Telugu Global
NEWS

ఆశలు పెట్టుకున్న బీజేపీ దగ్గరకే రానివ్వడం లేదు.. రఘురామకు దిక్కెవరు?

వైసీపీ నరసాపురం రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడిన రేవడిలా తయారైంది. పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తర్వాత సొంత పార్టీ, అధినేత వైఎస్ జగన్‌పై పలు విమర్శలు చేస్తూ పార్టీకి దూరమయ్యారు. కొంత కాలం సీఎం జగన్ కూడా ఆయన్ను పట్టించుకోలేదు. దీంతో మరింతగా రెచ్చిపోయి.. ఏకంగా ప్రభుత్వ నిర్ణయాలపై కేసులు వేయడం మొదలు పెట్టారు. తనకు బీజేపీ అధినాయకత్వం అండ ఉందని చెప్పుకుంటూ.. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించే […]

Raghu Rama Krishna Raju
X

వైసీపీ నరసాపురం రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడిన రేవడిలా తయారైంది. పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తర్వాత సొంత పార్టీ, అధినేత వైఎస్ జగన్‌పై పలు విమర్శలు చేస్తూ పార్టీకి దూరమయ్యారు. కొంత కాలం సీఎం జగన్ కూడా ఆయన్ను పట్టించుకోలేదు. దీంతో మరింతగా రెచ్చిపోయి.. ఏకంగా ప్రభుత్వ నిర్ణయాలపై కేసులు వేయడం మొదలు పెట్టారు. తనకు బీజేపీ అధినాయకత్వం అండ ఉందని చెప్పుకుంటూ.. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. అడపాదడపా కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులను కలసి.. వారితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి హంగామా చేశారు.

ఈ క్రమంలో రఘురామపై ఏపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టింది. దానికి సంబంధించి సీఐడీ పోలీసులు అరెస్టైన సమయంలో తనపై దాడి చేశారంటూ హడావిడి చేశారు. మరో వైపు టీడీపీ అనుకూల మీడియా రఘురామ సైడ్ తీసుకొని అతడిపై సానుభూతి పెంచేలా వార్తలు ప్రసారం చేసింది. ఇంత చేసినా బీజేపీ మాత్రం నోరు విప్పలేదు. తనకు ఏమైనా అయితే బీజేపీ అడ్డుపడుతుందని భావించినా.. ఆ కోరిక నెరవేరలేదు. దీంతో కొంత కాలం సైలెంట్ అయిన రఘురామ.. మోడీ భీమవరం పర్యటనను తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావించారు.

మోడీ పర్యటనలో జగన్ పక్కనే కూర్చొని అందరికీ ఝలక్ ఇవ్వాలని అనుకున్నారు. తనకు ఉన్న పరిచయాలతో పీఎంవో ద్వారా ఆహ్వాన పత్రికలో పేరు పెట్టించుకోవాలని భావించారు. కానీ చివరకు అనుకున్నది ఒకటైతే.. జరిగింది మరొకటి. అసలు పీఎంవో రఘురామను పట్టించుకోనేలేదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రఘురామకు వైసీపీ టికెట్ వచ్చే అవకాశం ఎలాగోలేదు. కనీసం బీజేపీ తరపున అయినా పోటీ చేయాలని భావించారు. తాను మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌కు దగ్గర మనిషిని అని చెప్పుకోవాలని అనుకున్నారు. కానీ, అన్నీ దగ్గరుండి చూసుకున్న మంత్రి కిషన్ రెడ్డి కూడా రఘురామను పట్టించుకోలేదు. దీంతో రఘురామను బీజేపీ అసలు పట్టించుకోవడమే లేదని ఏపీలోని రాజకీయ నాయకులతో పాటు ప్రజలు కూడా గుర్తించారు.

ఇప్పుడు రఘురామ పరిస్థితి కుడితిలో పడిన ఎలకలా తయారైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సీఎం జగన్‌కు ఝలక్ ఇవ్వాలని భావించి.. తానే బొక్కాబోర్ల పడ్డాడని అనుకుంటున్నారు. బీజేపీ టికెట్ కూడా ఇచ్చే ఛాన్స్ లేదని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో మరి రఘురామకు దిక్కెవరని ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్‌పై విమర్శలు చేసే సమయంలో టీడీపీ, జనసేనపై మాత్రం ఎలాంటి మాటలు తూలలేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పట్ల ఎలాంటి విముఖత ప్రదర్శించకుండా మాట్లాడేవారు.

దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ లేదా జనసేన తరపున టికెట్ కోసం ప్రయత్నించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. ఇప్పుడు రఘురామకు ఆ రెండు పార్టీలు తప్ప వేరే దిక్కులేదని తెలుస్తున్నది. ఒకవేళ జనసేన, బీజేపీ పొత్తుపెట్టుకుంటే ఆ టికెట్ రావడం కూడా కష్టమేనని తెలుస్తున్నది. చంద్రబాబు దయతలిచి టికెట్ ఇస్తే తప్ప రఘురామకు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి దారే దొరకడం లేదని సమాచరం. ఏదేమైనా.. తన పిచ్చితనం, నోటి దురుసుతో మంచి పార్టీ టికెట్‌ను పోగొట్టుకున్నారని.. రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కకపోతే రాజకీయ జీవితం కూడా ముగిసినట్లే అని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

First Published:  10 July 2022 12:56 PM IST
Next Story