తంబీలు తన్నుకున్నారు… కర్రలతో , రాళ్ళతో దాడులు చేసుకున్న AIADMK వర్గాలు
తమిళనాడులో AIADMK నాయకత్వం కోసం జరుగుతున్న పోరు వీధుల్లో తన్నుకునేదాకా వచ్చింది. పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు కొద్ది సేపటి క్రితం కర్రలు, రాళ్ళతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకొన్నారు. రోడ్లపై తరిమి తరిమి రక్తాలు వచ్చేట్టు కొట్టుకున్నారు. ఒకరి పోస్టర్లను ఒకరు చించేశారు. బ్యానర్లను తొలగించారు. పోలీసులు కూడా వాళ్ళను ఆపలేకపోయారు. ఈ రోజు AIADMK రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించాలని పళని స్వామి వర్గం నిర్ణయించింది. అయితే ఆ సమావేశంలోకి పన్నీర్ సెల్వం వర్గం […]
తమిళనాడులో AIADMK నాయకత్వం కోసం జరుగుతున్న పోరు వీధుల్లో తన్నుకునేదాకా వచ్చింది. పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు కొద్ది సేపటి క్రితం కర్రలు, రాళ్ళతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకొన్నారు. రోడ్లపై తరిమి తరిమి రక్తాలు వచ్చేట్టు కొట్టుకున్నారు. ఒకరి పోస్టర్లను ఒకరు చించేశారు. బ్యానర్లను తొలగించారు. పోలీసులు కూడా వాళ్ళను ఆపలేకపోయారు.
ఈ రోజు AIADMK రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించాలని పళని స్వామి వర్గం నిర్ణయించింది. అయితే ఆ సమావేశంలోకి పన్నీర్ సెల్వం వర్గం వారిని రాకుండా అడ్డుకుంటున్నారు. మరో వైపు కార్యవర్గ సమావేశం ఈ రోజు జరగకుండా అడ్డుకోవాలని పన్నీర్ సెల్వం హైకోర్టుకెక్కారు. కోర్టు తీర్పు వచ్చే లోపే AIADMK కార్యాలయం ముందు ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి.
కాగా కార్యవర్గ సమావేశాలు ఆపాలన్న పన్నీర్ సెల్వం వ్యూహంపై హైకోర్టు నీళ్ళు చల్లింది. కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవచ్చని కోర్టు తీర్పు వెలువరించింది. ఈనేపథ్యంలో హైకోర్టునుండి తన అనుచరులతో కలిసి పన్నీర్ సెల్వం ర్యాలీగా AIADMK కార్యాలయానికి బయలుదేరారు.
దానికి ముందుగానే పళని స్వామి వర్గమంతా AIADMK కార్యాలయంలో మోహరించి ఉంది. కొద్ది సేపట్లో కార్యవర్గ సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి.
పన్నీర్ సెల్వం వర్గాన్ని ఈ సమావేశాలకు రానిస్తారా లేదా అనేది అనుమానంగానే ఉంది. రాష్ట్ర కార్యవర్గంలో పళనిస్వామికే మెజార్టీ ఉంది. ఏక నాయకత్వం కోసం జరుగుతున్న పోరులో ఈ రోజు పళని స్వామి గెల్చినప్పటికీ ఈ వర్గపోరు ఇప్పట్లో ఆగేలా కనపడటం లేదు.
కాగా ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం పళని స్వామిని పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొంటూ AIADMK కార్యవర్గం తీర్మానాన్ని ఆమోదించింది. డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పన్నీర్ సెల్వంను తొలగించింది. బహుళ నాయకత్వాన్ని కార్యవర్గం తిరస్కరించింది.