Telugu Global
CRIME

డ్రగ్స్ కేసులో మంచి పోలీసుగా పేరు.. ఇవ్వాళ రేప్ కేసులో పరారీ

హైదరాబాద్ మారేడ్‌పల్లి పోలీస్ ఇన్‌స్పెక్టర్ కే. నాగేశ్వరరావు చేసిన పని తెలంగాణ పోలీసులకు తలవంపులు తెచ్చింది. ఒక స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా తనకు ఉన్న అధికారాలను దుర్వినియోగం చేయడమే కాకుండా, మహిళపై అత్యాచారానికి పాల్పడటం.. తర్వాత వాళ్లను బెదిరింపులకు పాల్పడటం ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్నటి వరకు ఓ డ్రగ్స్ కేసులో మంచి దర్యాప్తు అధికారిగా పేరు తెచ్చుకున్న అతడే.. ఇప్పుడు దుర్మార్గమైన పని చేసి పరారయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌లోని రాడిసన్ హోటల్ ఆవరణలోని పుడింగ్ అండ్ […]

డ్రగ్స్ కేసులో మంచి పోలీసుగా పేరు.. ఇవ్వాళ రేప్ కేసులో పరారీ
X

హైదరాబాద్ మారేడ్‌పల్లి పోలీస్ ఇన్‌స్పెక్టర్ కే. నాగేశ్వరరావు చేసిన పని తెలంగాణ పోలీసులకు తలవంపులు తెచ్చింది. ఒక స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా తనకు ఉన్న అధికారాలను దుర్వినియోగం చేయడమే కాకుండా, మహిళపై అత్యాచారానికి పాల్పడటం.. తర్వాత వాళ్లను బెదిరింపులకు పాల్పడటం ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్నటి వరకు ఓ డ్రగ్స్ కేసులో మంచి దర్యాప్తు అధికారిగా పేరు తెచ్చుకున్న అతడే.. ఇప్పుడు దుర్మార్గమైన పని చేసి పరారయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే..

బంజారాహిల్స్‌లోని రాడిసన్ హోటల్ ఆవరణలోని పుడింగ్ అండ్ మింక్ డ్రగ్స్ పబ్ కేసులో విచారణ అధికారిగా ఉన్న అప్పటి బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ కే. నాగేశ్వరరావుపై డిపార్ట్‌మెంట్ ఎన్నో ప్రశంసలు కురిపించింది. ఆ తర్వాత ఆయన మహంకాళి డివిజన్‌ పరిధిలోని మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఆ సమయంలో ఒక కేసు విషయంలో బాధితుడిగా ఉన్న వ్యక్తిపైనే రివర్స్‌లో కేసు బుక్ చేశాడు. అంతే కాకుండా అతడికి బెయిల్ వచ్చిన తర్వాత తన సొంత ఫామ్‌హౌస్‌లో పని వాడిగా నియమించుకున్నాడు. అప్పటి నుంచి సదరు బాధితుడు, అతని భార్య అతడి ఫార్మ్ హౌస్‌లోనే పని చేస్తున్నారు.

అయితే బాధితుడి భార్యపై కన్నేసిన నాగేశ్వరరావు ఓ సారి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం భార్యాభర్తలకు క్షమాపణ చెప్పాడు. కానీ, సదరు భార్యాభర్తలు అక్కడి నుంచి బయటకు వచ్చి వనస్థలిపురంలో కాపురం పెట్టారు. భార్య వనస్థలిపురంలో ఉంటుండగా.. భర్త మాత్రం సీఐ వ్యవసాయ క్షేత్రంలోనే పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 7న రాత్రి వనస్థలిపురంలోని వాళ్ల ఇంటికి వస్తున్నట్లు మహిళకు ఫోన్ చేశాడు. రెడీగా ఉండాలంటూ హుకుం జారీ చేశాడు. దీంతో వెంటనే మహిళ తన భర్తకు ఫోన్ చేసి చెప్పింది.

మహిళ ఇంట్లోకి బలవంతంగా వచ్చిన ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు ఆమె తలపై తుపాకీ పెట్టి బెదిరించి అత్యాచారం చేశాడు. ఇంతలోనే భర్త కూడా అక్కడకు చేరుకున్నాడు. దీంతో ఇద్దరినీ తుపాకీతో బెదిరించి కారులో ఇబ్రహీంపట్నం వైపు తీసుకొని వెళ్లాడు. అయితే ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై కారు టైరు పేలి ప్రమాదానికి గురైంది. దీంతో భార్యాభర్తలు తప్పించుకొని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పొద్దున్నే వస్తానని చెప్పి..

ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదు కావడంతో కే. నాగేశ్వరరావును అదుపులోకి తీసుకోవడానికి రాచకొండ కమిషనరేట్ ఎస్ఓటీ పోలీసులు మారేడ్‌పల్లి స్టేషన్‌కు వెళ్లారు. ఆ సమయంలో అతడు డ్యూటీలోనే ఉన్నాడు. ప్రస్తుతం నైట్ డ్యూటీలో ఉన్నానని, ఉదయమే వచ్చి లొంగిపోతానని ఎస్ఓటీ పోలీసులను నమ్మించాడు. అప్పటికే నార్త్ జోన్ పోలీసులకు కూడా విషయం తెలియడంతో అర్థరాత్రి 12.30 గంటల తర్వాత కాల్ చేశారు. అప్పుడు నాగేశ్వరరావు ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. గత రెండు రోజులుగా నాగేశ్వరరావు ఎవరికీ అందుబాటులోకి రాకుండా పోయాడు. వెంటనే అతడి కోసం రాచకొండ పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ప్రారంభించాయి. ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ ఆయనను సస్పెండ్ కూడా చేశారు.

తప్పుడు కేసులు పెట్టడంలో దిట్ట..

కే. నాగేశ్వరరావు ప్రవర్తన ఆది నుంచి అనుమానాస్పదంగానే ఉండేదని డిపార్ట్‌మెంట్‌లో పలువురు చెప్తున్నారు. తనకు కావల్సిన పని చేయించుకోవడానికి ఎంత వరకు అయినా వెళ్తాడని అంటున్నారు. ఓ కేసులో నిందితుడిని బయటకు వదలకుండా.. ఫామ్‌ హౌస్‌లో పని చేయించుకోవడం తాజాగానే బయటపడినట్లు తెలుస్తున్నది. అంతకు ముందు అతడిపై గంజాయి కేసు బుక్ చేస్తానని బెదిరించినట్లు సమాచారం. తన వద్దకు బాధితుడిని పిలిచి చేతిలో, జేబుల్లో గంజాయి పెట్టి ఫొటోలు తీసినట్లు కూడా తేలింది. తాను ఎక్కడ ఉంటే అక్కడ సెటిల్మెంట్లు కూడా చేసేవాడని సహచర పోలీసులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

రాడిసన్ బ్లూ కేసులో సినీ ప్రముఖుల పిల్లల పేర్లు బయటకు వెల్లడించింది కే. నాగేశ్వరరావే అని తెలుస్తుంది. ఆ కేసులో దర్యాప్తు చేసినందుకే ఆ తర్వాత అతడికి వెంటనే బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా బదిలీ అయ్యింది. అదే సమయంలో ఏపీ జెమ్స్ అండ్ జ్యూవ‌ల‌రీ పార్క్‌కు సంబంధించిన వందల కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేస్తున్నారంటూ.. ఏపీకి చెందిన టీజీ వెంకటేష్ సోదరుడు టీజీ విశ్వప్రసాద్ మరియు 69 మందిపై కేసు బుక్ చేశాడు. అప్పట్లో కూడా ఆ కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న సమయంలో ఓ వ్యాపారి బీఎండబ్ల్యూ కార్‌ను అకారణంగా సీజ్ చేసిన ఆరోపణలు కూడా నాగేశ్వరరావుపై ఉన్నాయి.

First Published:  10 July 2022 10:33 AM IST
Next Story