నేను హైదరాబాద్ రావడం లేదు.. మీరే ఢిల్లీకి రండి
తెలంగాణ బీజేపీ నేతలకు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము షాక్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆమె హైదరాబాద్‌లో పర్యటించాల్సి ఉంది. కానీ భారీ వర్షాల కారణంగా పర్యటన రద్దు చేసుకున్నట్లు ఆమె బీజేపీ నాయకులకు సమాచారం పంపారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. టీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ తీయడమే కాకుండా.. జలవిహార్‌లో సభను కూడా నిర్వహించారు. వారికి దీటుగా ద్రౌపది […]
తెలంగాణ బీజేపీ నేతలకు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము షాక్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆమె హైదరాబాద్‌లో పర్యటించాల్సి ఉంది.
కానీ భారీ వర్షాల కారణంగా పర్యటన రద్దు చేసుకున్నట్లు ఆమె బీజేపీ నాయకులకు సమాచారం పంపారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. టీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ తీయడమే కాకుండా.. జలవిహార్‌లో సభను కూడా నిర్వహించారు. వారికి దీటుగా ద్రౌపది ముర్ముకు కూడా బ్రహ్మాండమైన స్వాగతం పలకాలని బీజేపీ స్టేట్ కమిటీ భావించింది.
బేగంపేట విమానాశ్రయం నుంచి సోమాజిగూడ వరకు కార్ల ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. అంతే కాకుండా ఓ స్టార్ హోటల్‌లో గిరిజన, ఆదివాసీ నాయకులు, ప్రజలు, మాజీ బ్యూరోక్రాట్లు, మేధావులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని కూడా భావించారు.
ఇందుకు తగిన ఏర్పాట్లను కూడా బీజేపీ పూర్తి చేసింది. కానీ, చివరి నిమిషంలో ముర్ము తన పర్యటన రద్దు చేసుకున్నారు. తొలుత వాయిదా మాత్రమే వేసినట్లు బీజేపీ ప్రకటించినా.. ఇప్పుడు మొత్తానికే రద్దయినట్లు సమాచారం. కాగా, ఈ నెల 18నే పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో తాను హైదరాబాద్ రాలేనని.. బీజేపీ ప్రజాప్రతినిధులు ఢిల్లీకి వస్తే ప్రత్యేకంగా సమావేశం అవుతానని ముర్ము సమాచారం పంపారు. ఎంతో ఆర్భాటంగా ముర్ముకు స్వాగతం పలుకుదామనుకున్న బీజేపీ నేతలు.. ఈ విషయం తెలిసి డీలా పడ్డారు.
ఏపీకి ముర్ము..
ఒకవైపు వర్షాల కారణంగా తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్న ద్రౌపది ముర్ము.. ఏపీలో మాత్రం పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆమె వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో మంగళగిరిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో భేటీ కానున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీయే అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎలక్టోరల్ కాలేజీలో 4 శాతం ఓట్లున్న వైసీపీ మద్దతు ముర్ముకు కీలకం. దీంతో ఆ పార్టీ ప్రజాప్రతినిధులను కలిసి మద్దతు కోరడమే కాకుండా, వారికి ధన్యవాదాలు కూడా చెప్పనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను స్వయంగా సీఎం జగన్ పరిచయం చేయనున్నారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత సీఎం జగన్ ఇంటికి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రితో తేనీటి విందు ముగించుకొని తిరిగి ఢిల్లీ వెళ్తారు.