Telugu Global
International

టీ కప్పులో ‘తుపాను’.. సుధామూర్తి కూతురుపై జనాల సెటైర్లు

బ్రిటన్‌లో పీఎం పోస్టుకు బోరిస్ జాన్సన్ రాజీనామా చేశాక మెల్లగా ఇంట్రెస్టింగ్ కథనాలు బయటకొస్తున్నాయి. వీటిలో ఇండియన్ ఆరిజిన్ రిషి సూనక్ తాలూకువే ఎక్కువ ! దేశ నూతన ప్రధానిగా, కన్సర్వేటివ్ కొత్త నేతగా తనను ఎన్నుకోవాలంటూ మాజీ ఆర్థికమంత్రి అయిన ఆయన ట్విట్టర్ వేదికగా ఇలా ప్రచారం ప్రారంభించారో, లేదో అప్పుడే ఆయన భార్య అక్షతా మూర్తి కూడా వార్తల్లోకి ఎంటరయ్యారు. మరేం లేదు ! బోరిస్ జాన్సన్ ఇల్లు బోసిపోయి కళావిహీనంగా ఉంటే ఇప్పుడు […]

టీ కప్పులో ‘తుపాను’.. సుధామూర్తి కూతురుపై జనాల సెటైర్లు
X

బ్రిటన్‌లో పీఎం పోస్టుకు బోరిస్ జాన్సన్ రాజీనామా చేశాక మెల్లగా ఇంట్రెస్టింగ్ కథనాలు బయటకొస్తున్నాయి. వీటిలో ఇండియన్ ఆరిజిన్ రిషి సూనక్ తాలూకువే ఎక్కువ ! దేశ నూతన ప్రధానిగా, కన్సర్వేటివ్ కొత్త నేతగా తనను ఎన్నుకోవాలంటూ మాజీ ఆర్థికమంత్రి అయిన ఆయన ట్విట్టర్ వేదికగా ఇలా ప్రచారం ప్రారంభించారో, లేదో అప్పుడే ఆయన భార్య అక్షతా మూర్తి కూడా వార్తల్లోకి ఎంటరయ్యారు. మరేం లేదు ! బోరిస్ జాన్సన్ ఇల్లు బోసిపోయి కళావిహీనంగా ఉంటే ఇప్పుడు వీరి ఇల్లు జర్నలిస్టులతో కళకళలాడుతోంది. వీళ్లకు టీ, బిస్కెట్స్ ఇవ్వడానికి అక్షతా మూర్తి తీసుకొచ్చిన టీ కప్పులే రెప్ప వాల్చకుండా చేశాయి.

అవి అల్లాటప్పా సాధారణ కప్పులు కావట ! ‘ఎమ్మా లేసీ’ అనే బ్రాండ్ కప్పులు. వీటి ధర ఒక్కొక్కటి 38 పౌండ్లట! ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 3,600 రూపాయలు. తమకు సర్వ్ చేయడానికి మేడం తెచ్చిన ఖరీదైన ఈ టీ కప్పులు చూసి జర్నలిస్టుల కళ్ళు పెద్దవయ్యాయి. ఎప్పుడు, ఏది దొరుకుతుందా అని కళ్ళు కాయలు కాచేలా చూసే వీరికి మంచి ‘బిస్కెట్లే’ దొరికాయి. మీడియాకు టీ ఇచ్చేందుకు ఈ కప్స్ వాడుతున్నారంటే.. మీరు కూడా బోరిస్ జాన్సన్ ని కాపీ కొడుతున్నారా అని ఓ యూజర్ ఠక్కున అనేశాడు. ఆయన కూడా అంతేనట.

రిషి సూనక్ ఇలాంటి కప్స్ ని వాడుతున్నారంటే తాము నమ్మలేకపోతున్నామని, మిలియనీర్ అయిన అక్షతా మూర్తి.. బోరిస్ జాన్సన్ ని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోందని ఆ యూజర్ వ్యాఖ్యానించాడు. జాన్సన్ రియల్ మగ్గులు వాడాడని, కానీ మీరు.. కాస్త ఎక్కువ స్థాయిలోనే ఉన్నారని సెటైర్ వేశాడు. మరొకరు.. ఈ కప్ ధర ఎలా ఉందంటే దీనికి పెట్టిన ఖర్చుతో ఓ కుటుంబానికి రెండు రోజులపాటు ఫుడ్ పెట్టవచ్చని కాస్త విమర్శనాత్మకంగా కామెంట్ చేశాడు. అసలింతకీ వీళ్ళిలా గొంతు చించుకోవడానికి కారణాలున్నాయి.

బ్రిటన్ లో జీవన వ్యయం చాలా ఎక్కువ.. ప్రతి వస్తువు ధర దాదాపు ఆకాశాన్ని అంటుతుంటుంది. బోరిస్ జాన్సన్ ప్రభుత్వం పట్ల ప్రజల అసహనం, కోపం పెరిగిపోవడానికి ఇది కూడా కారణమైంది. అందుకే ఆయన రాజీనామా చేసినా ఎవరూ నిరసన ప్రకటించలేదు. ఇక రిషి సూనక్ పాపులారిటీ కూడా తగ్గిందంటే అందుకు కారణం ఆయన పన్నులు పెంచడమే ! ఆయన భార్య అక్షతా మూర్తి ట్యాక్సుల వ్యవహారం సైతం వివాదంగా మారగా విపక్షాలు దీన్ని తప్పు పడుతూ వచ్చాయి.

ఇప్పటికీ భారతీయ పౌరురాలే అయిన ఈమెకి తన తండ్రి నేతృత్వంలోని ఇన్ఫోసిస్ సంస్థలో సుమారు 1.2 బిలియన్ డాలర్ల విలువైన షేర్లు ఉన్నాయి. ఆ మధ్య ఈమె పన్నుల వ్యవహారంపై ప్రభుత్వం ఎంక్వయిరీ కూడా వేసింది. అయితే అంతా సక్రమంగానే ఉన్నాయని, తానెలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. ఏమైనా- దేశ కొత్త ప్రధాని పదవికి తన భర్త రేసులో ఉన్న నేపథ్యంలో మిసెస్ మూర్తి.. జర్నలిస్టులకు ఖరీదైన కప్పుల్లో టీ తెచ్చి ఇవ్వడమే కొసమెరుపు !

First Published:  9 July 2022 9:07 AM GMT
Next Story