Telugu Global
National

జాతీయ చిహ్నంపై సింహాల 'రౌద్రం' మోడీ ఐడియానే !

జాతీయ చిహ్నంపై శాంతంగా ఉండాల్సిన సింహాల ప్రతిమలు అలా కాకుండా రౌద్రంగా ఎందుకున్నాయి ? ప్రధాని మోడీ కొత్త పార్లమెంటు భవనంపై ఆవిష్కరించిన నేషనల్ ఎంబ్లెమ్ లోని 'లయన్స్' ని చూస్తేనే భయపడి పారిపోయేట్టు కనిపిస్తున్నాయి. 6.5 మీటర్ల ఎత్తునున్న భారీ సైజు చిహ్నం మనస్సులో ప్రశాంతతను కాకుండా టెన్షన్ రేకెత్తించేట్టుగా ఉందంటే దీని వెనుక మర్మమేమిటన్న ప్రశ్న తలెత్తక మానదు. 9,500 కేజీల బరువున్న ఈ చిహ్నం 'చిరాగ్గా' కూడా కనిపిస్తోందంటున్నారు. మోడీ దీన్ని ఆవిష్కరించిన […]

జాతీయ చిహ్నంపై సింహాల రౌద్రం మోడీ ఐడియానే !
X

జాతీయ చిహ్నంపై శాంతంగా ఉండాల్సిన సింహాల ప్రతిమలు అలా కాకుండా రౌద్రంగా ఎందుకున్నాయి ? ప్రధాని మోడీ కొత్త పార్లమెంటు భవనంపై ఆవిష్కరించిన నేషనల్ ఎంబ్లెమ్ లోని 'లయన్స్' ని చూస్తేనే భయపడి పారిపోయేట్టు కనిపిస్తున్నాయి. 6.5 మీటర్ల ఎత్తునున్న భారీ సైజు చిహ్నం మనస్సులో ప్రశాంతతను కాకుండా టెన్షన్ రేకెత్తించేట్టుగా ఉందంటే దీని వెనుక మర్మమేమిటన్న ప్రశ్న తలెత్తక మానదు. 9,500 కేజీల బరువున్న ఈ చిహ్నం 'చిరాగ్గా' కూడా కనిపిస్తోందంటున్నారు. మోడీ దీన్ని ఆవిష్కరించిన నాటి నుంచే దీనిపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ సహా విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అశోకుని చిహ్నానికి, దీనికి మధ్య పోలుస్తూ ట్విట్టర్లో ఇమేజీలు పెడుతున్నారు. ఇది అసలు జాతీయ చిహ్నమే కాదని, మోడీ తన గొప్పతనాన్ని చాటుకునేందుకు, తన ప్రెస్టీజియస్ గా భావించి దీన్ని రూపొందింపజేసినట్టు కనిపిస్తున్నదని విమర్శలు మొదలయ్యాయి. పైగా ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి తమను ఆయన ఆహ్వానించలేదని కూడా మండిపడ్డాయి.

పార్లమెంటు అన్నది స్పీకర్ పరిధిలోకి వస్తుందని, ప్రధాని బదులు స్పీకర్ ఈ చిహ్నాన్ని ఆవిష్కరించాల్సి ఉందని ఒవైసీ వంటివారు మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా మోడీ తన ఆలోచనలను ఎలా అమల్లో పెడుతున్నారన్నది చర్చించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. 2018 లో ఢిల్లీలో ఆయన తమ బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇది ప్రపంచంలోని ఆయా పార్టీల ఆఫీసులకన్నా అతి పెద్దది. అలాగే కొత్త పార్లమెంట్ భవనం కూడా.. ఇప్పుడు ఈ జాతీయ ఎంబ్లెమ్ కూడా ఇండియాలో ని భారీ 'స్తూపం' వంటిదేనట.. కోపంతో నిప్పులు కక్కుతున్నట్టు సింహాలున్న ఈ చిహ్నం రాజకీయ దుమారాన్ని రేపిందంటే ఆశ్చర్యం లేదు.. కండరాలు ఉబ్బెత్తుగా.. నాలుగు దిశల్లో ఉన్న లయన్స్ ప్రతిమలకు, సారనాధ్ లోని అశోకా పిల్లర్ పై గల చిహ్నానికీ అసలు పోలికే లేదంటున్నారు.

అయితే మోడీ ఇలాంటి ఎంబ్లెమ్ ని ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే దీని వెనుక ఓ చిన్న చరిత్రే ఉంది. మోడీని గుజరాత్ సింహంగా అభివర్ణిస్తారు. 12 ఏళ్ళ పాటు ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించి కేంద్రంలో ప్రధానిగా పగ్గాలు చేబట్టినందుకు బీజేపీ.. ఆయనను ఇప్పటికీ గుజరాత్ సింహంగానే వ్యవహరిస్తోంది. గుజరాత్ రాష్ట్ర జంతువు కూడా సింహమే.. 2014 లోక్ సభ ఎన్నికల్లో మోడీని 'వికాస పురుషుడిగా', గర్జించే సింహంలా పార్టీ ప్రొజెక్ట్ చేసింది. ఆ తరువాత మోడీ ప్రభుత్వ ఎకనామిక్ అజెండాగా లయన్ మారింది. 'మేకిన్ ఇండియా' లోగో సైతం సింహమే మరి ! అంటే మృగరాజంటే తనకున్న మక్కువను మోడీ పరోక్షంగా చాటుకున్నారు. మేకిన్ ఇండియా లోగోను వీడెన్ కెన్నెడీ అనే విదేశీ సంస్థ రూపొందించింది. ఇక చరిత్ర విషయానికొస్తే అశోక చక్రవర్తి మరీ అంత ఉదారుడు కాడు. నాడు అశోకుడు సాగించిన అతి సుదీర్ఘ కళింగ యుద్ధంలో సుమారు రెండున్నర లక్షల మంది మరణించారు. కళింగ సామ్రాజ్యాన్ని తన హస్తగతం చేసుకునేందుకు ఆయన ఈ వార్ కి దిగాడు. ఆ తరువాత ఇందుకు పశ్చాత్తాపం ప్రకటించినా.. తన సార్వభౌమాధికారానికి గుర్తుగా నాలుగు సింహాల చిహ్నాన్ని ఆవిష్కరించాడు. కానీ ఆ తరువాత సారనాధ్ లో అది చరిత్ర అడుగున పడిపోయింది.

శతాబ్దాల తరబడి ఈ చిహ్నాన్ని అంతా విస్మరించారు. దాదాపు శిథిలాల కింద ఉండిపోయిందా చిహ్నం. 1905 లో బ్రిటిష్ ఆర్కియాలజిస్టులు తవ్వకాలు జరిపినప్పుడు ఇది బయటపడింది. కొన్ని దశాబ్దాల అనంతరం నూతన భారతావని ఏర్పడగా కాన్సిట్యూయెంట్ అసెంబ్లీ (అప్పటి పార్లమెంట్) ఓజాతీయ చిహ్నం కోసం తహతహలాడింది. ఇందుకు అనువుగా ఓ ఎంబ్లెమ్ ని రూపొందించాలని అప్పటి ప్రధాని నెహ్రూ సివిల్ సర్వీసు అధికారి బద్రుద్దీన్ త్యాబ్జీని ఆదేశించారట.. దీంతో త్యాబ్జీ భార్య సురయ్యా త్యాబ్జీ.. మొట్టమొదటి ఎంబ్లెమ్ డ్రాఫ్ట్ ని రూపొందించింది. కాగా నాడు దేశ విభజన సమయంలో తన తండ్రిపై హత్యాయత్నం జరిగిందని, తాము పారిపోయామని ఈ దంపతుల కుమార్తె లైలా త్యాబ్జీ నాటి సంఘటనలను గుర్తుకు చేసుకుంటూ తెలిపింది. ఏమైనా.. నూతన చిహ్నం నెహ్రూ భావాలకు అనుగుణంగా ఇందుకు అనువైన పోకడలతో ఉన్నట్టు ఆమె పేర్కొంది. రఫ్ స్కెచ్ లో ఉన్న చిహ్నాన్ని శాంతినికేతన్ లోని దీనానాథ్ భార్గవ అనే ఆర్ట్ స్టూడెంట్ తిరిగి రీఫైన్ చేశాడట.. చివరకు అధునాతన ఇండియా .. ఈ అధునాతన సింహాల చిహ్నాన్ని పొందగలిగింది. నాడు శాంతి, సహనాలకు చిహ్నంగా ఈ సింహాలుంటే ఇప్పుడు మోడీ మార్క్ సింహాల గుర్తు ఉగ్రంగా కనిపిస్తున్నదంటే..ఇది ఆయన ఆలోచనల 'రూపమే'నని చెప్పక తప్పదంటున్నారు. అయితే పాత చిహ్నం మాదిరే ఇదీ ఉందని, తాము మార్పేమీ చేయలేదని ఈ కొత్త ఎంబ్లెమ్ రూపకర్తలు సునీల్ దియోర్, రోమియెల్ మోసెస్ చెబుతున్నారు. దీనిపై వివాదం ఎందుకు రేగిందో తమకు అర్థం కావడంలేదంటున్నారు. ఏది ఏమైనా.. కొత్త చిహ్నంలో ఎడమవైపు సింహం ప్రతిమ ఒరిజినల్ స్టయిల్ లో ఉండగా కుడి వైపున్న ప్రతిమ మోడీ వెర్షన్ ని పోలి ఉందని, తక్షణమే దీన్ని మార్చేయాలని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ డిమాండ్ చేస్తున్నారంటే ఇది ఎంత రచ్చ రేపుతోందో అర్థమవుతూనే ఉంది.

First Published:  13 July 2022 5:46 AM IST
Next Story