ఒత్తిడిని జయించడానికి ఇవి చాలా ముఖ్యం!
ఇప్పటికాలంలో ఒత్తిడి అనేది చాలామందిలో కనిపిస్తోంది. ముఖ్యంగా యువత ఈ ఒత్తిడి అనే భారాన్ని ఎక్కువగా మోస్తుంటారు. కారణాలు ఏవైనా మానసికంగా నలిగిపోతూ పరిష్కారం లేని సమస్యలు తమచుట్టూ ఉన్నాయని భావిస్తారు. వ్యక్తిగత విషయాలలో చెప్పలేని అనుభవాలు అందరినీ నిలకడగా ఉండనివ్వవు. ఆ నిలకడలేనితనం కాస్తా ఒత్తిడిని పెంచి ఈ సమాజంలో అందరినీ దూరం విసిరేస్తుంది. అందరి నుండి దూరం లాక్కెళుతుంది. ఇవన్నీ కలసి శరీరానికి, మనసుకు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. ఒకదానికొకటి ఇలా గొలుసుకట్టు సమస్యలను […]
ఇప్పటికాలంలో ఒత్తిడి అనేది చాలామందిలో కనిపిస్తోంది. ముఖ్యంగా యువత ఈ ఒత్తిడి అనే భారాన్ని ఎక్కువగా మోస్తుంటారు. కారణాలు ఏవైనా మానసికంగా నలిగిపోతూ పరిష్కారం లేని సమస్యలు తమచుట్టూ ఉన్నాయని భావిస్తారు. వ్యక్తిగత విషయాలలో చెప్పలేని అనుభవాలు అందరినీ నిలకడగా ఉండనివ్వవు. ఆ నిలకడలేనితనం కాస్తా ఒత్తిడిని పెంచి ఈ సమాజంలో అందరినీ దూరం విసిరేస్తుంది. అందరి నుండి దూరం లాక్కెళుతుంది. ఇవన్నీ కలసి శరీరానికి, మనసుకు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి.
ఒకదానికొకటి ఇలా గొలుసుకట్టు సమస్యలను సృష్టించే ఒత్తిడిని జయించడానికి చాలామంది చాలారకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాలలో కొందరు ఆశ్రయించేవి మద్యపానం, ధూమపానం వంటి అనారోగ్యకరమైన అలవాట్లు. ఈ అలవాట్లు మనిషికి మత్తును ఇచ్చి ఆలోచనల నుండి దూరం చేసినట్టు అనుభూతిని మాత్రమే ఇస్తాయి. కానీ శరీరానికి చెయ్యాల్సినంత నష్టాన్ని చేస్తాయి. ముక్కు, నోరు, ఊపిరితిత్తులు ఇలా ధూమపానం, మధ్యపానం వల్ల నష్టానికి గురవ్వని శరీర భాగాలు లేవంటే అతిశయోక్తి కాదు.కానీ ఈ ఒత్తిడిని అనారోగ్యకరమైన అలవాట్లతో కాకుండా విటమిన్ ఫుడ్ తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు వైద్యులు. ఏ విటమిన్ వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుంటే ఆ విటమిన్ ఉన్న ఆహారపదార్థాలు తీసుకుంటూ ఒత్తిడికి టాటా చెప్పేయచ్చు.
విటమిన్ బి-కాంప్లెక్స్
విటమిన్ బి-కాంప్లెక్స్ అనేది 8 రకాల విటమిన్ బిల కలయిక, అవి థయామిన్ (విటమిన్ బి1), రిబోఫ్లావిన్ (విటమిన్ బి2), నియాసిన్ (విటమిన్ బి3), పాంతోతేనిక్ యాసిడ్ (విటమిన్ బి5), విటమిన్ బి6, బయోటిన్ (విటమిన్ బి7), ఫోలిక్ యాసిడ్ (ఫోలేట్) మరియు విటమిన్ బి12. అనేక పరిశోధన అధ్యయనాల ప్రకారం ఈ బి-కాంప్లెక్స్ విటమిన్ లు సహజంగా మానసిక ఒత్తిడి తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి మెదడులో రసాయనచర్య జరపడం ద్వారా మెదడు పనితీరును, మెదడులో ఉండే న్యూరోట్రాన్స్‌మిటర్‌లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.
విటమిన్ బి-కాంప్లెక్స్ రోజూ తీసుకోవడం వల్ల నిరాశ, ఆందోళన మరియు పని ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. మాంసం, చికెన్, కాయధాన్యాలు, గుడ్డు సొనలు, పాలు, పాల ఉత్పత్తులు మరియు సోయాబీన్స్ మొదలైనవాటిలో సహజంగా విటమిన్ బి-కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది.
విటమిన్-డి
“సన్ షైన్”విటమిన్ అని పిలుచుకునే ఈ విటమిన్-డి ఒత్తిడిని తరిమికొట్టడానికి చాలా సహాయపడుతుంది. ఇది నరాలు, మెదడు ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. మానసిక స్థితిని గట్టిగా ఉంచడంలో ఆందోళన, నిరాశలను అదుపులో ఉంచడంలో విటమిన్-డి అద్భుతమైన పనితీరు కలిగిఉంటుంది. విటమిన్-డి ని సూర్యరశ్మి ద్వారా పొందవచ్చు. అలాగే గుడ్డు సొనలు, సాల్మన్ చేపలు, నారింజ రసం, మీగడతీయని పాలు మొదలైనవాటిలో ఉంటుంది.
మెగ్నీషియం:
మెగ్నీషియం కండరాలు, నరాల పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది చాలా గొప్ప ఖనిజం. ఆందోళనను తగ్గించడానికి, కండరాల ఆరోగ్యానికి మెగ్నీషయంను వైద్యులు సూచిస్తారు. ఇది శరీరంలో విటమిన్లను సులభంగా గ్రహించేలా చేస్తుంది. మెగ్నీషియం లోపం శరీరంలో హానికరమైన ప్రభావాలను కలిగించి అది ఒత్తిడికి దారితీసేలా చేస్తుంది.
మెగ్నీషియం కోసం వైద్యులు సూచించే మెగ్నీషియం సప్లిమెంట్లను తీసుకోవచ్చు లేదా పొట్టుతీయని గోధుమలు, బచ్చలికూర, బాదం మరియు జీడిపప్పు, డార్క్ చాక్లెట్, బ్లాక్ బీన్స్ వంటి ఆహారాలను అయినా తీసుకోవచ్చు.
ఒత్తిడిని నివారించడానికి జీవనశైలిలో మూడురకాల పనులు ఎంతో సహకరిస్తాయి. అవి ఆహారం, వ్యాయామం, విశ్రాంతి. ఇవి మూడు శరీరానికి తగినమోతాదులో లభిస్తే ఒత్తిడి అనే పదానికి దూరంగా ఉండవచ్చు.