ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమేనా!?
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలు గెలుపొంది తనకు తిరుగులేదని నిరూపించుకునేందుకు ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. అదే సమయంలో ఎలాగైనా సరే వైసీపీని ఓడించి అధికారంలోకి రావాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తహతహలాడుతోంది. ఈ సారి తన సత్తా చాటి అధికారం అందుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశిస్తున్నారు. అధికారమే లక్ష్యంగా ఈ మూడు పార్టీలు వారి వ్యూహాలు, ప్రయత్నాల్లో తలమునకలవుతున్నారు. అయితే […]
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలు గెలుపొంది తనకు తిరుగులేదని నిరూపించుకునేందుకు ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు.
అదే సమయంలో ఎలాగైనా సరే వైసీపీని ఓడించి అధికారంలోకి రావాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తహతహలాడుతోంది. ఈ సారి తన సత్తా చాటి అధికారం అందుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశిస్తున్నారు. అధికారమే లక్ష్యంగా ఈ మూడు పార్టీలు వారి వ్యూహాలు, ప్రయత్నాల్లో తలమునకలవుతున్నారు.
అయితే ఇదే సందర్భంలో ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందనే ఆలోచన పై వైసీపీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మూడేళ్ళుగా తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ప్రజలు తమ పట్ల సానుకూలంగా ఉంటారనే ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు.
సామాజిక న్యాయం అమలయ్యేలా ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకున్నామని, ప్రతి కుటుంబంలోనూ తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకం లబ్ధిదారులు ఉంటారని వారే తమకు తిరిగి అధికారం కట్టబెట్టడంలో తోడ్పడతారని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందుకే గంపగుత్తగా సీట్లన్నింటినీ గెలుచుకోవడం సుసాధ్యమేననే ధీమాలో ఉన్నారు.
ఇటీవల భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభకు ప్రధాని మోడీ హాజరైన సందర్భంలో ముందస్తు ఎన్నికల ప్రస్తావన వచ్చినట్టు చెబుతున్నారు. ప్రధాని మోడీని గన్నవరం విమానాశ్రయం నుంచి భీమవరం సభాస్థలికి, అక్కడి నుంచి తిరిగి విమానాశ్రయంలో వీడ్కోలు పలికే వరకూ మోడీ వెంటే ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. ఈ సందర్భంలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు రెవెన్యూలోటు నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు.
దీనితో పాటు చూచాయగా రాష్ట్రంలోని రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై ఇద్దరి మధ్య స్వల్ప చర్చ జరిగిందని తెలిసింది. అప్పుడే ముందస్తు ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చిందని అంటున్నారు. నేరుగా చెప్పకుండానే ఈ ఆలోచనకు ప్రధాని కూడా సానుకూలంగానే ఉన్నారనే వార్తలు వెలువడుతున్నాయి. సంక్షేమ పథకాల పేరుతో ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉందని మరింత కాలం ముందుకు సాగితే ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారే ప్రమాదం కూడా ఉంటుందనే అంశం ప్రస్తావనకు వచ్చిందంటున్నారు. అంటే ఏపీలో ముందస్తు ఎన్నికలకు కేంద్రం సానుకూలంగా ఉందనే సంకేతాలు వచ్చినట్టేనని వైసీపీ శేణుల్లో చర్చ జరుగుతోంది.
భీమవరం సభకు ముందు వరకు ముందస్తు ఎన్నికలపై అక్కడా ఇక్కడా చర్చలు జరగడమే తప్ప ముఖ్యమంత్రి దీనిపై సీరియస్ గా స్పందించింది లేదు. కానీ ప్రధాని మోడీ భీమవరం పర్యటన అనంతరం జగన్ లో మునుపటి కంటే ఉత్సాహం కనిపిస్తోందని పార్టీ శ్రేణులే చెప్పుకుంటున్నాయి. ఇది రెండు రోజుల పాటు జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో స్పష్టంగా కనిపించింది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలనే సంకేతాలను ఇచ్చారు.
షెడ్యూల్ ప్రకారం ఏపీలో ఎన్నికలు 2024 లో జరగాల్సి ఉంది. అయితే వచ్చే యేడాది 2023 ఏప్రిల్ మొదటివారం లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని జగన్ నిర్ణయించారని తెలుస్తోంది. ఎన్నికల ముందుగానే పాలనాపరంగా మిగిలి ఉన్న నిర్ణయాలు, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలు పూర్తి చేసేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిసింది.
అలాగే ప్రభుత్వానికి సవాలుగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. పార్టీలనూ ప్రభుత్వం లోనూ జరుగుతున్న కసరత్తు చూస్తుంటే ముందస్తు ఎన్నికలు జరగడం ఖాయంగానే కనిపిస్తోంది.