కొలంబోలోనే లంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే… పారిపోలేదట !
దేశంలో రేగిన నిరసనలతో భయపడి పారిపోయినట్టు చెబుతున్న శీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే రాజధాని కొలంబోలోనే ఉన్నారట.. . అయితే దాదాపు 4 రోజులు ఎక్కడున్నారో తెలియదు గానీ వచ్చీ రాగానే త్రివిధ దళాల కమాండర్లతోను, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ తోను సమావేశమై తాజా పరిణామాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ఆయన రేపు రాజీనామా చేసే అవకాశాలున్నాయి. ఆయన ఈ నెల 9 న దేశం వదిలి పారిపోయాడని వచ్చిన వార్తలను పార్లమెంట్ స్పీకర్ మహీందా తోసిపుచ్చారు. […]
దేశంలో రేగిన నిరసనలతో భయపడి పారిపోయినట్టు చెబుతున్న శీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే రాజధాని కొలంబోలోనే ఉన్నారట.. . అయితే దాదాపు 4 రోజులు ఎక్కడున్నారో తెలియదు గానీ వచ్చీ రాగానే త్రివిధ దళాల కమాండర్లతోను, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ తోను సమావేశమై తాజా పరిణామాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది.
ఆయన రేపు రాజీనామా చేసే అవకాశాలున్నాయి. ఆయన ఈ నెల 9 న దేశం వదిలి పారిపోయాడని వచ్చిన వార్తలను పార్లమెంట్ స్పీకర్ మహీందా తోసిపుచ్చారు. మీడియాలో వచ్చినవి ఊహాగానాలేనని ఆయన ఎక్కడికీ వెళ్లలేదని, దేశంలోనే ఉన్నారని స్పీకర్ కార్యాలయం తెలిపింది. పైగా ఆయన బుధవారం రాజీనామా చేస్తారని తాము ఇదివరకే ప్రకటించామని పేర్కొంది.
గొటబాయ పారిపోయారని చెప్పి తానొక పొరబాటు చేశానని స్పీకర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ నెల 13 న రాజీనామా చేస్తానని గొటబాయ స్పీకర్ కి ఇదివరకే స్పష్టం చేసినట్టు ఈయన కార్యాలయం వెల్లడించింది. మొత్తానికి ఆయన కొలంబో లో ఉన్నట్టు రూఢి అయింది. కానీ ఆయన సముద్రమార్గం ద్వారానో, విమానంలోనో పారిపోతున్నట్టు వార్తలు, వీడియోలు బయటికొచ్చినప్పటికీ.. వాటి విషయం సస్పెన్స్ గానే ఉంది.
ఇక గొటబాయ పదవి నుంచి దిగిపోగానే మొత్తం మంత్రివర్గసభ్యులంతా రాజీనామా చేయనున్నారు. తమ బాధ్యతలను తాత్కాలికంగా ఏర్పడే అఖిలపక్ష ప్రభుత్వానికి అప్పగించనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే తాను కూడా పదవి నుంచి దిగిపోతానని రణిల్ విక్రమసింఘే ప్రకటించారు. ఈయన ప్రధాని పదవికి రాజీనామా చేసినప్పటికీ అఖిల పక్ష ప్రభుత్వం ఏర్పడేంతవరకు పదవిలో కొనసాగనున్నారని ఇదివరకే స్పష్టమైంది.
పార్లమెంట్ ఈ నెల 15 న సమావేశం కానుంది. ఇక కొత్త అధ్యక్షుడిని ఈ నెల 20 న ఎన్నుకోనున్నట్టు స్పీకర్ మహీందా ప్రకటించారు. ఆ రోజున బ్యాలట్ నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పని చేయాలని, పార్లమెంటును ఎవరూ బయటినుంచి శాసించజాలరని, దీనిపై ఎవరూ నియంతృత్వం వహించజాలరని రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకే తానున్నానన్నారు.
మరోవైపు తాత్కాలిక అధ్యక్షునిగా సాజిత్ ప్రేమదాసను ఎంపిక చేయాలని లంక ప్రధాన ప్రతిపక్షం సమగి జన బలవేగయ నిన్న ఏకగ్రీవంగా నిర్ణయించింది. దేశంలోని పరిణమాలను తాము నిశితంగా గమనిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి తెలిపారు. శ్రీలంక సమస్యకు సానుకూల పరిష్కారాన్ని తాము కనుగొంటామన్నారు.