పక్కా లోకల్..ఇదే కేసీఆర్ మోడల్!
వ్యూహ చతురతలో చాణక్య సమానుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రత్యర్ధులకు అందినట్టే ఉంటాయి ఆయన వ్యూహాలు. కానీ అంతలోనే అనూహ్యంగా కొత్త ఆలోచనతో కంగు తినిపించడం ఆయన మోడల్. రాష్ట్రంలో క్రమంగా ఎన్నికల వాతావరణం కమ్ముకుంటోంది. వచ్చేఎన్నికలకు ఆయన ముందుగా తయారు చేసుకున్న వ్యూహాన్ని పక్కన బెట్టి సరికొత్త ఆలోచనతో ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యూహంతో పక్కాగా హ్యాట్రిక్ సాధించి అధికారంలోకి రావడం ఖాయమేనంటూ పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహంగానే ఉన్నాయి. తనకు రెండు […]
వ్యూహ చతురతలో చాణక్య సమానుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రత్యర్ధులకు అందినట్టే ఉంటాయి ఆయన వ్యూహాలు. కానీ అంతలోనే అనూహ్యంగా కొత్త ఆలోచనతో కంగు తినిపించడం ఆయన మోడల్. రాష్ట్రంలో క్రమంగా ఎన్నికల వాతావరణం కమ్ముకుంటోంది. వచ్చేఎన్నికలకు ఆయన ముందుగా తయారు చేసుకున్న వ్యూహాన్ని పక్కన బెట్టి సరికొత్త ఆలోచనతో ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యూహంతో పక్కాగా హ్యాట్రిక్ సాధించి అధికారంలోకి రావడం ఖాయమేనంటూ పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహంగానే ఉన్నాయి. తనకు రెండు సార్లు అఖండ విజయాన్ని సాధించి పెట్టిన స్థానికత అంశాన్నే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మెరుగులు పెట్టి ప్రత్యర్ధి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేయాలనేది కేసీఆర్ వ్యూహంగా కనబడుతోంది.
కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకంగా ఉండాలని ఆలోచించినప్పటికీ ఆయన నేల విడిచి సాము చేయలేదు. సొంతగడ్డకు ప్రాధాన్యమిస్తూనే అభివృద్ధి,సంక్షేమాలతో ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే కేంద్రంతో విభేదాలు మొదలయ్యాయి. తెలంగాణను మరో పార్టీకి వదిలేది లేదని స్పష్టం చేస్తూనే ఎంతటి సాహసానికైనా దిగుతున్నారు. ఇందులో భాగంగానే ధాన్యం కొనుగోళ్ళు మొదలు రాష్ట్రం పట్ల కేంద్రం చూపిస్తున్న వివక్ష వరకూ వివరిస్తూ కేంద్రం లోని బిజెపి తీరును ఎండగడుతున్నారు.
ఎప్పటికప్పుడు ఎన్నికల్లో కెసిఆర్ కొత్త కొత్త వ్యూహాలను అమలు చేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఏ ఎన్నికలు అయినా ఏ ప్రాంతమైనా స్థానికతకే ప్రాధాన్యం ఇచ్చారన్నది తెలిసిన విషయమే. పసికూనను పెంచి పెద్దచేసి వడివడిగా అడగులు వేయించడంలో ముఖ్యమంత్రి అవిరళకృషి దాగి ఉంది. మరో వైపు నిర్లక్ష్యానికి గురైన ప్రజల సంక్షేమానికి ఎంత చేయాలో అంత చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ విషయంలో ప్రజలు కూడా ఆయన పట్ల ఆదరణ కనబరుస్తున్నారనడానికి ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలే నిదర్శనం. అంటే ఆయన అనుకున్న వ్యూహాన్ని పక్కాగా అమలు చేయగలిగితే విజయం తధ్యం అనే విషయం అర్ధమవుతుంది. కొన్ని సార్లు పథకాల ప్రయోజనాలు దిగువ స్థాయికి చేరడంలో వ్యవస్థాగత లోపాలు ఉండవచ్చు.
ఆ తర్వాత దళిత బంధు, రైతు బంధు వంటి పథకాలు, పారిశ్రామికీకరణతో స్థానికులకు ఉపాధి అవకాశాలు, కాళేశ్వరం వంటి జాతీయ స్థాయి ప్రాజెక్టులతో జలవనరులు పెంచి బీడు భూములను సస్యశ్యామలం చేసి చూపించామనే అభివృద్ధి ఎజెండాతో ఎన్నికలకు వెళ్ళాలని అనుకుంటున్నారు కేసీఆర్.
అయితే రాష్ట్రానికి నిధులు తామే ఇస్తున్నామని, ఇక్కడ జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఏమీ లేదని చూపించేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ సాకుతో డబుల్ ఇంజన్ అంటూ రొద చేస్తూ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు ఎన్ని విధాలా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఆఖరికి అగ్నిపథ్ ఆందోళనలకు కూడా టిఆర్ఎస్ పార్టీయే రెచ్చగొట్టిందని విమర్శలు చేసే స్థాయికి దిగజారింది బిజెపి. అయితే రాజకీయంగానూ , ఉద్యమపరంగానూ రాటుదేలిన కేసీఆర్ వీటిని ఖాతరు చేయకుండా తనదైన స్టయిల్ లో స్పందిస్తూ ప్రత్యర్ధి పార్టీల నాయకులను డైలమాలో పడేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం చూపిస్తున్న వివక్షను ఎత్తి చూపిస్తూ ‘మన ఇంటిని మనమే చక్కదిద్దుకోవాలి’ అనే ఆలోచనను ప్రజల్లో రేకెత్తిస్తూ స్థానికతకు ప్రాధాన్యమిస్తూ మళ్ళీ ‘మన తెలంగాణ’ అనే తిరుగులేని అస్త్రంతోనే ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.
ALSO READ: తెలంగాణ రాజకీయాల్లో ఏక్ నాథ్ షిండేల రగడ..