Telugu Global
NEWS

నేడు వింబుల్డన్ ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్.. ఎవరు గెలిచినా చరిత్రే

వింబల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో ఇవాళ ఒక చరిత్ర నమోదు కానుంది. ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ సెంట్రల్ కోర్టులో శనివారం సాయంత్రం మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ట్యునీషియాకు చెందిన వరల్డ్ నెంబర్ 3 ఆన్స్ జబేర్, కజకిస్తాన్‌కు చెందిన వరల్డ్ నెంబర్ 17 ఎలెనా రబకీనా తలపడనున్నారు. వీరిద్దరిలో ఎవరు గెలిచినా, వారి దేశం తరపున గ్రాండ్‌స్లామ్ గెలిచిన తొలి ప్లేయర్లుగా చరిత్ర సృష్టించనున్నారు. 2015 వింబుల్డన్ ఫైనల్ చేరిన ముగురుజ తర్వాత తుది సమరానికి పోటీ పడుతున్న అతి […]

నేడు వింబుల్డన్ ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్.. ఎవరు గెలిచినా చరిత్రే
X

వింబల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో ఇవాళ ఒక చరిత్ర నమోదు కానుంది. ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ సెంట్రల్ కోర్టులో శనివారం సాయంత్రం మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ట్యునీషియాకు చెందిన వరల్డ్ నెంబర్ 3 ఆన్స్ జబేర్, కజకిస్తాన్‌కు చెందిన వరల్డ్ నెంబర్ 17 ఎలెనా రబకీనా తలపడనున్నారు. వీరిద్దరిలో ఎవరు గెలిచినా, వారి దేశం తరపున గ్రాండ్‌స్లామ్ గెలిచిన తొలి ప్లేయర్లుగా చరిత్ర సృష్టించనున్నారు. 2015 వింబుల్డన్ ఫైనల్ చేరిన ముగురుజ తర్వాత తుది సమరానికి పోటీ పడుతున్న అతి పిన్న వయస్కురాలిగా రబకీనా రికార్డులకు ఎక్కింది. ఇక ఓపెన్ ఎరాలో గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ చేరిన తొలి ఆఫ్రికన్, అరబ్ మహిళగా ఆన్స్ జబేర్ రికార్డు సృష్టించింది.

జుబేర్ ఫైనల్స్‌కు చేరుకునే సమయానికి వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచిన రికార్డు ఉంది. ఫైనల్ కూడా గెలిస్తే వరుసగా 12వ మ్యాచ్ అవుతుంది. వింబుల్డన్‌లోకి అడుగు పెట్టక ముందు ఆమె బెర్లిన్ ఓపెన్ టైటిల్ గెలిచింది. అలాగే సెరేనా విలియమ్స్‌తో కలిసి ఈస్ట్‌బోర్న్ ఓపెన్‌లో సెమీస్ వరకు చేరుకుంది. అయితే మోకాలి గాయం కారణంగా ఆ టోర్నీ నుంచి మధ్యలోనే బయటకు వచ్చేసింది. గత 24 మ్యాచ్‌లలో 22 మ్యాచ్‌లు గెలిచిన జుబేర్.. 2022లో రెండు టోర్నీలను గెలుచుకుంది. వింబుల్డన్ గెలిస్తే ఆమెకు తొలి గ్రాండ్‌స్లామ్ అవుతుంది.

ఇక రబకీనా కూడా వింబుల్డన్‌లో మంచి ప్రదర్శన చేస్తూ ఫైనల్‌కు చేరుకుంది. కొంత కాలంగా గాయాల కారణంగా సరైన ప్రాక్టీస్ లేకపోయినా.. గ్రాండ్‌స్లామ్‌లో చక్కగా రాణించింది. కానీ ఈ సీజన్‌లో ఆమెకు ఓటములు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సీజన్‌లో 37 మ్యాచ్‌లు ఆడిన రబకీనా.. 25 గెలుపులు, 12 ఓటములు సొంతం చేసుకుంది. మరోవైపు జుబేర్ గత రెండు సీజన్లలో ఏకంగా 84 మ్యాచ్‌లు గెలిచింది. మరే ఇతర మహిళా ప్లేయర్ ఇన్ని మ్యాచ్‌లు గెలవలేదు.

జుబేర్-రబకీనా ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లలో మాత్రమే తలపడ్డారు. 2019లో వుహాన్ ఓపెన్‌లో రబకీనా గెలిచింది. ఇక గత ఏడాది దుబాయ్ ఓపెన్‌లో జుబేర్ గెలిచింది. 2021 చికాగోలో జరిగిన మ్యాచ్‌లో కూడా వీరిద్దరూతలపడ్డారు. అయితే ఆ మ్యాచ్‌లో రబకీనా గాయం కారణంగా వైదొలిగింది.

మెన్స్ ఫైనల్‌లో తలపడనున్న జకోవిచ్-కైర్గియోస్
వింబుల్డన్ మెన్స్ ఫైనల్‌లో వరల్డ్ నెంబర్ వన్ నోవాక్ జకోవిచ్‌తో అన్‌సీడెడ్ ఆటగాడు నిక్ కైర్గియోస్ తలపడనున్నాడు. ఆదివారం సెంట్రల్ కోర్డులో వీరిద్దరి మధ్య మ్యాచ్ జరుగనుంది. జకోవిచ్ 32వ సారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరి, ఇప్పటి వరకు అత్యధిక గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ చేరిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రోజర్ ఫెదరర్, రఫెల్ నదాల్ చెరి 31 సార్లు ఫైనల్స్ చేరారు. జకోవిచ్ ఈ టైటిల్ గెలిస్తే.. ఏడు వింబుల్డన్ ట్రోఫీలతో పీట్ సంప్రాస్ సరసన చేరతాడు.

ఇక నిక్ కైర్గియోస్ అనూహ్య రీతిలో ఫైనల్స్‌కు చేరుకున్నాడు. రఫెల్ నదాల్ పొత్తి కడుపులో గాయం కారణంగా సెమీస్ నుంచి విరమించుకోవడంతో కైర్గియోస్‌కు వాకోవర్ లభించింది. దీంతో తొలి సారిగా గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరుకున్నాడు. ఓపెన్ ఎరాలో గ్రాండ్‌స్లామ్ సెమీస్‌ తర్వాత విరమించుకున్న మూడో ఆటగాడిగా నదాల్ రికార్డులకు ఎక్కాడు. అంతకు ముందు 1988లో క్రిస్ ఎవర్ట్ (యూఎస్ ఓపెన్), 1992లో రిచర్డ్ క్రిజిసెక్ (ఆస్ట్రేలియా ఓపెన్) ఇలాగే విత్‌డ్రా అయ్యారు.

First Published:  9 July 2022 3:30 AM IST
Next Story