అదుపు తప్పిన శ్రీలంక… ప్రధాని ఇంటికి నిప్పు, ఎంపీలపై దాడులు…చేతులెత్తేసిన సైన్యం
శ్రీలంకలో ఈ రోజు ఉదయం నుంచి సాగుతున్న ప్రజల నిరసనలు అదుపు తప్పాయి. వేలాది మంది ప్రజలు కొలొంబో చేరుకొని ఈ రోజు ఉదయాన్నే అధ్యక్ష భవనాన్ని ఆక్రమించారు. ఆ నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్సే పారిపోయాడు. అయినప్పటికీ పొద్దటి నుంచి ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొలొంబోలో గంట గంటకూ ప్రజా సమూహము పెరుగుతూ ఉంది. శ్రీలంకలోని అన్ని ప్రాంతాలనుంచి ఏ వాహనం దొరికితే ఆ వాహనాన్ని పట్టుకొని ప్రజలు కొలొంబో చేరుకుంటున్నారు. మరో వైపు ప్రధాని […]
శ్రీలంకలో ఈ రోజు ఉదయం నుంచి సాగుతున్న ప్రజల నిరసనలు అదుపు తప్పాయి. వేలాది మంది ప్రజలు కొలొంబో చేరుకొని ఈ రోజు ఉదయాన్నే అధ్యక్ష భవనాన్ని ఆక్రమించారు. ఆ నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్సే పారిపోయాడు. అయినప్పటికీ పొద్దటి నుంచి ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొలొంబోలో గంట గంటకూ ప్రజా సమూహము పెరుగుతూ ఉంది. శ్రీలంకలోని అన్ని ప్రాంతాలనుంచి ఏ వాహనం దొరికితే ఆ వాహనాన్ని పట్టుకొని ప్రజలు కొలొంబో చేరుకుంటున్నారు.
మరో వైపు ప్రధాని విక్రసింఘే రాజీనామా చేసినప్పటికీ కొద్ది సేపటి క్రితం ఆయన ఇంటిపై ఆందోళనకారులు దాడి చేసి ఇంటికి నిప్పు పెట్టారు. అంతే కాదు ఎంపీల ఇళ్ళపై కూడా దాడులు జరుగుతున్నాయి. కొందరు ఎంపీలను రోడ్లపై తరిమి కొట్టడం కనిపించింది. అటు పోలీసులు, ఆర్మీ పరిస్థితులను అదుపు చేయలేక చేతులెత్తేశాయి. కొలొంబోలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ నాయకులు చాలా మంది కొలొంబో నుంచి పారిపోతున్నారు.
ఇక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే ఎక్కడికి పారిపోయాడనే విషయం మిస్టరీగానే ఉంది. SLNS గజాబహు అనే పేరు గల నౌకలోకి అధ్యక్షుడు విదేశాలకు పారిపోయాడని తనతో పాటు బంగారం, నగదు తీసుకెళ్ళారనే వార్తలు వస్తున్నాయి. మరో వైపు ఆ నౌక తీరానికి కొంత దూరంగా సముద్రం మధ్యకు వెళ్లి ఓ సురక్షిత ప్రాంతంలో లంగర్ వేసుకొని ఉందని, తనకు భద్రత ఉందనే నమ్మకం కలిగిన తర్వాతే మెయిన్ ల్యాండ్ లోకి ఆయన అడుగు పెడతాడనే వార్తను న్యూస్ ఫస్ట్ ఛానెల్ ప్రసారం చేసింది.
కాగా శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఈ నెల 13 న తన పదవికి రాజీనామా చేస్తారని పార్లమెంట్ స్పీకర్ మహింద యాప అబెయ్ వర్దెన కొద్ది సేపటి క్రితం ప్రకటించారు.