నిన్న హిజాబ్.. నేడు కుర్తా పైజామా..
కర్నాటకలో హిజాబ్ వివాదం ఇప్పుడిప్పుడే కాస్త సద్దుమణుగుతోంది. హిజాబ్ ధరించిన విద్యార్థులకు విద్యా సంస్థల్లో ప్రవేశం లేదని న్యాయస్థానాలు కూడా తేల్చిచెప్పడంతో అక్కడ ఓ క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు బీహార్ లో కొత్త సమస్య వచ్చిపడింది. బీహార్ లోని లఖిసరాయ్ జిల్లాలో ఉపాధ్యాయులు ఇప్పుడు హడలిపోతున్నారు. బల్గుదర్ గ్రామంలో కుర్తా పైజామా ధరించి స్కూల్ కి వచ్చిన ఓ హెడ్‌మాస్టర్ ని ఏకంగా సస్పెండ్ చేసేలా ఆదేశాలిచ్చారు జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ సింగ్. ‘అసలు […]
కర్నాటకలో హిజాబ్ వివాదం ఇప్పుడిప్పుడే కాస్త సద్దుమణుగుతోంది. హిజాబ్ ధరించిన విద్యార్థులకు విద్యా సంస్థల్లో ప్రవేశం లేదని న్యాయస్థానాలు కూడా తేల్చిచెప్పడంతో అక్కడ ఓ క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు బీహార్ లో కొత్త సమస్య వచ్చిపడింది.
బీహార్ లోని లఖిసరాయ్ జిల్లాలో ఉపాధ్యాయులు ఇప్పుడు హడలిపోతున్నారు. బల్గుదర్ గ్రామంలో కుర్తా పైజామా ధరించి స్కూల్ కి వచ్చిన ఓ హెడ్‌మాస్టర్ ని ఏకంగా సస్పెండ్ చేసేలా ఆదేశాలిచ్చారు జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ సింగ్. ‘అసలు నువ్వు రాజకీయ నాయకుడివా లేక టీచర్ వా’ అంటూ మండిపడ్డారు. కుర్తా పైజామాలో స్కూల్ కి ఎలా వచ్చావంటూ నిలదీశారు. సస్పెండ్ చేసి, హెడ్‌మాస్టర్ కి జీతం కట్ చేయాలంటూ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు కలెక్టర్.
స్కూల్, కాలేజీల్లో విద్యార్థులకు యూనిఫామ్ ఉంది కానీ, టీచర్లకు డ్రెస్ కోడ్ ఏదీ లేదు. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో డ్రెస్ కోడ్ ఉంటుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విద్యాసంస్థల్లో జీన్స్ లు, స్లీవ్ లెస్ లు ధరించి రావొద్దని అంటారు, అది కూడా అనధికారికమే. అయితే బీహార్ లోని స్కూల్ హెడ్మాస్టర్ కనీసం జీన్స్ ఫ్యాంట్ కూడా వేసుకోలేదు. కుర్తా పైజామాతో వచ్చారు. అయితే ఆ డ్రెస్ కలెక్టర్ కి నచ్చకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజంగా ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా మందలించి వదిలేస్తారు, కానీ ఇక్కడ సస్పెన్షన్ ఆర్డర్, జీతంలో కోత అంటూ కలెక్టర్ హడావిడి చేయడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హైలెట్ అయింది.
కలెక్టర్ ని తప్పుబడుతున్న నెటిజన్లు..
కుర్తా పైజామా ధరించినందుకు స్కూల్ హెడ్‌మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించడాన్ని పలువురు నెటిజన్లు తప్పుపట్టారు. ‘టీచర్ కుర్తా, పైజామా ధరించడం భారతదేశంలో నేరమా? అని కొంతమంది ప్రశ్నించారు. ఈ ఇంగ్లిష్ కలెక్టర్ బాబు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేంటి అని మరికొందరు కామెంట్ చేశారు. మొత్తమ్మీద ఈ వ్యవహారంతో స్కూల్ టీచర్ల డ్రెస్ అనేది మరోసారి చర్చనీయాంశమైంది. అసభ్యంగా ఉన్న డ్రెస్ లు వద్దని చెప్పొచ్చు కానీ, మరీ కుర్తా పైజామాతో సమస్య ఏంటని నిలదీస్తున్నారు నెటిజన్లు. కానీ కలెక్టర్ మాత్రం రాజకీయ నాయకుడి లాగా డ్రెస్ ఎందుకు వేసుకొచ్చావంటూ హెడ్మాస్టర్ కి చీవాట్లు పెట్టారు. దీంతో బీహార్ లో కుర్తా పైజామాలు ఉన్న టీచర్లంతా హడలిపోతున్నారని నెట్టింట జోకులు పేలుతున్నాయి.