సిరిసిల్లలో రాహుల్‌తో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ప్లాన్?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోందా? రాహుల్ గాంధీని మళ్లీ రాష్ట్రానికి తీసుకొచ్చి బల నిరూపణ చేయాలని భావిస్తోందా? ఏకంగా కేటీఆర్ ఇలాకా సిరిసిల్లలోనే ఈ మీటింగ్‌కు వ్యూహం రచిస్తోందా? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల మోడీ బహిరంగ సభతో రాష్ట్రంలోని బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వచ్చింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు, విజయ సంకల్ప సభ సమయంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్దం […]
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోందా? రాహుల్ గాంధీని మళ్లీ రాష్ట్రానికి తీసుకొచ్చి బల నిరూపణ చేయాలని భావిస్తోందా? ఏకంగా కేటీఆర్ ఇలాకా సిరిసిల్లలోనే ఈ మీటింగ్‌కు వ్యూహం రచిస్తోందా? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల మోడీ బహిరంగ సభతో రాష్ట్రంలోని బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వచ్చింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు, విజయ సంకల్ప సభ సమయంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్దం నడిచింది. సోషల్ మీడియాతో పాటు ఫ్లెక్సీ వార్ జరగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
బీజేపీ-టీఆర్ఎస్ మాటల యుద్ధం కారణంగా కాంగ్రెస్ వెనుకబడిపోయిన ఫీలింగ్ పార్టీ కార్యకర్తల్లో వచ్చింది. ఇప్పటికే బీజేపీ తెలంగాణను నాలుగు క్లస్టర్లుగా చేసి కేంద్ర మంత్రులను బాధ్యులుగా నియమించింది. వారు ప్రతీ నియోజకవర్గంపై దృష్టి పెట్టి పర్యటనలు చేస్తున్నారు. మరో వైపు టీఆర్ఎస్ కూడా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విస్తృత కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ కూడా మరోసారి బహిరంగ సభ నిర్వహించి బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండటంతో.. దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు.
ఇటీవల వరంగల్‌లో రాహుల్ గాంధీ సభ తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. ఆ తర్వాత గాంధీభవన్‌లో రాష్ట్ర నాయకులకు రాహుల్ పలు సూచనలు కూడా చేశారు. అవసరం అయితే మరోసారి రాష్ట్ర పర్యటనకు వస్తానని కూడా మాటిచ్చారు. దీంతో ఈసారి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లకు రాహుల్‌ను రప్పించేందుకు కాంగ్రెస్ రంగం సిద్ధం చేస్తోంది.
టీఆర్ఎస్, బీజేపీలకు దీటుగా తాము కూడా ప్రజల్లోకి వెళ్తున్నామనే నమ్మకాన్ని కలిగించడానికి ఈ సభ ఉపయోగపడుతుందని రేవంత్ అనుకుంటున్నారు. ఈ సభ పూర్తిగా టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసేలా ఉండాలని భావిస్తున్నారు. వరంగల్ సభను మించి సిరిసిల్ల సభ విజయవంతం చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలకు సూచనలు వెళ్లినట్లు తెలుస్తున్నది.
కాగా, సభను ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో.. భారీ వర్షాలు తెరిపినిచ్చిన తర్వాత సభ ఏర్పాటు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. అగస్టు నెలలో ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. త్వరలోనే రాహుల్ గాంధీని సంప్రదించి డేట్ ఫిక్స్ చేస్తారని.. ఈ నెలాఖరుకు బహిరంగ సభ తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కేవలం సిరిసిల్ల సభతోనే ఆగిపోకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా రాబోయే 12 నెలల్లో సాధ్యమైనన్ని సభలు నిర్వహించాలని టీపీసీసీ టార్గెట్‌గా పెట్టుకున్నది.