Telugu Global
National

ముంబై, చెన్నై సహా ఆరు నగరాలకు ముంపు ముప్పు? ఐపీసీసీ సంచలన రిపోర్టు

గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తీర ప్రాంతాలకు భారీ ముప్పు పొంచి ఉంది. రోజు రోజుకూ వాతావరణంలో వస్తున్న మార్పులు భవిష్యత్‌లో మానవాళికి పెను ప్రమాదం సృష్టించే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాలు తెలియజేశాయి. గ్లోబల్ వార్మింగ్‌పై ఇప్పటికిప్పుడు స్పందించకుంటే 2050 కల్లా ప్రపంచంలోని పలు నగరాలు ఎలా మారిపోతాయో తెలియజేసేందుకు ఆర్ఎంఎస్ఐ అనే రిస్క్ అసెస్‌మెంట్ సంస్థ దృశ్య రూపాన్ని ఇచ్చింది. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, చెన్నై సహా ఆరు […]

ముంబై, చెన్నై సహా ఆరు నగరాలకు ముంపు ముప్పు? ఐపీసీసీ సంచలన రిపోర్టు
X

గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తీర ప్రాంతాలకు భారీ ముప్పు పొంచి ఉంది. రోజు రోజుకూ వాతావరణంలో వస్తున్న మార్పులు భవిష్యత్‌లో మానవాళికి పెను ప్రమాదం సృష్టించే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాలు తెలియజేశాయి. గ్లోబల్ వార్మింగ్‌పై ఇప్పటికిప్పుడు స్పందించకుంటే 2050 కల్లా ప్రపంచంలోని పలు నగరాలు ఎలా మారిపోతాయో తెలియజేసేందుకు ఆర్ఎంఎస్ఐ అనే రిస్క్ అసెస్‌మెంట్ సంస్థ దృశ్య రూపాన్ని ఇచ్చింది. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, చెన్నై సహా ఆరు నగరాల నైసర్గీక స్వరూపాలు పూర్తిగా మారిపోనున్నట్లు సదరు సంస్థ అంచనా వేసింది.

ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) 2021లో ఈ నివేదికను రూపొందించగా.. దాని ఆధారంగా ఆర్ఎంఎస్ఐ దృశ్య రూపాన్ని (విజువలైజేషన్) ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం 2050లో దేశంలోని పలు తీర ప్రాంత నగరాల్లోని సముద్ర మట్టం పెరిగి.. మనిషి ముక్కుల వరకు మునిగేంత నీరు నగరాల్లోకి చేరుతుందని అంచనా వేసింది. ముంబై, చెన్నైతో పాటు విశాఖపట్నం, కొచ్చి, మంగళూరు, తిరువనంతపురం నగరాలు కూడా ఈ ముంపు ముప్పున‌కు గురి కానున్నాయి. ముఖ్యంగా ముంబైలోని హాజి అలీ దర్గా, చెన్నైలోని నేపియర్ బ్రిడ్జ్ రోడ్, కోచిలోని ఫెర్రీ సర్వీసులు, విశాఖలోని షిప్ యార్డులు నీట మునుగుతాయని పేర్కొన్నారు.

సముద్ర మట్టాల పెరుగుదలపై చేసిన అధ్యయనాల ఆధారంగా ఐపీసీసీ ఈ నివేదిక రూపొందించింది. సముద్ర మట్టం పెరిగితే దేశంలోని ముంబై, కోచి, తిరువనంతపురం అత్యధికంగా ప్రభావితం అవుతాయని పేర్కొన్నారు. మూడు నగరాల్లో భారీ అలలకు 4 వేల బిల్డింగ్స్, చిన్నపాటి అలలకు 1500 బిల్డింగ్స్ ముంపున‌కు గురవుతాయని తెలిపారు. శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా ఆయా నగరాల్లో ఏయే ప్రాంతాలు మునిగిపోతాయో కూడా గుర్తించారు. ముంబైలో అత్యధికంగా అభివృద్ధి చెందిన సౌత్ ముంబై ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా మారిపోనుందని వెల్లడించారు. ముంబై తర్వాత హై రిస్క్ ఉన్న నగరం కేరళలోని కోచినే. ఈ నగరంలో 464 భారీ భవంతులతో పాటు 10 కిలోమీటర్ల మేర తీర ప్రాంత రోడ్డు మునిగిపోతుందని తెలిపారు.

ఆర్ఎంఎస్ఐ రిపోర్టు ప్రకారం ముంబైలోని 998 భారీ భవంతులు, 24 కిలోమీటర్ల మేర రోడ్లు మునిగిపోతాయి. కొలాబా, మెరైన్ డ్రైవ్, వాకేశ్వర్, వర్లి వంటి సౌత్ ముంబై ప్రాంతాలు ముంపునకు గురవుతాయని పేర్కొన్నారు. గవర్నర్ నివసించే రాజ్‌భవన్, మాహిమ్ పోర్టు, గీతానగర్, మచ్చీమార్ నగర్ కూడా హై రిస్క్ జోన్‌లో ఉన్నాయి. సౌత్ ముంబైలో యునెస్కో గుర్తింపు పొందిన అనేక భవనాలకు కూడా ముప్పు పొంచి ఉంది. యురోపియన్-ఇండియన్ ఆర్కిటెక్చువల్ శైలిలో నిర్మించిన ఎన్నో భవనాలను ఈ ముంపు నుంచి కాపాడటానికి బీఎంసీ 2018 నుంచి చర్యలు చేపట్టింది.

ఇక క్రికెట్‌కు మక్కా వంటి వాంఖడే స్టేడియం, సీసీఐ బ్రబౌర్న్ స్టేడియం, నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, ట్రైడెంట్ హోటల్, ఎయిర్ ఇండియా బిల్డింగ్స్‌కు ఈ ముంపు ప్రభావం ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు, సచివాలయం (మంత్రాలయ), మినిస్టర్స్ ఆఫీసెస్ రాడార్ పరిధిలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. ముంబైలో నిర్మిస్తున్న కోస్టల్ రోడ్, బాంద్రా – వర్లీ సీలింక్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్లు, వర్లీ ఫెర్రీ పాయింట్, బ్రీచ్ కాండీ ఆసుపత్రి రోడ్డు తీవ్రంగా డ్యామేజ్ అవుతాయని నివేదికలో పేర్కొన్నారు.

చెన్నైలో ఇలా..

దక్షిణాదిలో పెద్ద తీరప్రాంత నగరమైన చెన్నైకి కూడా భారీ ముంపు ముప్పు ఉంది. సముద్ర మట్టం పెరిగితే 316 భారీ నిర్మాణాలు తక్షణం మునిగిపోతాయని తెలిపింది. రాజాజీ సలాయ్, నేపియర్స్ బ్రిడ్జ్ రోడ్, ముల్లిమ నగర్, ఎన్నోర్, తొండియార్ పేట్, తిరువొత్తియుర్ ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైన జోన్లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

కోచిలో..

లోతట్టు ప్రాంతంలో ఉన్న కోచి నగరం చాలా నష్టపోతుందని చెబుతున్నారు. ఫెర్రీ లైన్ తీవ్రంగా డ్యామేజ్ అవుతుందని చెప్పారు. విపిన్- ఎర్నాకులం, ఫోర్ట్ కోచి-ఎర్నాకులం ఫెర్రీ సర్వీసులు నాశనం అవుతాయని పేర్కొన్నారు. పామ్ బీచ్‌లోని 36 భవనాలు, కయల్‌పుర ఐలాండ్ రిసార్ట్ కూడా నీట మునగక తప్పదన్నారు. మొత్తం కలిపి 464 భవనాలు భారీ అలలకు, 1502 భవనాలు చిన్న పాటి అలలకే మునిగిపోతాయని వెల్లడించారు. గ్లోబల్ వార్మింగ్‌పై ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోకుంటే.. 91 శాతం రెసిడెన్షియల్ బిల్డింగ్స్, వలయార్, పల్లికల్ గ్రామం, పట్టుపురక్కల్, కేలమంగళం రోడ్లు నీట ముగినిపోతాయని హెచ్చరించారు. అలాగే కేరళ రాజధాని తిరువనంతపురంలోని వల్లక్కదావు ప్రాంతం, వలయతుర బీచ్, ఎయిర్‌పోర్టుకు వెళ్లే రోడ్డు కూడా మునిగిపోయే అవకాశం ఉంది.

విశాఖలో ఇలా..

ఏపీలోని విశాఖ తీరానికి కూడా గ్లోబల్ వార్మింగ్ ముప్పు పొంచి ఉంది. నగరంలోని చాలా ప్రాంతాలు ఎత్తైన ప్రదేశాల్లో ఉండటంతో కేవలం తీరానికి దగ్గరగా ఉన్న దగ్గరే దీని ప్రభావం ఉంటుందని నివేదికలో చెప్పింది. ఎక్కువగా కమర్షియల్ బిల్డింగ్స్, నేవల్ డాక్‌యార్డ్, హిందుస్తాన్ షిప్‌యార్డ్, పోర్ట్ కంట్రోల్ ఆఫీస్ తీవ్రంగా డ్యామేజ్ అవుతాయని పేర్కొంది.

మంగళూరుపై ప్రభావం

కర్నాటక తీర ప్రాంత నగరమైన మంగళూరు కూడా ఎత్తైన ప్రదేశంలోనే ఉంది. అయితే ఎడపల్లి-పన్వేల్ హైవే, బోలార్ ఫెర్రీ రోడ్డు, టోటల్ ఆయిల్ ఇండియా బూస్టర్ పంప్ హౌస్ మాత్రం తీవ్రంగా పాడవుతాయని, వీటిపై ముంపు ప్రభావం ఎక్కువని నివేదిక పేర్కొంది.

ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్‌కు కారణమవుతున్న వాటిని అదుపులోకి పెట్టకుంటే.. రాబోయే రోజుల్లో ఆయా నగరాలు ఎలా మారుతాయనే అంచనానే తప్ప.. ఆ నగరాలన్నీ మునిగిపోతాయని సదరు రిపోర్టు చెప్పలేదు. ఇప్పటికిప్పుడు మేల్కొని గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించాలని ఆర్ఎంఎస్ఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పుష్పేంద్ర జోహారి చెప్పారు. ప్రజల్లో అవగాహన కలిగించడానికే ఈ నివేదిక రూపొందించామని, భయభ్రాంతులకు గురి కావల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

First Published:  10 July 2022 1:12 AM GMT
Next Story