సీనియర్ల ఫిరాయింపులు: కాంగ్రెస్ కోలుకోగలదా?
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ బీజేపీలో చేరడానికి రంగం సిద్ధమైంది.బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రత్యేక సమావేశం ఇందుకు సూచిక. త్వరలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే వీరిరువురి కలయిక నేపథ్యం. ఆనంద్ శర్మ హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.గత మేలో పదవీకాలం ముగిసింది. కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను మళ్లీ రాజ్యసభకు పంపలేదు. దీంతో ఆనంద్ శర్మ అసంతృప్తికి లోనయ్యారు.కనుక ఆయనకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని బీజేపీ ఆఫర్ చేసి […]
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ బీజేపీలో చేరడానికి రంగం సిద్ధమైంది.బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రత్యేక సమావేశం ఇందుకు సూచిక. త్వరలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే వీరిరువురి కలయిక నేపథ్యం. ఆనంద్ శర్మ హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.గత మేలో పదవీకాలం ముగిసింది.
కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను మళ్లీ రాజ్యసభకు పంపలేదు. దీంతో ఆనంద్ శర్మ అసంతృప్తికి లోనయ్యారు.కనుక ఆయనకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని బీజేపీ ఆఫర్ చేసి ఉండవచ్చు.తమ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని ఆనంద్ శర్మ చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవు.
పార్టీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీ ఫిరాయిస్తున్నారు.గాంధీ కుటుంబానికి విధేయులుగా గుర్తింపు పొందిన వారు సైతం జారుకుంటున్నారు.వరుస వలసలను ఎందుకు నిరోధించలేకపోతున్నారు? అసలు సమస్య ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా మూల స్తంభాలుగా కనిపించిన కుటుంబాలు కాంగ్రెస్ కు దూరమవుతున్నవి.
బీజేపీ ఒక పథకం ప్రకారమే కాంగ్రెస్ సీనియర్లకు గాలం వేసి లాక్కుంటోంది.అలా వచ్చిన వారికి కీలక పదవులను కూడా కట్టబెడుతోంది.సింధియా,జితిన్ ప్రసాద, ఆర్పీఎన్ సింగ్ బిజెపిలోకి వెళ్లిపోయారు. ‘గాంధీ’ కుటుంబంతో వాళ్లకు పలు తరాల అనుబంధం ఉంది. కాంగ్రెస్ లోనే పుట్టి రాజకీయంగా ఎదిగిన వాళ్ళు కూడా ‘మతం’ మార్చుకుంటున్నారు.
2014 మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ను బలహీనపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.హర్యానా కాంగ్రెస్ నాయకులు బీరేందర్ సింగ్,రావ్ ఇంద్రజిత్ సింగ్ బీజేపీలో చేరిన వెంటనే ప్రధాని మోదీ తొలి కేబినెట్‌లో మంత్రులయ్యారు. 2015 లో బీజేపీ తీర్ధం పుచ్చుకున్న అసోం నాయకుడు హిమంత బిశ్వశర్మ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.
ఆయనపై గతంలో ఈ.డీ. కేసులున్నాయి.బీజేపీలో చేరితే ‘కళంకితులు’ పునీతులుగా మారే విషయం రహస్యమేమీ కాదు. కేంద్ర మాజీ మంత్రులు ఎస్ఎం కృష్ణ,జయంతి నటరాజన్, అమేథీ రాజకుటుంబానికి చెందిన సంజయ్ సింగ్ బీజేపీలోకి చేరిపోయారు. రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ గా పని చేసిన భువనేశ్వర్ కలితా 2019లో బీజేపీలో చేరారు.మణిపుర్‌లో కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ బీజేపీలో చేరారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషి బీజేపీలో చేరారు.
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరి కేంద్రమంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు.ఆయన ఫిరాయింపు మూలంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పతనమై అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది.
జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా చనిపోయే వరకు కాంగ్రెస్ లో కొనసాగారు.అయితే పార్టీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా జ్యోతిరాదిత్య సింథియా బీజేపీకి వలస వెళ్లారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనా ధోరణిలో,నాయకత్వలో సంస్కరణలు తీసుకురావాలని లేఖ రాసిన ‘జి-23’ కాంగ్రెస్ సభ్యుల బృందంలో జితిన్ ప్రసాద,ఆనంద్ శర్మ కూడా ఉన్నారు.” రాజకీయంగా భవిష్యత్ లేదనుకోవడం వల్లనే నాయకులు పార్టీని వీడుతున్నారు.
అవతల బీజేపీలో ఆకర్షణీయమైన అవకాశాలు పుష్కలంగా ఉన్నవి” అని జేఎన్ యు ప్రొఫెసర్ సంజయ్.కె.పాండే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
”కాంగ్రెస్ సముద్రం లాంటిది. కొందరు సీనియర్ నాయకులు పార్టీని వీడినంత మాత్రాన ఎలాంటి తేడా ఉండదు.దేశంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్‌కు మాత్రమే గుర్తింపు ఉన్నది.కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా ప్రతి ఇంటిపైనా ఆ పార్టీకి పట్టు ఉంది”.
అని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ కుటుంబ భజనబృందంలో ఆయన ఒక సభ్యుడు.ఈ భజనబృందంలో కేసి. వేణుగోపాల్, తెలంగాణ ఇంచార్జి మాణికం టాగూర్ తదితరులు ముఖ్యులు.
అశోక్ గెహ్లాట్ కు ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కు మధ్య రాజస్థాన్ లో కోల్డ్ వార్ నడుస్తోంది.దీన్ని ఆసరా చేసుకొని ‘మధ్యప్రదేశ్ ప్రయోగం’ అమలు చేయడానికి బీజేపీ నాయకత్వం గతంలో ప్రయత్నించింది కానీ చివరి నిముషంలో భగ్నమైంది.లేకపోతె మహారాష్ట్రకు ముందు రాజస్థాన్ బిజేపి ఖాతాలోకి వెళ్లి ఉండేది.
కాంగ్రెస్ పార్టీ తన స్వయంకృతాపరాధాల వల్లనే కుదించుకుపోతోంది.మరోవైపు నరేంద్రమోదీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న పద్ధతుల మూలంగా కాంగ్రెస్ ఇంకా అథఃపాతాళానికి కూరుకుపోవచ్చు.కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యులను లాగివేయడం ద్వారా పార్టీ మూలాలను పెకిలించవచ్చునని బిజెపి భావిస్తోంది.
రాజకీయ నాయకత్వం సమర్ధంగా లేనందున కాంగ్రెస్ ను అణిచివేయడం బీజేపీకి సులభమవుతోంది. కాంగ్రెస్‌లో రాజకీయ నాయకత్వాన్ని అందించే జీవశక్తి లేకపోవడమే వలసలకు ప్రధాన కారణంగా విశ్లేషించవచ్చు. బలమైన రాజకీయ నాయకత్వం ఉన్న పార్టీ బలమైన, వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటుంది.భారత రాజకీయాల్లో ఇందుకు కేసీఆర్ ఒక ఉదాహరణ.ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో,ఎంత వేగంగా తీసుకోవాలో టిఆర్ఎస్ అధ్యక్షునికి తెలుసు.
తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కాంగ్రెస్ నాయకత్వానికి లేనందున మోదీకి కాంగ్రెస్‌ను తుడిచిపెట్టగలిగే బలం చేకూరుతోందనడం వాస్తవం. ”పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించి, బలమైన, సమర్థమైన, అందరికీ అందుబాటులో ఉండే నాయకత్వాన్ని ఏర్పర్చుకోవాలి” అని 23 మంది పార్టీ నాయకులు సూచించినా పార్టీ నాయకత్వం ఖాతరు చేసిన దాఖలాలు లేవు.
‘’సోనియా లేకపోతే మీరెక్కడుండేవారు? ఆమె లేకపోతే మీకు పదవులు ఉండేవి కావు, మిమ్మల్ని ఎవరూ గుర్తించేవారు కాదు..’’ అని రాజస్థాన్ ముఖ్యమంత్రి వీర విధేయతను ప్రదర్శించారు.”భారత జాతీయ కాంగ్రెస్ లేకపోతే ఎవరూ లేరు.నేనూ లేనూ,మీరూ లేరు.’’ అని గెహ్లాట్ పై ఆనంద్ శర్మ అప్పట్లో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ జోక్యంతో ఆ గొడవ తాత్కాలికంగా ముగిసింది. కొంతకాలం పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన రాహుల్ గాంధీ రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశాక అస్త్ర సన్యాసం చేశారు.అందువల్ల రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగవలసి వస్తోంది.
”జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడాలి. ఆ పార్టీ బలహీనపడితే, ఇతర ప్రాంతీయ పక్షాలు దాని స్థానంలో ప్రవేశిస్తాయి,ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు”అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.కానీ ఇప్పటికిప్ప్పుడు కాంగ్రెస్ బలోపేతమయ్యే అవకాశాలు ఎందుకో కనుచూపుమేరలో కనిపించడం లేదు.కాగా 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఎన్నికల లోపు 9 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నవి.
గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్‌లలో బిజెపి, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి మల్ల యుద్ధం జరగనుంది.తెలంగాణలో టిఆర్ఎస్ తో కాంగ్రెస్,బీజేపీ తలపడనున్నవి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను తుడిచిపెడితే దేశంలో ఇక తమకు తిరుగుండదన్నది బీజేపీ ఆలోచన.ఆ తర్వాత భారత ప్రజాస్వామ్యం పూర్తిగా ఏకపార్టీ దిశగా పయనించే అవకాశాలు స్పష్టంగా ఏర్పడనున్నవి.
‘కాంగ్రెస్ విముక్తి’ అయిన తర్వాత ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టడం పెద్ద విషయం కాదని బిజెపి భావన.కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరు వల్ల ప్రాంతీయ పార్టీలన్నీ ఢిల్లీ నుంచి తనను తాను రక్షించుకునేందుకు ఆత్మరక్షణ పద్ధతులను అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే కేసీఆర్,మమతా బెనర్జీ వంటి కొందరు నాయకులను మినహాయించవచ్చు.వాళ్ళు బీజేపీని అవసరమైన సందర్భాల్లో చీల్చి చెండాడుతున్నారు. బెదరకుండా ఛాలెంజ్ విసురుతున్నారు.
కాగా కాంగ్రెస్ చావుబతుకుల్లో ఉన్నట్టు సోనియాగాంధీకి తెలుసు.1998లో సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడు మధ్యప్రదేశ్, ఒడిషా, మిజోరంలలో మాత్రమే అధికారంలో ఉన్నది. అప్పటి నుంచీ ఒకో రాష్ట్రాన్ని కాంగ్రెస్ గెలుచుకుంటూ 2004లో కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది.కానీ ఇప్పుడు ఆ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్‌లలో మాత్రమే అధికారంలో ఉన్నది. వచ్చే రెండేళ్లలో ఈ రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం ఒక సవాలు.’ప్రత్యర్థి చేతుల్లో బలికావడం కంటే శాయశక్తులా పోరాడి కనీసం జీవించేందుకు’ ప్రయత్నించక తప్పనిసరి పరిస్థితి కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోంది.