సొంత బ్రాండ్ ఇమేజ్‌తో జగన్ దూకుడు!
ఇటీవల ముగిసిన వైసీపీ ప్లీనరీ పలు విషయాలను తేటతెల్లం చేస్తోంది. ఇప్పటివరకూ తండ్రి పేరును ప్రస్తావిస్తూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానంటూ చెప్పుకొచ్చిన జగన్ ఆయన నీడనుంచి బయటపడి సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రయత్నాల్లో సపలీకృతుడయినట్టేనని భావిస్తున్నారు.
ఇటీవల ముగిసిన వైసీపీ ప్లీనరీ పలు విషయాలను తేటతెల్లం చేస్తోంది. ఇప్పటివరకూ తండ్రి పేరును ప్రస్తావిస్తూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానంటూ చెప్పుకొచ్చిన జగన్ ఆయన నీడనుంచి బయటపడి సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రయత్నాల్లో సపలీకృతుడయినట్టేనని భావిస్తున్నారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (వైఎస్సార్)పేరు ధ్వనించేలా 'యువజన,శ్రామిక,రైతు (వైఎస్ఆర్)) కాంగ్రెస్ పార్టీ' ని స్థాపించారు.
అప్పటినుంచి ప్రతి అడుగులోనూ వైఎస్సార్ కనిపించేలా ప్రతి మాటలోనూ ఆయన పేరే వినిపించేలా వ్యవహరించారు. అయితే ప్లీనరీ సమావేశాల్లో ఆయనలో కానీ, పార్టీ శ్రేణుల్లో కానీ జగన్ బ్రాండ్ నేమ్ తో మళ్ళీఅధికారంలోకి రావడం ఖాయమనే ఉత్సాహం కనిపించింది. జగన్ పార్టీ శాశ్వత అధ్యక్షుడుగా ఎన్నికవ్వడం, అప్పటివరకూ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ విజయమ్మ పదవినుంచి తప్పుకోవడం వంటి విషయాల వెనక వైఎస్సార్ ప్రభావం నుంచి బయటపడి సొంత బ్రాండ్ ను సృష్టించుకోవాలనే ఆలోచన కనబడుతోందంటున్నారు.
సొంతవాళ్ళనే పక్కనపెట్టి..
పార్టీ స్థాపించి దాదాపు 11యేళ్ళు అయిపోయింది. అప్పట్నుంచి ఆయనకు తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, దగ్గరి బంధువు సుబ్బారెడ్డి వంటి వారు అండగా నిలిచారు. ఓదార్పు యాత్ర పేరుతో పర్యటన చేస్తున్న సందర్భంలో అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్ళారు. ఆ సమయంలో షర్మిల పాదయాత్ర కొనసాగించారు. ప్రజల్లోకి దూసుకు వెళ్ళారు.
ఆ తర్వాత జగన్ జైలు నుంచి విడుదలయ్యారు. పార్టీని మరింత ఉత్సాహంగా నడిపించాలనే ఉద్దేశంతో పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా దూకుడుగా వ్యవహరిస్తున్న సోదరి షర్మిల వర్గాన్ని పక్కనబెడుతూ వచ్చారు. 2014 ఎన్నికల్లో లోక్ సభ సభ్యుడిగా ఎన్నికైన సుబ్బారెడ్డికి ఆ తదుపరి ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు.
పార్టీలో షర్మిల చురుకుగా ఉంటుండడంతో ఆమె ప్రభావం కూడా బాగానే ఉండేది. చివరికి ఇది పార్టీలో మరో పవర్ సెంటర్ గా మారే ప్రమాదం ఉందని ఆమె ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ వచ్చారు జగన్. విజయసాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి వంటివారికి ప్రాధాన్యం కల్పిస్తూ బాధ్యతలు అప్పజెప్పారు. పార్టీలో పరిణామాలను గమనిస్తున్న షర్మిల తెలంగాణలో సొంతంగా వైఎస్సార్‌టీపీ పేరుతో పార్టీ పెట్టుకున్నారు.
విజయమ్మ కూతురి పై ప్రేమతోనే వైస్సార్‌సీపీకి స్వచ్ఛందంగానే రాజీనామా చేశారని చెప్పుకుంటున్నా జగన్ అటువంటి పరిస్థితులు కల్పించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే ప్లీనరీలో జగన్ ను పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దీంతో గతంలో పార్టీకి కష్టపడి పనిచేసిన విజయమ్మ, షర్మిల ప్రస్థానం వైఎస్సార్‌సీపీలో ముగిసి రాజశేఖరరెడ్డి ముద్ర నుంచి బయటపడినట్టయింది.
మారిన నినాదాలు..
పార్టీ స్థాపించినప్పటినుంచీ రాజశేఖర రెడ్డి ప్రస్తావన లేని ప్రసంగం కానీ, హామీలు కానీ, పథకాలు కానీ లేవు. వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం, ఉచిత విద్య, ఆరోగ్య సంరక్షణకు ఆరోగ్యశ్రీ వంటి ముఖ్యమైన పథకాలను అమలు చేస్తానని వాగ్దానం చేస్తూ, వైఎస్ఆర్ వారసత్వాన్ని ఆధారం చేసుకుంటూ ఎదిగారు. 2014 ఎన్నికల్లో ఆయన చిత్రాలు కూడా విస్తృతంగా ఉపయోగించుకున్నారు.
ఆ ఎన్నికల్లో ' రాజన్న రాజ్యం' పేరుతో ఎంతో గట్టిగా ప్రచారం చేసిన జగన్ 2019 ఎన్నికల నాటికి నినాదాన్ని మార్చేశారు.' రావాలి జగన్.. కావాలి జగన్' అంటూ ప్రచారం ప్రారంభమైంది. దీంతో పాటు ఎన్డీయే భాగస్వామ్య పార్టీ గా ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని, కార్పోరేట్లకు కొమ్ముకాసారని, రాష్ట్ర విభజన హామీలు అమలు చేయించలేకపోయారని, ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని టీడీపీపై ప్రచారం చేస్తూ ఆ ఎన్నికల్లో జగన్ గెలిచారు. ఈ ఎన్నికల్లో జగన్ గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభావం, ప్రస్తావన వెనకబడ్డాయి. అప్పటినుంచి కొత్త బ్రాండ్ జగన్ పేరుతో తెర ముందుకు విస్తృతంగా వచ్చింది.
వచ్చే ఎన్నికలకు కూడా జగన్ తన సొంత ఇమేజ్ తోనే ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టు కనబడుతుంది. రైతులకు, విద్యార్థులకు, శ్రామికులకు, కులమత పార్టీలకు అతీతంగా తన హయాంలో అమలు చేసిన పథకాలను, కార్యక్రమాలను ప్రజల్లోకి వెళ్ళి వివరిస్తూ ఓట్లను పొందాలని భావిస్తున్నారు. ఇటీవల ఆయన ప్రసంగాల్లో ఎక్కువగా ప్రజలను ఉద్దేసించి 'మీ జగన్ అన్నను, మీ తమ్ముడ్ని, మీ ఇంటి కొడుకుని వస్తున్నా' అంటూ సంబోధిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఎక్కడా వైఎస్సార్ ప్రస్తావన ఉండడంలేదు. అలాగే ప్రచార చిత్రాల్లో కూడా వైఎస్సార్ బొమ్మ బదులు జగన్ బొమ్మలు కనబడుతున్నాయి. అంటే ఇకపై వైసీపీ అంటే జగన్, జగన్ అంటే వైసీసీ అనే మోడల్ లోనే నడవాలనే ధోరణిలో ఉన్నట్టు కనబడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.