ఉపరాష్ట్రపతి ఎన్నికకు విపక్ష ఉమ్మడి అభ్యర్థి … చొరవ తీసుకున్న కేసీఆర్
రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాకి పూర్తి మద్దతునిచ్చిన తెలంగాణ సీఎం, టీఆరెస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో తగిన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు చొరవ తీసుకుంటున్నారు. ఎన్డీఎ తరఫున ఈ పదవికి అభ్యర్థిని బీజేపీ ఇంకా ఎంపిక చేయవలసి ఉన్న తరుణంలో .. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో తగిన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ముందే యత్నించాలన్నది ఆయన అభిమతంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాల నుంచి […]
రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాకి పూర్తి మద్దతునిచ్చిన తెలంగాణ సీఎం, టీఆరెస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో తగిన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు చొరవ తీసుకుంటున్నారు.
ఎన్డీఎ తరఫున ఈ పదవికి అభ్యర్థిని బీజేపీ ఇంకా ఎంపిక చేయవలసి ఉన్న తరుణంలో .. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో తగిన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ముందే యత్నించాలన్నది ఆయన అభిమతంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాల నుంచి ఇందుకు తగిన అభ్యర్థిని సెలెక్ట్ చేసేందుకు ఆయన కొంతమంది బీజేపీయేతర పార్టీల నేతలతో టచ్ లో ఉన్నట్టు సమాచారం.. వారితో ఆయన ఫోన్ లో మాట్లాడారని తెలిసింది.
రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేసినట్టుగానే ఈ ఎన్నికలో కూడా ఏకాభిప్రాయంతో విపక్షాలన్నీ కలిసి ఒకరిని నిలబెట్టాలని ఆయన యోచిస్తున్నారని టీఆరెస్ వర్గాల ద్వారా తెలిసింది. ప్రధాని మోడీని, బీజేపీ ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్న కేసీఆర్.. నాన్-బీజేపీ పార్టీలను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికను వినియోగించుకోగోరుతున్నారు.
పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. పార్లమెంట్ లో టీఆరెస్ సభ్యులు 16 మంది ఉన్నారు. వీరిలో 9 మంది లోక్ సభకు, ఏడుగురు రాజ్యసభకు చెందిన ఎంపీలు.
ఈ నేపథ్యంలో విపక్షాల తరఫున అభ్యర్థి ఎంపిక విషయమై చర్చించేందుకు బీజేపీయేతర పార్టీల నేతలు ఒకటి, రెండు రోజుల్లో ఢిల్లీలో సమావేశం కావచ్చునని తెలుస్తోంది. ఈ సమావేశంలో తెరాస తరఫున పాల్గొనేందుకు ఒక ప్రతినిధిని కేసీఆర్ ఢిల్లీకి పంపవచ్చునని అంటున్నారు. అయితే ఈ ప్రతినిధి ఎవరన్నది ఇంకా స్పష్టం కాలేదు.
రాష్ట్రపతి ఎన్నికకు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక విషయంలో చర్చించేందుకు గత జూన్ చివరి వారంలో ఢిల్లీలో జరిగిన విపక్షాల సమావేశానికి కేసీఆర్ హాజరు కాలేదు. మరి ఈ సారి నాన్-బీజేపీ పార్టీ నేతల సమావేశం ఎలా జరగనుందన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.
ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్టు 10 తో ముగియనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ ని ఈ నెల 5 న జారీ చేసింది. ఆగస్టు 6 న ఈ ఎన్నిక జరగనుంది. ఈ నెల 19 నామినేషన్ల దాఖలుకు చివరితేదీ. ఉపసంహరణకు చివరితేదీ ఈ నెల 22. ఆగస్టు 6 నే ఓట్ల లెక్కింపు కూడా జరగవచ్చు.