దేశాన్ని మోడీ, బీజేపీ జలగలా పట్టి పీడిస్తున్నారు: సీఎం కేసీఆర్
– నేను అడిగిన ప్రశ్నలకు సమాధానమే లేదు – కేంద్రంలో అసమర్థ ప్రభుత్వం ఉంది – నన్ను తిట్టి నోటి దూల తీర్చుకొని పోయిండు – మోడీకి తెలిసే బ్యాంకుల కుంభకోణాలు జరుగుతున్నాయి – కట్టప్పలు లేదు.. కాకరకాయ లేదు – తెలంగాణ సర్కార్ సూపర్ స్పీడ్ ఇంజన్ – మోడీ సర్కారుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం – భారీ వర్షాలు పడుతున్నాయి.. అప్రమత్తంగా ఉండండి దేశాన్ని బీజేపీ…. నరేంద్ర మోడీ ప్రభుత్వం జలగలా పట్టి పీడిస్తోందని, […]
– నేను అడిగిన ప్రశ్నలకు సమాధానమే లేదు
– కేంద్రంలో అసమర్థ ప్రభుత్వం ఉంది
– నన్ను తిట్టి నోటి దూల తీర్చుకొని పోయిండు
– మోడీకి తెలిసే బ్యాంకుల కుంభకోణాలు జరుగుతున్నాయి
– కట్టప్పలు లేదు.. కాకరకాయ లేదు
– తెలంగాణ సర్కార్ సూపర్ స్పీడ్ ఇంజన్
– మోడీ సర్కారుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం
– భారీ వర్షాలు పడుతున్నాయి.. అప్రమత్తంగా ఉండండి
దేశాన్ని బీజేపీ…. నరేంద్ర మోడీ ప్రభుత్వం జలగలా పట్టి పీడిస్తోందని, దేశాన్ని నాశనం చేసిన అసమర్థ ప్రభుత్వమని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో పడుతున్న భారీ వర్షాలు, ఇతర సమస్యలపై ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ ఆదివారం సమీక్ష నిర్వహించారు.
అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాడ్లాడుతూ.. 'కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీపై పలు విమర్శలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హైదరాబాద్‌లో కార్యవర్గ సమావేశాలు పెడుతుంటే ఒక్క తెలంగాణే కాకుండా యావత్ భారతదేశం గమనించింది. అధికారంలోకి వచ్చాక బీజేపీ సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాల ద్వారా వచ్చిన ఫలితాలు, రాబోయే రోజుల్లో అమలు చేసే కార్యక్రమాలు, భవిష్యత్ ప్రయోజనాల గురించి ఏమైనా చెప్తారేమో అని అందరూ ఎదురుచూశారు. కానీ అలాంటిది ఏమీ లేదు. అసలు ప్రధాని వచ్చి ఏం మాట్లాడారో భగవంతునికే తెలియాలి.
బీజేపీ సమావేశాలు జరిగిన సమయంలోనే అనుకోకుండా మేం రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన యశ్వంత్ సిన్హా యాదృశ్చికంగా హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో నేను మోడీకి పలు ప్రశ్నలు అడిగాను.
ప్రధాని మోడీ కానీ, మంత్రులు కానీ, ఒక్క దానికి సమాధానం చెప్పలేదు. ప్రధాని, మంత్రులు, వాళ్ల పార్టీ అధ్యక్షుడు ఇక్కడకు వచ్చి నన్ను తిట్టి నోటి దూల తీర్చుకొని పోయారు. దీంతోనే వారి డొల్లతనాన్ని బయటపెట్టుకున్నారు. దేశంలో జరుగుతున్న కుంభకోణాలు, ఆర్థిక సమస్యలు, ఇతర విషయాలపై నేను సూటిగా, నిక్కచ్చిగా, చాలా క్లియర్‌గా ప్రశ్నించాను.
నా కోసం కాదు.. ప్రజలందరి తరపున అడిగాను. కానీ ఒక్కదానికి సమాధానం ఇవ్వలేదు. హైదరాబాద్ వచ్చి తెలంగాణ గురించి ఒక్క హామీ ఇవ్వలేదని కేసీఆర్ అన్నారు. మోడీకి తెలిసే బ్యాంకుల కుంభకోణాలు జరుగుతున్నాయి. ఆయనకు తెలియదు అనుకోవడం మన అమాయకత్వమే తప్ప మరొకటి కాదు' అని కేసీఆర్ అన్నారు.
మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రుపాయి విలువ పతనమైందని గొంతు చించుకొని అరిచారు. మరి ఇప్పుడు రూపాయి విలువ ఎందుకు పడిపోయిందో చెప్పమని మేం అడుగుతున్నాం. ఎందుకు చెప్పడం లేదు. ఇప్పటి వరకు ఏ ప్రధాని పాలనలో కూడా రూపాయి ఇంత ఘోరంగా పతనం కాలేదని కేసీఆర్ గుర్తు చేశారు. బీజేపీ అసమర్ధ విధానాల వల్లే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ. 80కి పడిపోయిందని చెప్పారు.
గత ఎనిమిదేళ్లలో దేశానికి మేలు చేసేలా మోడీ చేసిన పని ఒక్కటైనా చెప్పగలరా అని ప్రశ్నించారు. ఒక చెడ్డ పవర్ పాలసీని తీసుకొని వచ్చి చీకట్లోకి నెట్టేశారు. తెలంగాణలో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో వాళ్ల పాలసీ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీఎం చెప్పారు.
సాగునీరు, తాగునీరు ఇవ్వలేని కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రగల్భాలు పలుకుతోంది. మనదేశంలో ప్రతి ఏటా నదుల్లో 70 వేల టీఎంసీల నీళ్లు లభిస్తాయి. కానీ దేశ రాజధానిలోనే మంచినీటి కొరత, కరెంట్ కోతలు ఉన్నాయని విమర్శించారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిలో కనీసం 10 శాతమైన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిందా అని చాలెంజ్ చేశారు. రూపాయి పతనాన్ని ఆపలేరు, నిరుద్యోగాన్ని కట్టడి చేయలేరు, రైతులను ఆదుకోలేరు.. కేవలం లొడ లొడ వాగి లొల్లిపెట్టడమే తెలుసని ఎద్దేవా చేశారు.
మాది స్పీడ్ ఇంజన్..
డబుల్ ఇంజన్ సర్కారు రావాలని మోడీ చెప్తున్నారు. మేం కూడా అదే అంటున్నాము. ఇప్పుడు తెలంగాణలో సూపర్ స్పీడ్ ఇంజన్ ఉన్నది. కేంద్రంలో కూడా అలాంటి ఇంజన్ రావాలని మేం కోరుకుంటున్నాము. తెలంగాణ జీడీపీ.. కేంద్ర ప్రభుత్వ జీడీపీ కంటే ఎక్కువగా ఉన్నది. ఇలాంటి అభివృద్ధి చెందిన తెలంగాణను ఏం చేద్దామని అనుకుంటున్నారు అని సీఎం ప్రశ్నించారు.
కేంద్రంలో దద్దమ్మ ప్రభుత్వం ఉండటం వల్ల తెలంగాణ రూ. 3 లక్షల కోట్లు నష్టపోయింది. అసెంబ్లీలో ఇదే విషయం చెప్పాను. ఇప్పటికే వీళ్ల చేతకానితనాన్ని దేశ ప్రజలు చూశారు. అందుకే కేంద్రంలో ప్రభుత్వం మారాలని చెప్తున్నాం. రేపు కేంద్రంలో మాకు అనుకూలమైన ప్రభుత్వం వస్తే ఎల్ఐసీని అమ్మనివ్వం. దాన్ని కాపాడుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
శిండేలు శిఖండిలను తయారు చేస్తారా?
కేంద్రంలో తప్పకుండా బీజేపీయేతర సర్కారు రావల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. మిత్రపక్షాలతో కలిపి 110 సీట్లు మాకున్నాయి. ఇలాంటి చోట ఏక్‌నాథ్ శిండేలు వస్తారని వ్యాఖ్యానిస్తారా? బీజేపీ నేతలకు అహంకారం పెరిగింది. కట్టప్పలు ఉన్నారు.. వాళ్లను తయారు చేస్తాము.. అని ఆయనెవరో మాట్లాడుతున్నాడు. ఆయనే మా ముఠా గోపాల్‌పై ఓడిపోయి.. వేరే రాష్ట్రానికి వెళ్లి ఎంపీ పదవి తెచ్చుకున్నాడు. అసలు కట్టప్ప గురించి తెలుసా? బాహుబలి నిజమైన వారసుడని అతడిని రాజుగా చేశాడు. కట్టప్పలను తీసుకొస్తే నిన్నే పొడుస్తడు అని లక్ష్మణ్‌ను పరోక్షంగా విమర్శించారు. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ శిండే వస్తే ఏం జరిగింది? 20 శాతం చార్జీలు పెంచారు అని విమర్శించారు.
బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ వ్యాఖ్యల వల్ల విదేశాల్లో కూడా మన పరువు పోయింది. ఆయా దేశాలు భారత రాయబారులను నిలదీస్తే దేశం తరపున క్షమాపణలు చెప్పారు. అయినా పార్టీ తరపున చేసిన వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ అడిగిన విషయం గుర్తుచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పార్దీవాలా, కాంత్‌లు నుపుర్ శర్మకు చీవాట్లు పెడితే.. మాజీ జడ్జీలతో లేఖలు రాయిస్తారా? ముఖ్యమంత్రులను, న్యాయమూర్తులను కూడా బీజేపీ ప్రభుత్వం బెదిరిస్తుందని అన్నారు.
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని కేసీఆర్ అన్నారు. ప్రముఖ జర్నలిస్టులు ఏదో మీటింగ్ పెట్టుకుంటే.. వారిని నక్సలైట్లుగా చిత్రీకరించారని కేసీఆర్ అన్నారు. అసలు వీళ్ల ఉన్మాదం ఎక్కడి వరకు వెళ్తుందో అర్థం కావడం లేదన్నారు. ఈడీ కేసులు నమోదు చేస్తారు.. వాళ్లు వచ్చి మీ పార్టీలో జాయిన్ అవగానే సుద్దపూసలైపోతారు. అంతా వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ ఎద్దేవా చేశారు.
వర్షాలు పడుతున్నాయి.. అప్రమత్తంగా ఉండండి..
తెలంగాణలో రాబోయే నాలుగు రోజలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. దక్షిణ ఒడిశా, చత్తీస్‌గఢ్ మీదుగా తుపాను ప్రభావం చూపిస్తుందని అన్నారు. గోదావరిలో సమ్మక్క బ్యారేజీ దగ్గర ప్రస్తుతం 9 లక్షల పదివేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందన్నారు. ఎస్సారెస్పీకి కూడా వరద వస్తోందని.. రేపటి కల్లా బ్యారేజీ నిండినా ఆశ్చర్యం లేదన్నారు. భారీ వర్షాలకు అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దం చేశామని చెప్పారు. ఎయిర్‌ఫోర్స్ నుంచి హెలీకాప్టర్లు తెప్పిస్తామని, ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్న హెలీకాప్టర్లను వాడుకుంటామన్నారు.
భారీ వర్షాల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించామన్నారు. కల్వర్టులు, రోడ్లు పొంగే ప్రాంతాలకు బస్సులు నడపవద్దని ఆర్టీసీ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు కేసీఆర్ చెప్పారు. ఈ నాలుగు రోజులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు.