'ఫైటర్'తో ఫైటింగా! మజాకా !!
కేసీఆర్ ఒక ఫైటర్. ఎవరికి, ఎలాంటి కేసులకు భయపడే వ్యక్తి కాదు. ఒకటి రెండు కేసులు పెడితే కోర్టుల ద్వారా కొట్లాడతాం.. వెనకడుగు వేయం." అని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తర్జనభర్జన చేస్తోంది."కేసీఆర్ ను జైలుకు పంపుతాం. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే"! అని ప్రకటనలు గుప్పిస్తున్న ఆ పార్టీ నాయకులు తాజాగా డిఫెన్స్‌లో పడ్డారు.
"కేసీఆర్ ఒక ఫైటర్. ఎవరికి, ఎలాంటి కేసులకు భయపడే వ్యక్తి కాదు. ఒకటి రెండు కేసులు పెడితే కోర్టుల ద్వారా కొట్లాడతాం.. వెనకడుగు వేయం." అని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తర్జనభర్జన చేస్తోంది."కేసీఆర్ ను జైలుకు పంపుతాం. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే"! అని ప్రకటనలు గుప్పిస్తున్న ఆ పార్టీ నాయకులు తాజాగా డిఫెన్స్‌లో పడ్డారు. వ్యూహాత్మకంగా కేసీఆర్.. బండి సంజయ్ తదితర నాయకులను ఇరకాటంలోకి నెట్టివేశారు.
'టీఆర్ఎస్ హయాంలో ఎవరూ సంతోషంగా లేరు. ఈ అరాచక పాలన అంతమయ్యే సమయం ఆసన్నమైంది. త్వరలోనే సీఎం కేసీఆర్, కేటీఆర్‌ను జైలుకు పంపుతాం. టీఆర్ఎస్ పాలనతో విసుగుచెందిన ప్రజలు మార్పును కోరుకుంటున్నారు.
ఆ మార్పు బీజేపీతోనే సాధ్యం' అని టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గడచిన ఏడాది కాలంగా చెబుతున్నారు."కేసీఆర్‌ను గద్దె దించేందుకు నేను అవసరం లేదు. బండి సంజయ్ ఒక్కడు సరిపోతాడు".అని బండి సంజయ్ రెండవ దశ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపులో అమిత్ షా అన్నారు. అదే నిజమైతే, బండి సంజయ్ ఒక్కరే కేసీఆర్ ను ఓడించగలిగేటట్లయితే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల పేరిట 'దండయాత్ర'మాదిరిగా సైన్యాన్ని మోహరించడం ఎందుకో! బీజేపీ నాయకులే చెప్పాలి.
ఆ సమావేశాలు ముగిసిన అర్ధరాత్రే నోవాటెల్ హోటల్ లో టీబీజేపీ కీలక నాయకులతో అమిత్ షా జరిపిన 'రహస్య మంతనాలు'ఏమిటి? బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వెల్లడించిన 'సీక్రెట్ ఆపరేషన్'కు ప్లానింగ్ చేశారా? ఆ 'ఆపరేషన్' ఎప్పటినుంచి అమల్లోకి వస్తుంది? ఇప్పటికే దాని అమలు ప్రక్రియ ప్రారంభించారా? ఇలాంటి ప్రశ్నలకు, సందేహాలకు బీజేపీ నాయకత్వం ఎలాగూ జవాబు చెప్పదు. ఆ పార్టీ క్యాడర్ కు అయినా స్పష్టత రావలసి ఉంది.
ఇక "పైనుంచి వచ్చిన డైరెక్షన్ లోనే కేసీఆర్ మాట్లాడారు. జూలై 15 వ తేదీలోపు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి అసెంబ్లీ రద్దుకు నిర్ణయించాలి"అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. 'ముందస్తు' ఎన్నికలను ఆహ్వానించడం వేరు. టీఆర్ఎస్ ను పడగొడతామని తొడగొట్టడం వేరు. అందుకు తగిన ప్రణాళికలు రచించడం వేరు. కానీ అసెంబ్లీ రద్దు కోసం 'డెడ్ లైను' పెట్టడం ఏమిటో ఎవరికీ అంతుచిక్కదు. "పై నుంచి డైరెక్షన్" అంటే బీజేపీ నుంచి కేసీఆర్ కు సలహాలు అందుతున్నట్టు రేవంత్ ఆరోపణ! ఇది ఎంతవరకు నిజమో టీపీసీసీ సారధికే తెలిసి ఉండాలి. ఒకవైపు కేసీఆర్ ను జైలుకు పంపుతామని, ఆయనను గద్దె దింపుతామని, తామే కేసీఆర్ కు ప్రత్యామ్నాయమని బీజేపీ రంకెలు వేస్తుండగా, బీజేపీ – కేసీఆర్ 'రహస్య మిత్రుల'ని రేవంత్ రెడ్డి అభియోగం మోపుతున్నారు.
"కాంగ్రెస్ -టీఆర్ఎస్ రెండూ ఒకటే! వాళ్లిద్దరూ మిత్రులు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కేసీఆర్ కు వేసినట్లే"! అని ఈటల రాజేందర్ తరచూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ 'కుమ్మక్కు' అయిన తీరును కేటీఆర్ అనేక సమావేశాల్లో ప్రస్తావించారు. కనుక ఈ రాజకీయ శక్తులలో ఎవరు ఎవరికి మిత్రులో, ఎవరు ఎవరికి శత్రువులో తెలంగాణ సమాజానికి అంతుచిక్కడం లేదు. తాము గందరగోళానికి గురై ప్రజల్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గందరగోళంలో పడవేస్తున్నాయి.
''ఆల్త్ ఫాల్త్ మనిషిని గాదు,నేను కేసీఆర్‌ను.తెలంగాణల ఏ మూలనైనా నాదే' అని ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు ఏడాది కిందట ఒక సభలో అన్నారు.తెలంగాణలో సుస్థిరప్రగతి ప్రతిపక్షాలకు కంటగింపుగా మారడంలో ఆశ్చర్యమేమీ లేదు.'యోధుడు'కేసీఆర్ తో తలపడడం అంటే సామాన్య విషయం కాదు.దానికి ఎంతో ప్రణాళిక,నిబద్ధత,తగిన ఆచరణ,సరంజామా,ఆయుధాలు అవసరం.కేసీఆర్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత 'సునామీ'లా ఉందని,కనుక ప్రజలు తమకు పట్టం గడతారని కాంగ్రెస్ నాయకుల నమ్మకం.వారి ఆశ.బీజేపీ నాయకులు ఇందుకు కొంత విరుద్ధం.ప్రజల్లో మతపరమైన 'విభజన' తీసుకురావడం,అవసరమైతే ఉద్రిక్తతలకు ఊపిరి పోయడం, శాంతి భద్రతలకు భంగం కలిగించడం, కేసీఆర్ హిందువుల వ్యతిరేకి అని ముద్ర వేయడం.. వంటి పలు అంశాలకు పదును పెడుతున్నారు.ఏక్ నాథ్ షిండే,కట్టప్పలు.. వంటి వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం ముమ్మాటికీ 'మైండ్ గేమ్'!
తెలంగాణ రాజకీయ ప్రయోగశాల అన్నది పాతమాట.అది 'నెగెటివ్' కోణంలో వాడుతుంటాం.అయితే తెలంగాణను అభివృద్ధికి,నూతన ఆవిష్కరణలకు,వినూత్న పంథాకు 'ప్రతీక' గా మార్చడం కేసీఆర్ కే సాధ్యమైంది.ఎనిమిదేండ్లుగా తెలంగాణలో ఏమి జరుగుతోందో,సాఫల్య వైఫల్యాలు ఎమిటో ప్రజలకు తెలుసు.కేసీఆర్ 'పల్లె కన్నీరు'ను తుడిచారు.వ్యవసాయం,ఇరిగేషన్,విద్యుత్తు,ఐ.టి, మౌలిక సదుపాయాలు తదితర రంగాలలో సాధించిన,సాధిస్తున్న ప్రగతి గురించి సర్టిఫికెట్ కాంగ్రెస్,లేదా బీజేపీ ఇవ్వవలసిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి,బండి సంజయ్ ల సర్టిఫికెట్ అసలే అవసరం లేదు.
కేసీఆర్, తెలంగాణ.. ఈ రెండు పదాలు, రెండు పేర్లు అవిభాజ్యమైనవి.కేసీఆర్ పాలనలో అన్నీ మెరుపులే,అద్భుతాలే జరిగాయని చెప్పడంలేదు.కొన్ని మరకలు సహజం.పాలనను నడిపే అధికారులు,ప్రభుత్వ పథకాల అమలు ప్రక్రియలో స్థానిక ఎమ్మెల్యేల నిష్క్రియాపరత్వం,కొన్ని పథకాలను పరిపూర్ణంగా అమలు చేయడంలో సాధారణంగా ఎదురయ్యే ఆటంకాలు,ఆర్ధిక పరిమితులు.. వగైరా ప్రభుత్వం పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడడం సహజమే!దాన్ని ఎట్లా అధిగమించాలో కేసీఆర్ కు తెలుసు.ఆ విద్యలో ఆయన ఆరితేరిన 'యోధుడు'.
గడచిన ఎనిమిది ఏండ్లలో 50 వేల కోట్లతో రైతుబంధు,లక్షన్నర కోట్లతో కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టుల అభివృద్ధి,76,751 రైతు కుటుంబాలకు 3,8 37.45 కోట్ల సాయం,28,473 కోట్లతో వ్యవసాయానికి విద్యుత్, ఏడాదికి 10,500 కోట్లతో ఉచిత నిరంతర విద్యుత్తు.. వంటి 'సక్సెస్ గ్రాఫ్' వ్యతిరేక గ్రాఫ్ ను ఓవర్ టేక్ చేయగలదని కేసీఆర్ నమ్ముతున్నారు.
"ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్ 25 సీట్లు గెల్చుకుంటుంది. మరో 17 సీట్లలో పోటా పోటీ ఉంటుంది.కాంగ్రెస్ పార్టీ 32 సీట్లలో గెలుస్తుంది.మరో 23 సీట్లలో గట్టి పోటీ ఇస్తుంది.కేసీఆర్ గ్రాఫ్ భారీగా పడిపోయింది.కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది.ప్రశాంత్ కిషోర్ నివేదికలో ఈ అంశాలున్నాయి ".అని రేవంత్ రెడ్డి ధీమాగా చెబుతున్నారు.పార్టీ క్యాడర్ లో ధీమాను నింపే ప్రయత్నంగా కూడా విశ్లేషించవచ్చు.ప్రశాంత్ కిషోర్ నివేదిక ప్రతి ఒకటి రేవంత్ చేతుల్లోకి వెళ్లిందా? అది ఎట్లా నమ్మగలం?
కాగా తెలంగాణను ఎలా అభివృద్ధి చేశారో దేశానికి కూడా కేసీఆర్ కొత్త 'తొవ్వ' వేస్తారని టిఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నవి.'తెలంగాణ నమూనా' గురించి కేసీఆర్,టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మంత్రులు జగదీశ్ రెడ్డి,హరీశ్ రావు తదితర నాయకులు పలు సందర్భాల్లో ప్రజలకు వివరిస్తూ ఉన్నారు.మొత్తంమీద ప్రజలు 'మార్పు' కోరుకుంటున్నారా లేదా అన్నది జోస్యం చెప్పడం సమంజసం కాదు.