Telugu Global
International

రంగంలోకి దిగిన ఇన్ఫోసిస్ అధినేత అల్లుడు..

భోరుమంటూ బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేశాక.. బ్రిటన్ ఇప్పుడు ఈ పోస్టులో కొత్త ముఖం కోసం వేచి చూస్తున్న వేళ… రేసులో నేను ముందున్నానంటూ రిషి సూనక్ ప్రకటించారు. భారత సంతతికి చెందిన 42 ఏళ్ళ ఈ నేత తానే ఈ పదవికి తగినవాడినని అంటున్నారు. తన ఇండియన్ ఆరిజిన్ గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్ ఫొటోలతో కూడిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. పీఎం పదవికి తనకే అర్హత ఉందని ఆయన ప్రచారం పారంభించారు. […]

Rishi Sunak
X

భోరుమంటూ బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేశాక.. బ్రిటన్ ఇప్పుడు ఈ పోస్టులో కొత్త ముఖం కోసం వేచి చూస్తున్న వేళ… రేసులో నేను ముందున్నానంటూ రిషి సూనక్ ప్రకటించారు. భారత సంతతికి చెందిన 42 ఏళ్ళ ఈ నేత తానే ఈ పదవికి తగినవాడినని అంటున్నారు.

తన ఇండియన్ ఆరిజిన్ గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్ ఫొటోలతో కూడిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. పీఎం పదవికి తనకే అర్హత ఉందని ఆయన ప్రచారం పారంభించారు. బ్రిటన్ మాజీ ఆర్ధిక మంత్రిగా బాగానే పాపులర్ అయిన ఈయన.. శుక్రవారం లాంఛనంగా దీనికి శ్రీకారం చుట్టారు. కన్సర్వేటివ్ పార్టీ కొత్త నేతగా, భావి బ్రిటన్ ప్రధానిగా సేవలందిస్తానని, దేశాన్ని సరైన దిశలో ముందుకు నడిపిస్తానని హామీ ఇస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

ఈ వారారంభంలో బోరిస్ జాన్సన్ ప్రభుత్వాన్ని ధైర్యంగా సవాలు చేసి తన పదవికి రాజీనామా చేసిన సూనక్ లో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఒక విధంగా జాన్సన్ ప్రభుత్వ పతనానికి ఈయనే మొట్టమొదట బీజం వేసిన వాడయ్యారు.

సూనక్ రాజీనామా తరువాత వరుసగా చాలామంది మంత్రులు ఈయన బాటలోనే నడిచి పదవులు వదులుకున్నారు. ‘కన్సర్వేటివ్ పార్టీ తదుపరి నేతగా, మీ ప్రధాన మంత్రిగా మీ ముందుకు రావడానికి సిధ్ధపడుతున్నాను. రండి ! విశ్వాసాన్ని, ఎకానమీని పునరుద్ధరించి ఈ దేశాన్ని సమైక్యం చేద్దాం’ అని రిషి సూనక్ తన మెసేజ్ లో పేర్కొన్నారు. ఎవరో ఒకరు ఈ తరుణంఫై పట్టు బిగించి సరైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంది అన్నారు.

నిజాయితీగా, సీరియస్ గా పని చేద్దామా.. లేక కాకమ్మ కథలు చెబుతూ మన పిల్లలను రేపు అధ్వాన్న స్థితిలోకి నెడదామా ..ఆలోచించుకొండి అని దాదాపు హెచ్చరిక చేసినంత పని చేశారు. దేశభక్తి, హార్డ్ వర్క్, విలువలతో కూడిన రాజకీయాలు అవసరమని, ఇది మీకూ తెలుసునని అన్నారాయన.

తన కుటుంబం తనకు అన్నీ ఇచ్చిందని, ఈ కుటుంబమే తనకు అన్నీ అని పేర్కొన్న ఆయన.. వాళ్ళు తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చారని, నా గురించి కలలు కన్నారని తెలిపారు. కానీ ఈ బ్రిటన్.. మన దేశం.. వారికీ, వారి వంటి లక్షలాది కుటుంబాలకు మెరుగైన భవిష్యత్తునిచ్చిందని సూనక్ అన్నారు. మన పిల్లలకు కూడా అలాంటి ఉజ్వల భవితవ్యాన్ని ఇవ్వాల్సి ఉందని, ఎన్నో సవాళ్లనెదుర్కొంటున్న మన దేశానికి ఇది కూడా పెద్ద సవాలేనని పేర్కొన్నారు. తదుపరి తరం వారు కూడా ఈ విధమైన భవిష్యత్తుతో ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. కోవిడ్ సమయంలో బ్రిటన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు .. అదొక పీడకలగా మారినప్పుడు ఆర్ధిక మంత్రిగా తాను అత్యంత కఠినమైన పరిస్థితినెదుర్కొన్నానన్నారు.

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడైన రిషి సూనక్.. బ్రిటన్ భావి ప్రధానిగా తాను కావచ్చునన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ దేశాన్ని ఆయన ‘కర్మభూమి’గా అభివర్ణించారు. తన నేషనల్ హెల్త్ సర్వీస్ జనరల్ ప్రాక్టీషనర్, తండ్రి యశ్వీర్, ఫార్మసిస్ట్ అయిన తల్లి ఉష చేసిన త్యాగాలను ఆయన గుర్తుకు తెచ్చారు.

ఒకప్పుడు తూర్పు ఆఫ్రికా ద్వారా తన గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్ బ్రిటన్ కి ఎలా వలస వచ్చారో వివరించారు. సౌతాంఫ్టన్ లో పుట్టిన ఈయన 2016 లో రాజకీయాల్లో ఎంటరయ్యారు. 2020 లో ఛాన్సలర్ కాక ముందు వివిధ సహాయ మంత్రి పదవుల్లో కొనసాగారు. బ్రిటన్ లో ఉన్న లక్షలాది ప్రవాస భారతీయ కుటుంబాలు ఈయనను ప్రధానిగా చూసేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి..

First Published:  9 July 2022 5:04 AM IST
Next Story