పథకాలకు గాంధీ పేర్లు పెడితే.. నా తండ్రి పేరు ఎఫ్ఐఆర్‌లో పెట్టించారు..
వైఎస్సార్ పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో అమలైన ప్రతి పథకానికి ఆయన గాంధీ వారసుల పేర్లు పెట్టారు. ఇందిరా, రాజీవ్ లకు ఆయన ఎనలేని గౌరవం ఇచ్చారు. అయితే అలాంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించిందని, పథకాలకు గాంధీ కుటుంబం పేర్లు పెడితే.. ఆయన పేరుని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్‌లో పెట్టించిందని మండిపడ్డారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల. పార్టీ తొలి వార్షికోత్సవం సందర్భంగా.. వైఎస్ఆర్ పాలనను మరోసారి గుర్తు చేస్తూ.. ఇప్పటి పాలకులు ఆయన్ను […]
వైఎస్సార్ పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో అమలైన ప్రతి పథకానికి ఆయన గాంధీ వారసుల పేర్లు పెట్టారు. ఇందిరా, రాజీవ్ లకు ఆయన ఎనలేని గౌరవం ఇచ్చారు. అయితే అలాంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించిందని, పథకాలకు గాంధీ కుటుంబం పేర్లు పెడితే.. ఆయన పేరుని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్‌లో పెట్టించిందని మండిపడ్డారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల. పార్టీ తొలి వార్షికోత్సవం సందర్భంగా.. వైఎస్ఆర్ పాలనను మరోసారి గుర్తు చేస్తూ.. ఇప్పటి పాలకులు ఆయన్ను పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు షర్మిల.
కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కు గౌరవం ఇవ్వ లేదని, పార్టీకి ఆయన అధికారాన్ని ఇస్తే, ఆ పార్టీ వైఎస్సార్ కు ఏం చేసిందని ప్రశ్నించారు. వైఎస్సార్ కు ఆ పార్టీ వెన్నుపోటు పొడిచిందని, ఆ శాపమే ఇంకా కాంగ్రెస్ ను వెంటాడుతోందని అన్నారు షర్మిల. వైఎస్ఆర్ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవలు అందించారని, ఎన్నో సంక్షేమ పథకాలు అందించి కోట్లమంది ప్రజల గుండెల్లో నిలిచిపోయారని గుర్తు చేశారు షర్మిల.
హైదరాబాద్ నుంచి సువర్ణ పరిపాలన అందించి, సేవ చేస్తూనే చనిపోయారని, అలాంటి వైఎస్సార్ కు హైదరాబాద్ లో ఒక్క స్మారకం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో భూముల విలువ పెంచింది వైఎస్సారేనని, కానీ ఆయన్ను స్మరించుకోవడానికి నగరంలో సెంట్ భూమి కూడా ఇవ్వలేదని, ఇది నిజంగా సిగ్గుచేటు అని మండిపడ్డారు.
కేసీఆర్ కూడా అన్యాయం చేశారు..
కేసీఆర్ కూడా వైఎస్సార్ కు అన్యాయం చేశారని, వైఎస్సార్ కోసం కేటాయించిన భూమిని సైతం వెనక్కు లాక్కున్నారని షర్మిల ఆరోపించారు. 2004లో టీఆర్ఎస్ కు బలం లేకపోయినా.. అప్పట్లో కేసీఆర్ ను కలుపుకొని తెలంగాణకోసం వైఎస్సార్ పని చేశారని గుర్తుచేశారు. ఓడిపోయినా కూడా హరీష్ రావుకు మంత్రి పదవి ఇచ్చారన్నారు. టీఆర్ఎస్ భవన్ కు స్థలం ఇచ్చింది కూడా వైఎస్సారేనని, కానీ ఆయనకోసం ఇచ్చిన స్థలాన్ని కేసీఆర్ వెనక్కు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హైదరాబాద్ లో వైఎస్ఆర్ స్మారకం కోసం కేసీఆర్ స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఏడాదిలో ఎంతో ఎదిగాం..
వైఎస్సార్టీపీ పెట్టి ఏడాది కాలంలో ఎంతో పురోగతి సాధించామన్నారు షర్మిల. తెలంగాణ ప్రజలకు నిజమైన పక్షంగా నిలబడ్డామని, తాము చేస్తోన్న దీక్షల వల్లే పాలక పక్షానికి బుద్ధి వచ్చిందన్నారు. ఇప్పటివరకూ తెలంగాణలో 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, ఇంకా కొనసాగిస్తానని, అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానని స్పష్టం చేశారు.