Telugu Global
NEWS

భారీ వర్షాలు.. తెలంగాణలో స్కూళ్లకు మూడు రోజులు సెలవులు..

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో రేపటి నుంచి మూడు రోజులపాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఈ ప్రభావం కచ్చితంగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం రెండో శనివారం, ఆదివారం సెలవులు కావడంతో పిల్లలెవరూ గడప దాటలేదు. సోమవారం నుంచి […]

భారీ వర్షాలు.. తెలంగాణలో స్కూళ్లకు మూడు రోజులు సెలవులు..
X

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో రేపటి నుంచి మూడు రోజులపాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఈ ప్రభావం కచ్చితంగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం రెండో శనివారం, ఆదివారం సెలవులు కావడంతో పిల్లలెవరూ గడప దాటలేదు. సోమవారం నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం మూడురోజులపాటు అంటే సోమ, మంగళ, బుధవారాలు.. సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు ఈ ఆదేశాలు తప్పకుండా పాటించాలని చెప్పింది.

రాష్ట్రంలో వర్షాల పరిస్థితి, చేపట్టిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, చీఫ్ సెక్రటరీ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో ప్రాజెక్ట్ ల పరిస్థితి, వివిధ ప్రాంతాల్లో పడిన వర్షపాతం, పంట నష్టం వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ముందస్తుగా తీసుకున్న జాగ్రత్త చర్యలను కూడా ఆయనకు వివరించారు.

నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు కొట్టుకుపోయాయి, చెరువులు అలుగులు దాటి ప్రవహిస్తున్నాయి. ఇటు హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలకు వృక్షాలు నేలకొరిగాయి, రోడ్లు జలమయం అయ్యాయి. అయితే ఈ ముప్పు ఇప్పుడప్పుడే తప్పేలా లేదు. మరో 48 గంటల సేపు ఉధృతంగా వర్షాలు కురిసే అవకాశముంది. దీంతో తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

జిల్లాల వారీగా ఇప్పటికే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం కేసీఆర్. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలిచ్చారు. జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు భారీ వర్షాలపై సమీక్షించాలన్నారు. ప్రజలు అవరమైతే తప్ప బయటకు రావద్దని ఆయన సూచించారు.

First Published:  10 July 2022 4:47 AM GMT
Next Story