రం చేసి ప్ర‌ధాని ప్ర‌శంస‌లు పొందిన యువ‌తులు కాశీ లేదా వార‌ణాసి… మ‌నుషుల పాపాల‌ను క‌డిగేసే పుణ్య‌క్షేత్రంగా ఇది ఎంతో ప్ర‌సిద్ధి. ఆ పాపాలే కాలుష్యంగా మారుతున్నాయేమో చెప్ప‌లేం కానీ కాశీలో ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం పెద్ద స‌మ‌స్య‌గా మారింది. గంగా న‌ది ప్ర‌క్షాళ‌న‌ ప్ర‌భుత్వాల‌కు ఇప్పుడు ఒక పెద్ద స‌వాల్‌. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు యువ‌తులు కాశీ ఘాట్‌ని శుభ్రం చేసేందుకు న‌డుం బిగించారు. దాన్ని సుసాధ్యం చేసి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ప్ర‌శంస‌లు అందుకున్నారు.  స్వచ్ఛ‌భార‌త్‌ కార్య క్రమానికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ […]

Advertisement
Update:2015-04-03 11:30 IST

కాశీ ఘాట్‌ని శుభ్రం చేసి ప్ర‌ధాని ప్ర‌శంస‌లు పొందిన యువ‌తులు

కాశీ లేదా వార‌ణాసి… మ‌నుషుల పాపాల‌ను క‌డిగేసే పుణ్య‌క్షేత్రంగా ఇది ఎంతో ప్ర‌సిద్ధి. ఆ పాపాలే కాలుష్యంగా మారుతున్నాయేమో చెప్ప‌లేం కానీ కాశీలో ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం పెద్ద స‌మ‌స్య‌గా మారింది. గంగా న‌ది ప్ర‌క్షాళ‌న‌ ప్ర‌భుత్వాల‌కు ఇప్పుడు ఒక పెద్ద స‌వాల్‌. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు యువ‌తులు కాశీ ఘాట్‌ని శుభ్రం చేసేందుకు న‌డుం బిగించారు. దాన్ని సుసాధ్యం చేసి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ప్ర‌శంస‌లు అందుకున్నారు. స్వచ్ఛ‌భార‌త్‌ కార్య క్రమానికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ సెల‌బ్రిటీల‌ను ఆహ్వానించారు. ఇప్పుడు మోడీచేత ప్ర‌శంస‌లు పొంది ఈ యువ‌తులే సెలబ్రిటీలుగా మారారు.

నాగాల్యాండ్ అమ్మాయి తెంసుతులా ఇంశాంగ్, వార‌ణాసి యువ‌తి దార్షికా షా ఇద్ద‌రూ గ్రామీణాభివృద్ధికోసం ప‌నిచేస్తున్న సాకార్ సేవా స‌మితి అనే స్వ‌చ్ఛంద సేవాసంస్థ‌ని న‌డుపుతున్నారు. వీరిద్ద‌రూ ఫిబ్ర‌వ‌రిలో గంగాన‌దిలో బోట్ షికారుకి వెళ్లారు. ప్ర‌భుఘాట్ వ‌ద్ద‌కు వెళ్లే స‌రికి అక్క‌డి దుర్వాస‌న‌తో వారి ముక్కు పుటాలు అదిరిపోయాయి. ఆశ్చ‌ర్య‌పోయిన ఆ ఇద్ద‌రు యువ‌తులు బోట్ దిగి ప్ర‌భు ఘాట్ మొత్తం తిరిగి చూడాల‌నుకున్నారు, చూశారు. అంత‌కంటే అప‌రిశుభ్రంగా ఉన్న ప్ర‌దేశాన్ని జీవితంలో ఎక్క‌డా చూడ‌లేద‌నిపించింద‌ని తెంసుతుల దానిపై వ్యాఖ్యానించింది. అక్క‌డ ప‌విత్ర‌త అనే మాట‌కు అర్థ‌మే క‌నిపించ‌లేదంది. ఇద్దరూ ఏదో ఒక‌టి చేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు. మిష‌న్ ప్ర‌భుఘాట్ పేరుతో ఆ కాశీ ఘాట్‌ని ప‌విత్రంగా మార్చే కార్య‌క్ర‌మానికి మార్చి 18న శ్రీకారం చుట్టారు. ముందు జిల్లా అధికారుల‌ను క‌లిసి త‌మ ఆలోచ‌న‌లను చెప్పారు. వారినుండి ఎలాంటి స‌హాయం అంద‌క‌పోగా వ్య‌తిరేకత ఎదురైంది. దాంతో ఇద్ద‌రు యువ‌తులు క‌లిసి చెరో ఐదువేల రూపాయ‌ల‌ను విరాళాల ద్వారా పోగుచేశారు.

శుభ్రం చేయ‌డానికి అవ‌స‌ర‌మైన చీపుర్లు, బ‌కెట్లు త‌దిత‌ర సామాగ్రి కొన్నారు. వారితోపాటు వారి బృందంలో కొంద‌రు స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చారు. కొంత‌మంది కూలీల‌ను నియ‌మించుకున్నారు. వీరు చేస్తున్న ప‌నిపై నెగెటివ్ కామెంట్లు చేసి ఇబ్బందికి గురిచేసిన‌వారూ ఉన్నారంటే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. వాటిని ప‌ట్టించుకోకుండా ముందుకు వెళ్లామ‌ని, ఫెస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌లాంటి సామాజిక మాధ్య‌మాలు త‌మ‌కు ఎంతో ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని అందించాయ‌ని ఈ ఇద్ద‌రు యువ‌తులు అంటున్నారు. మిష‌న్ ప్ర‌భుఘాట్‌కి సోష‌ల్‌మీడియాలో ఒక్క నెల‌లోనే ముప్ప‌యి ల‌క్ష‌ల ట్వీట్‌లు వ‌చ్చాయి.

తాము చేసిన ప‌ని స్వ‌చ్ఛ‌భార‌త్‌కు త‌మ వంతు కృషి అని , మోడీయే త‌మకు స్ఫూర్తి అని యువ‌తులిద్ద‌రూ ప్ర‌క‌టించారు. ప్ర‌భుఘాట్ శుభ్ర‌త‌కు ముందు, త‌రువాత ఫొటోల‌ను ఆన్‌లైన్లో పోస్ట్ చేశారు. వాటిలో క‌న‌బ‌డుతున్న తేడా చూప‌రుల‌ను అబ్బుర ప‌రుస్తోంది. ఇప్ప‌టికే మూడేళ్లుగా ఇలాంటి సేవా కార్య‌క్ర‌మాల్లో ఉన్న ఈ ఇద్ద‌రు యువ‌తులు ప్రార్థించే పెద‌వుల‌క‌న్నా సేవ చేసే చేతులకు శ‌క్తి ఎక్కువ‌ని నిరూపించారు.

Tags:    
Advertisement

Similar News