దేశం నుంచి భార్యతో సహా మాల్దీవులకు చెక్కేసిన లంక అధ్యక్షుడు గొటబాయ
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే దేశం నుంచి పరారయ్యారు. భార్య, బాడీగార్డులతో సహా ఆయన నిన్న రాత్రి మిలిటరీ విమానంలో మాల్దీవులకు పారిపోయారు. నిజానికి ఆయన నేడు తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. కానీ రాజీనామా తరువాత తనను ప్రభుత్వం అరెస్టు చేస్తుందేమోనన్న భయంతో ఆయన పారిపోయినట్టు భావిస్తున్నారు. ఈ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గొటబాయ మాల్దీవుల రాజధాని మాలేకు చేరుకున్నట్టు తెలుస్తోంది. గొటబాయతో బాటు ఆయన కుమారుడు, ఇతర కుటుంబసభ్యులు కూడా పరారయినట్టు […]
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే దేశం నుంచి పరారయ్యారు. భార్య, బాడీగార్డులతో సహా ఆయన నిన్న రాత్రి మిలిటరీ విమానంలో మాల్దీవులకు పారిపోయారు. నిజానికి ఆయన నేడు తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. కానీ రాజీనామా తరువాత తనను ప్రభుత్వం అరెస్టు చేస్తుందేమోనన్న భయంతో ఆయన పారిపోయినట్టు భావిస్తున్నారు. ఈ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గొటబాయ మాల్దీవుల రాజధాని మాలేకు చేరుకున్నట్టు తెలుస్తోంది. గొటబాయతో బాటు ఆయన కుమారుడు, ఇతర కుటుంబసభ్యులు కూడా పరారయినట్టు సమాచారం. దేశం నుంచి తానూ, తన కుటుంబ సభ్యులు సురక్షితంగా నిష్క్రమించేంతవరకు రాజీనామా చేయనని ఆయన ఇటీవల చెప్పినట్టు తెలిసింది. ఈయన సోదరుడు బాసిల్ రాజపక్సే కూడా నిన్న పారిపోయేందుకు కొలంబో విమానాశ్రయానికి చేరుకున్నప్పటికీ అక్కడ ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆయన ప్రయాణానికి ఇమిగ్రేషన్ అధికారులు అనుమతించకపోవడంతో ఆయన పరారీ యత్నం విఫలమైంది. అయితే ఆయన అమెరికాకు పరారయినట్టు తాజా వార్తలను బట్టి తెలుస్తోంది.
అధ్యక్షుడైనందున అరెస్టు కాకుండా తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ గొటబాయ రాజపక్సే.. నిరసనకారుల నుంచి తనకు ముప్పు తప్పదని భావించి ముందు జాగ్రత్తగా పారిపోయినట్టు భావిస్తున్నారు. మొత్తానికి మాలే చేరుకోగానే ఈయనను, ఈయన కుటుంబాన్ని పోలీసుల ఎస్కార్టుతో అజ్ఞాత ప్రదేశానికి తరలించినట్టు మాలే లోని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. శాంతియుతంగా అధికారం బదలాయింపు జరిగేలా చూసేందుకు బుధవారం తాను రాజీనామా చేస్తానని గొటబాయ ఇటీవల ప్రకటించారు. పైగా కొత్త అధ్యక్షుని పేరును ఖరారు చేసేందుకు ఈ నెల 15 న పార్లమెంట్ సమావేశం కావలసి ఉంది. కానీ పరిణామాలన్నీ మారిపోయాయి. అసలు నిన్ననే ఆయన పారిపోవడానికి యత్నించినప్పటికీ ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అయితే అర్ధరాత్రి దాటాక .. ఆయన అందరి కళ్ళు గప్పి పలాయనం చిత్తగించారు. మొదట మాల్దీవుల ప్రభుత్వం ఈ అధ్యక్షునికి, ఈయన కుటుంబానికి ఆశ్రయం కల్పించేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. ఇలా ఉండగా అక్కడ ఉన్నప్పటికీ గొటబాయ నేడు పదవికి రాజీనామా చేయవచ్చునని తెలిసింది. అయితే దీనిపై ఇంకా స్పష్టత లేదు.