Telugu Global

మోసం…దగా…రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ధాన్యం కొన్నది…కేంద్ర సర్కార్ ఒక్క గింజా తీసుకోవడం లేదు

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలు మోదీకి కోపం తెప్పించాయి. తాము ఎటువంటి వివక్ష చూపడం లేదంటూ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కానీ వాస్తవాలు మోదీ మాటలకు భిన్నంగా ఉన్నాయి. లెక్కలు మోదీ మాట‌ల్లోని అబద్దాలను ఎత్తి చూపిస్తున్నాయి. తెలంగాణలో రైతులు పండించే ప్రతి గింజను కొనుగోలు చేస్తామని బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, జి కిషన్ రెడ్డి పదే […]

మోసం…దగా…రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ధాన్యం కొన్నది…కేంద్ర సర్కార్ ఒక్క గింజా తీసుకోవడం లేదు
X

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలు మోదీకి కోపం తెప్పించాయి. తాము ఎటువంటి వివక్ష చూపడం లేదంటూ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కానీ వాస్తవాలు మోదీ మాటలకు భిన్నంగా ఉన్నాయి. లెక్కలు మోదీ మాట‌ల్లోని అబద్దాలను ఎత్తి చూపిస్తున్నాయి.

తెలంగాణలో రైతులు పండించే ప్రతి గింజను కొనుగోలు చేస్తామని బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, జి కిషన్ రెడ్డి పదే పదే హామీలు గుప్పించిన విషయం మర్చిపోలేం కదా ! మరి నిజంగానే కేంద్రం తెలంగాణ సర్కార్ సేకరించిన ధాన్యాన్ని కొన్నదా ?

వరి వేయొద్దని కేసీఆర్ చెప్పినప్పటికీ ‘వరే వేయండి ఎలా కొనరో చూస్తానం’టూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పిన మాటలు, ఎంత పండించినా కొంటామంటూ కేంద్రమంత్రుల ప్రకటనలతో రైతులు 52 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. అయితే కేంద్ర ప్రభుత్వం మిగులు నిల్వలుగా చూపిస్తూ బాయిల్డ్ రైస్‌ను కొనుగోలు చేసేందుకు నిరాకరించింది. తదనంతరం, యాసంగి (రబీ) సీజన్‌కు సంబంధించి 40.20 లక్షల టన్నుల ముడి బియ్యం,2.60 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయడానికి భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు వచ్చినా దాదాపు 9.42 లక్షల మంది రైతుల నుంచి రూ.9,834.87 కోట్ల వ్యయంతో 50.24 లక్షల టన్నుల వరిని కొనుగోలు చేసింది. సుమారు రూ.3 వేల కోట్ల నష్టం వాటిల్లినప్పటికీ 6,609 కొనుగోలు కేంద్రాల ద్వారా వరి సేకరణను విజయవంతంగా పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వరి సేకరణపై కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి రైస్ మిల్లర్లకు మిల్లింగ్ కోసం అప్పగించింది. ఇప్పటికే కొందరు రైస్ మిల్లర్లు బియ్యాన్ని మిల్లింగ్ చేసినా ఎఫ్‌సీఐ నుంచి మాత్రం బియ్యం సరఫరాకు సంబంధించి ఎలాంటి స్పందనా లేదు.

దీంతో మిల్లర్లు వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం ఆపేశారు. ధాన్యం నిల్వలు ఉంచేందుకు సరిపడా నిల్వ స్థలం లేకపోవడంతో నష్టపోతున్నామని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వానలు ప్రారంభం కావడంతో వారు ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను ఆశ్రయించారు.

“ముడి బియ్యం నిల్వలను తీసుకెళ్ళాలని మేము ఎఫ్‌సిఐ అధికారులను పదేపదే అభ్యర్థిస్తున్నాము, కాని ఎటువంటి స్పందన లేదు. రెండు వారాల్లో కేంద్రం మా అభ్యర్థనలపై స్పందిస్తుందని మేము ఆశిస్తున్నాము. సమాధానం రాకపోతే, మేము ఏం చేయాలో ఆలోచిస్తాము ” అని గంగుల కమలాకర్ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం బియ్యం కొనుగోళ్లపై ఆంక్షలు విధించడంతో గత రెండు పంటల సీజన్‌లో సేకరించిన ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం వద్ద దాదాపు 92 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయని పౌరసరఫరాల శాఖలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. “స్టాక్ సరఫరాలలో వ్యత్యాసాలున్నాయని ఆరోపిస్తూ FCI చాలా బియ్యం స్టాక్‌ను తీసుకెళ్ళ‌లేదు. ఆ విషయంపై మేము ఇప్పటికే చాలా సార్లు FCIకి స్పష్టత ఇచ్చాము. వారు చెప్తున్న అన్ని కేసులలో చర్యల‌ను ప్రారంభించాము. అయినా కూడా వారి నుండి తదుపరి కమ్యూనికేషన్ లేదు, ” అని ఆ అధికారి చెప్పాడు.

రైస్ మిల్లర్ల వద్ద,ప్రభుత్వ గోడౌన్ల లో ఉన్న నిల్వలను క్లియర్ చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు న్యాయపరమైన చర్యలతో పాటు వివిధ పరిష్కారాలను పరిశీలిస్తోంది, అయితే ఈ సమస్య‌ను సామరస్యంగా పరిష్కరించుకోవడమే తమ మొదటి ప్రాధాన్యత అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది.

మరి బీజేపీనేతలు వారు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకుంటారా ? FCI రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేస్తుందా ? ఇవి జరగక పోతే ఈ వానాకాలం ధాన్యాన్ని కాపాడటం సాధ్యమవుతుందా ? ఈ సారే ఇలాగైతే మరి వచ్చే సీజన్ పరిస్థితి ఏంటి ? బీజేపీ అధికారంలోకి రావాలంటే రైతుల ఉసురు పోసుకోవల్సిందేనా ?

First Published:  9 July 2022 6:32 AM IST
Next Story