లంక గ్రామాలకు వరద ముప్పు..
నిన్నటి వరకూ గోదావరి వరదనీటి ప్రవాహంతో తెలంగాణ వణికిపోయింది. ఇప్పుడు ఆ ప్రభావం ఏపీపై స్పష్టంగా కనిపిస్తోంది. గోదావరి నదిలో లంక గ్రామాలు నీటమునిగాయి. పుష్కర ఘాట్ వద్ద ఒక్క రోజులోనే నీటిమట్టం 42 అడుగుల నుంచి 52 అడుగులకు పెరిగింది. దీంతో పోలీసు, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీసులు, అధికారులు కలిసి మధ్యాహ్నం లంక గ్రామాల్లోకి పడవల్లో వెళ్లారు. గ్రామస్తుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మహిళలు, పిల్లలను ముందుగా ఒడ్డుకు చేర్చారు. వరదనీరు మరింత పెరిగితే […]
నిన్నటి వరకూ గోదావరి వరదనీటి ప్రవాహంతో తెలంగాణ వణికిపోయింది. ఇప్పుడు ఆ ప్రభావం ఏపీపై స్పష్టంగా కనిపిస్తోంది. గోదావరి నదిలో లంక గ్రామాలు నీటమునిగాయి. పుష్కర ఘాట్ వద్ద ఒక్క రోజులోనే నీటిమట్టం 42 అడుగుల నుంచి 52 అడుగులకు పెరిగింది.
దీంతో పోలీసు, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీసులు, అధికారులు కలిసి మధ్యాహ్నం లంక గ్రామాల్లోకి పడవల్లో వెళ్లారు. గ్రామస్తుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మహిళలు, పిల్లలను ముందుగా ఒడ్డుకు చేర్చారు. వరదనీరు మరింత పెరిగితే మిగతా గ్రామాల్ని కూడా ఖాళీ చేయిస్తామంటున్నారు అధికారులు.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ దగ్గర సోమవారం రాత్రి 12 గంటలకు 11.75 అడుగుల నీటిమట్టం ఉంది. 10.02 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలిపెట్టారు. బ్యారేజీ అధికారులు తొలి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. బ్యారేజీ వద్ద 175 గేట్లు ఎత్తేశారు. డెల్టాకు 4 వేల క్యూసెక్కుల నీటిని ఇచ్చారు.
కోనసీమ జిల్లాలో 32 లంక గ్రామాలకు ముంపు ముప్పు పొంచి ఉంది. కాటన్ బ్యారేజీ వద్ద ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక నమోదైతే ఏడు గ్రామాలు, రెండో ప్రమాద హెచ్చరికకు 13 గ్రామాలు ముంపు బారిన పడతాయని అంచనా.
వరద ప్రభావిత ప్రాంతాల్లో కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ పర్యటించారు. పి.గన్నవరం పరిధిలోని జి.పెదపూడిని సందర్శించి సమీక్ష నిర్వహించారు. బోట్లు, లైఫ్ జాకెట్లు సిద్ధం చేయించారు. పునరావాస కేంద్రాల్లో బియ్యం, నిత్యావసరాలు, పాలు, తాగునీరు, గ్యాస్, డీజిల్ సిద్ధం చేస్తున్నారు.
అటు కృష్ణానది వరద ఉధృతి పెరగటంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించవద్దని హెచ్చరించారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అత్యవసర సహాయక చర్యలు చేపట్టింది. రెండు ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్ లు, మూడు ఎస్డీఆర్‌ఎఫ్ టీమ్ లను రంగంలోకి దింపింది.