గొటబాయ రాజపక్సే రాజీనామా చేశాక లంకలో ఏం జరగనుంది ?
రావణ కాష్టాన్ని మించి శ్రీలంకలో అగ్గి రాజుకుంది. ఆందోళనకారుల హింసాత్మక నిరసనలతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కొలంబో నుంచి పారిపోగా, ప్రధాని రణిల్ విక్రమసింఘే పదవికి రాజీనామా చేశారు. కానీ దీనితో సంతృప్తి చెందని నిరసనకారులు ఆయన ఇంటికి, కార్యాలయానికి కూడా నిప్పు పెట్టారు. కొంతమంది ఎంపీలపై దాడులు చేశారు. గొటబాయ ఈ నెల 13 న రాజీనామా చేస్తారని పార్లమెంట్ స్పీకర్ మహీందా ప్రకటించినప్పటికీ, దేశంలో పరిస్థితి చల్లారేట్టు కనిపించడంలేదు. ఇక లంక రాజ్యాంగ నియమావళి […]
రావణ కాష్టాన్ని మించి శ్రీలంకలో అగ్గి రాజుకుంది. ఆందోళనకారుల హింసాత్మక నిరసనలతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కొలంబో నుంచి పారిపోగా, ప్రధాని రణిల్ విక్రమసింఘే పదవికి రాజీనామా చేశారు. కానీ దీనితో సంతృప్తి చెందని నిరసనకారులు ఆయన ఇంటికి, కార్యాలయానికి కూడా నిప్పు పెట్టారు. కొంతమంది ఎంపీలపై దాడులు చేశారు. గొటబాయ ఈ నెల 13 న రాజీనామా చేస్తారని పార్లమెంట్ స్పీకర్ మహీందా ప్రకటించినప్పటికీ, దేశంలో పరిస్థితి చల్లారేట్టు కనిపించడంలేదు.
ఇక లంక రాజ్యాంగ నియమావళి ప్రకారం అధ్యక్షుని పదవీకాలం ముగియడానికి ముందే ఆయన రాజీనామా చేసిన పక్షంలో పార్లమెంట్ తమ ఎంపీల్లో ఒకరిని ఈ పదవిలో ఎన్నుకోవాల్సి ఉంటుంది. అధ్యక్షుడు రాజీనామా చేసిన నెల రోజుల్లోగా కొత్త నియామకం జరగవలసి ఉంటుందట. అధ్యక్షుడు పదవి నుంచి వైదొలగగానే మూడు రోజుల్లోగా పార్లమెంట్ సమావేశమవుతుందని, అధ్యక్షుని రాజీనామా గురించి పార్లమెంట్ సెక్రటరీ జనరల్ ఎంపీలకు తెలియజేయాల్సి ఉంటుందని వెల్లడైంది. ఖాళీగా ఉన్న అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణకు ఒక తేదీని సభ ప్రకటిస్తుంది. ఈ పోస్టుకు ఒకే ఒక ఎంపీ నామినేట్ అయిన పక్షంలో ఆయన ఎన్నికైనట్టు సెక్రెటరీ జనరల్ ప్రకటిస్తారు.
ఒకరికి మించి ఎక్కువమంది నామినేట్ అయితే రహస్య బ్యాలట్ నిర్వహిస్తారు. ఆ బ్యాలట్ లో పూర్తి మెజారిటీ దక్కిన వ్యక్తిని అధ్యక్షునిగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. కొత్త అధ్యక్షుని ఎన్నిక జరిగేంతవరకు ప్రస్తుత ప్రధాని తాత్కాలిక అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. కానీ ఈ పదవి ఆయనకు మూన్నాళ్ళ ముచ్చటే.. ఇది నెలరోజుల వరకే పరిమితం ! ఆ తరువాత పార్లమెంట్ కొత్త వ్యక్తిని ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటుంది. కేబినెట్ లోని ఓ మంత్రి ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని పోస్టులో కొంతకాలం (బహుశా నెల) కొనసాగుతారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇవన్నీ సజావుగా జరుగుతాయా అన్నది సందేహమే. ఓ వైపు నిరసనకారులు ఏకంగా అధ్యక్ష భవనాన్నే ముట్టడించడమే కాకుండా , ప్రధాని విక్రమసింఘే ఇంటికి నిప్పు పెట్టడం వంటి అనూహ్య హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంటును సమావేశపరచడానికి ప్రధాని సాహసిస్తాడా అన్నది అనుమానమేనంటున్నారు.
రాజపక్షే ఈ నెల 13 న రాజీనామా చేస్తారని స్పీకర్ ప్రకటించినప్పటికీ ఆయన అసలు దేశం వదిలి పారిపోయాడు. కొందరు సైనికులు సూట్ కేసులు పట్టుకుని ఆయన వెంట పరుగులు తీస్తున్న దృశ్యాలు వీడియోలకెక్కాయి. ఆయన సముద్ర మార్గం ద్వారా పలాయనం చిత్తగించాడా లేక విమానమెక్కి చెక్కేశాడా అన్నది ఇప్పటివరకు స్పష్టం కాలేదు. మాజీ ప్రధాని విక్రమసింఘే, స్పీకర్ ఒకవేళ పార్లమెంటును సమావేశపరచినప్పటికీ.. అన్నీ సక్రమంగా జరుగుతాయన్న గ్యారంటీ లేదని అంటున్నారు. లంక ఇంకా ఆందోళనకారుల కోపాగ్నితో మండుతూనే ఉంది.