Telugu Global
NEWS

కేసీఆర్ కోర్టులోనే 'ముందస్తు'బంతి !

అత్యంత నిపుణుడైన వ్యూహాసంపన్నుడిని షువాయ్ జన్ తో పోల్చుతారు. షువాయ్ జన్ అనేది ఒక పాము. అది చుంగ్ పర్వతాల్లో కనబడుతుంది. దాని తలమీద కొడితే తోకతో.. తోక మీద కొడితే తలతో దాడి చేస్తుంది. దాన్ని మధ్యలో కొడితే తల, తోక రెండింటితోనూ దాడి చేస్తుంది" అని క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందిన చైనా యుద్ధరంగ నిపుణుడు సున్ త్సు చెప్పాడు.

KCR
X

"అత్యంత నిపుణుడైన వ్యూహాసంపన్నుడిని షువాయ్ జన్ తో పోల్చుతారు. షువాయ్ జన్ అనేది ఒక పాము. అది చుంగ్ పర్వతాల్లో కనబడుతుంది. దాని తలమీద కొడితే తోకతో.. తోక మీద కొడితే తలతో దాడి చేస్తుంది. దాన్ని మధ్యలో కొడితే తల, తోక రెండింటితోనూ దాడి చేస్తుంది" అని క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందిన చైనా యుద్ధరంగ నిపుణుడు సున్ త్సు చెప్పాడు. ఆదివారం రాత్రి తెలంగాణ నిర్మాత కేసీఆర్ 'దాడుల'ను షువాయ్ జన్ తోనే పోల్చక తప్పదు..! కేసీఆర్ మీడియా సమావేశమే ఒక కిక్కు. ఇక ఆయన తిడితే దాని కిక్కే వేరు !

టీఆర్ఎస్ లో 'షిండే'లు లేరు. ఉన్నది 'ఏక్ నాథ్' మాత్రమే. ఆయనే కేసీఆర్. ఆయన 'ఏకవీర'. బీజేపీ 'విజయసంకల్ప్' సభ ద్వారా ఆ పార్టీ 'సంకల్పం' కనిపిస్తూ ఉంది. కానీ 'విజయమే' ఎంత దూరంలో ఉన్నదో ఎవరూ చెప్పలేరు."ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 30 అసెంబ్లీ సీట్లు వస్తాయి" అనే ధీమాతో ఉన్నట్టు కేసీఆర్, జగన్‌లకు వ్యతిరేకంగా నిత్యం కథనాలను వండివార్చే ప్రముఖ దినపత్రిక ఒక తాజా కథనాన్ని సోమవారం సంధించి వదిలింది.

ఆశ్చర్యమేమిటంటే ఆ వార్తా కథనం పక్కనే "కాంగ్రెస్ కు 80 సీట్లు ఖాయమ"ని టీపీసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా చూడవచ్చు. దీన్ని బట్టి మనం ఎట్లా విశ్లేషించాలి? కాంగ్రెస్ కు 80, బీజేపీ 30 కి పైగా నిజంగానే సీట్లు లభించాయని ఊహిద్దాం! మజ్లిస్ పార్టీకి సాధారణంగా లభించే 7 స్థానాలను కలుపుకుంటే మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇక మిగిలేవి రెండే! ఆ రెండు అయినా కేసీఆర్ కు వస్తాయో.. లేక ఇండిపెండెంట్లకు రానున్నాయో.. సదరు దినపత్రిక చెప్పలేదు.

ఎటు చేసి ఆంధ్రప్రదేశ్ లో జగన్, తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రాకూడదని కేసీఆర్ 'మాజీ స్నేహితుడి' దినపత్రిక బలంగా కోరుకుంటోంది. అయితే మీడియా తలుచుకుంటే ఒకరిని అధికారంలోకి రాకుండా చేయడం, ఇంకొకరిని అధికారంలోకి తీసుకురావడం సాధ్యం కాదన్న సంగతి అందరికీ తెలుసు. కానీ అమాయకత్వంతోనో, తమ కాంక్ష నెరవేరాలనో ఎవరైనా 'కట్టుకథలు' అల్లితే ఎవరూ చేయగలిగిందేమీ లేదు. కేసీఆర్ మాజీ స్నేహితునికి ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ రెడ్డి లేదా ఈటల అధికారంలోకి రావాలన్న కోరిక నాటుకుపోయింది. ఆయన మైండ్ లో ఫిక్స్ అయినందున దాన్ని ఎవరూ పెకిలించలేరు. అలాంటి ప్రయత్నం కూడా అనవసరం.

కేసీఆర్ కు వర్తమాన రాజకీయాలపైన పూర్తి అవగాహన, పట్టు, స్పష్టత ఉన్నాయి. వాటికి తోడు ఆయనకున్న 'కమ్యూనికేషన్ స్కిల్స్' అదనపు బలం. ప్రజల్ని ఎట్లా ఆకట్టుకోవాలో, వారి హృదయాలను ఎట్లా జయించాలో, వారితో ఎట్లా 'కనెక్టు' కావాలో కేసీఆర్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. 'కేసీఆర్ మీడియా సమావేశం రాజనీతి శాస్త్ర విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంద'ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్య అతిశయోక్తి కాదు. ఏ సమావేశంలో, ఏ సభలో ఎట్లా ఆసక్తికరంగా మాట్లాడాలో, వినేవాళ్లను ఎట్లా రంజింపజేయాలో, తన ప్రసంగం రక్తి కట్టడానికి ఎలాంటి ట్రిక్కులు ప్రయోగించాలో కేసీఆర్ నుంచి వక్తలు ఎవరైనా నేర్చుకోవలసిందే. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తల శిక్షణ శిబిరాల్లో ప్రధాన వక్తగా కేసీఆర్ వ్యవహరించేవారన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు.

శిక్షణ తీసుకోవడం, శిక్షణ ఇవ్వడం.. రెండింటిలోనూ ఆయనకు ప్రావీణ్యం ఉంది. తెలంగాణ ఉద్యమకాలంలో ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగరరావు సహా పలువురు నిపుణులు, మేధావులు, విద్యావేత్తల దగ్గర కేసీఆర్ ఒక 'విద్యార్థి' వలె మసలుకునే వారు. శ్రద్ధగా వినేవారు. నోట్స్ రాసుకునేవారు. ఇప్పుడు కూడా జాతీయ రాజకీయాల్లో తన పాత్రను ఎట్లా మలచుకోవాలన్న అంశంపై పలువురు నిపుణులు, మేధావులు, జర్నలిస్టులతో విస్తృతంగా 'సమాలోచనలు' జరుపుతున్నారు. ఢిల్లీలో, హైదరాబాద్ లో ఇలాంటి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆయా 'మేధో మధనం' నుంచి వెల్లడవుతున్న పలు అంశాలపై 'వడపోత' కొనసాగుతోంది.

కేసీఆర్ కు కత్తి పట్టడం తెలుసు. దాన్ని ఎట్లా తిప్పాలో, ఎప్పుడు తిప్పాలో కూడా తెలుసు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలను ఒక్క మీడియా సమావేశంతో ఆత్మరక్షణలో పడవేశారు.'ముందస్తు'ఎన్నికల గురించి ఆ రెండు జాతీయ పార్టీలు పదే పదే మాట్లాడుతున్నాయి. "కేసీఆర్ ఏ క్షణమైనా ఎన్నికలకు పోవచ్చు. అందరూ సిద్ధంగా ఉండాలి" అని అమిత్ షా తమ పార్టీ తెలంగాణ నాయకులకు నూరిపోస్తున్నారు. ఇంకో ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుందంటూ రేవంత్ రెడ్డి అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. అందుకే "నేను రెడీ. ఎన్నికల తేదీ పెట్టండి. అసెంబ్లీని రద్దు చేస్తా" అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు మింగుడుపడడం లేదు. సాధారణంగా బంతి ఎప్పుడూ కేసీఆర్ కోర్టులోనే ఉంటుంది. కనుక ఆ బంతిని ఎప్పుడు ఎటు వైపు విసురుతారో, ఎటు వైపు విసరాలో ఆయనకే తెలుసు. దీనిపై అవగాహన లేని వాళ్ళే కేసీఆర్ ను ముగ్గులోకి లాగాలని ప్రయత్నిస్తుంటారు.

అధికార పార్టీలో 'కట్టప్ప'లు ఉన్నారని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు కేసీఆర్ ఆగ్రహానికి మరింత ఆజ్యం పోశాయి. తమ విధానాలేమిటో, తాము అధికారంలోకి వస్తే ఏమి చేయాలనుకుంటున్నారో, కేసీఆర్ కన్నా అద్భుతంగా పరిపాలనను అందించగలమన్న ఫార్ములా ఏమిటో ప్రజలకు వివరించి, వారిని మెప్పించి ఓట్లను రాబట్టి అధికారంలోకి రావడం ప్రజాస్వామిక లక్షణం. అంతే కానీ 'ఏక్ నాథ్ షిండే'లు, 'కట్టప్ప'లను సృష్టించడమేమిటి? అంటే వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రాలేమన్న నిస్పృహ బీజేపీలో ఆవరించిందా? అందువల్ల ఇప్పటినుంచే అధికారపార్టీలో 'షిండే'ల కోసం అన్వేషణ జరుపుతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఇక బీజేపీని తిడుతున్నట్టుగా, తమను తిట్టడం లేదన్న బాధ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో కనిపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోరాటం కేంద్రీకృతమైతే తమ పరిస్థితి 'ప్రేక్షకపాత్ర'గా మారడమేమిటి? అన్న ఆందోళన కాంగ్రెస్ లో వ్యక్తమవుతోంది. తమను 'పోటీదారు'గా కేసీఆర్ గుర్తించడమే లేదన్న ఆవేదనతో టీపీసీసీ నాయకులు కుమిలిపోతున్నారు.

First Published:  11 July 2022 10:18 AM GMT
Next Story