వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్.. ఆ చిప్ బాబుకి లేదంటూ సెటైర్లు..
వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా సీఎం జగన్ ఎన్నికయ్యారు. పార్టీ ప్లీనరీలో ఈమేరకు తీర్మానం చేసి ఆమోదించారు. అనంతరం సీఎం జగన్ ప్లీనరీలో ప్రసంగించారు. ప్లీనరీకి కార్యకర్తలు జన సునామీలా హాజరయ్యారని అన్నారు జగన్. ఇది ఆత్మీయుల సునామీ అని, 13 ఏళ్లుగా తనపై కార్యకర్తలు అదే అభిమానం చూపిస్తున్నారని చెప్పారు. కార్యకర్తలు, నేతలు, అభిమానులకు నా సెల్యూట్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు జగన్. పార్టీ శ్రేణుల […]
వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా సీఎం జగన్ ఎన్నికయ్యారు. పార్టీ ప్లీనరీలో ఈమేరకు తీర్మానం చేసి ఆమోదించారు. అనంతరం సీఎం జగన్ ప్లీనరీలో ప్రసంగించారు. ప్లీనరీకి కార్యకర్తలు జన సునామీలా హాజరయ్యారని అన్నారు జగన్.
ఇది ఆత్మీయుల సునామీ అని, 13 ఏళ్లుగా తనపై కార్యకర్తలు అదే అభిమానం చూపిస్తున్నారని చెప్పారు. కార్యకర్తలు, నేతలు, అభిమానులకు నా సెల్యూట్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు జగన్.
పార్టీ శ్రేణుల కష్టాల పునాదులపై వైసీపీ నిలబడిందని చెప్పారు. తన ఫోకస్ అంతా ప్రజలకు మంచి చేయడం, వెనుక బడిన వర్గాలకు న్యాయం చేయడమేనని అన్నారు జగన్.
ఆ చిప్ బాబుకి లేదు..
ఈ మధ్య చంద్రబాబు రింగ్ లో చిప్ ఉందని చెప్తున్నారని, చంద్రబాబులా రింగ్ లోనో, మోకాళ్లలోనో, అరికాళ్లలోనో చిప్ ఉంటే సరిపోదని, ప్రజల కష్టాలను అర్థం చేసుకునే చిప్ చంద్రబాబుకు లేనే లేదని ఎద్దేవా చేశారు జగన్. ప్రజల పట్ల మమకారం, ప్రేమ అన్నది ఏమాత్రం ఆయనకు లేదన్నారు. పేదలు సంతోషంగా ఉండకూడదనేదే చంద్రబాబు, దుష్టచతుష్టయం విధానం అని మండిపడ్డారు.
తన పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తారు. పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియమే చదవాలంటారు. నారాయణ, చైతన్యలను మాత్రమే ప్రోత్సహించారు, ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేశారంటూ విమర్శించారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ స్కూళ్లను, కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లడానికి శ్రమిస్తున్నామని చెప్పారు. కేవలం విద్యారంగం కోసమే 9 పథకాలు తీసుకొచ్చామని గుర్తు చేశారు జగన్.
పెత్తందార్ల ద్వారా.. పెత్తందార్లకోసం..
14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి.. తన సొంత నియోజకవర్గ కేంద్రం కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని తనకు అర్జీ పెట్టుకున్నారని చెప్పారు జగన్. కుప్పంను రెవెన్యూ డివిజన్ చేసింది మీ జగన్ ప్రభుత్వమేనన్నారు.
కుప్పం ప్రజలకు మంచి జరగాలనే అలా చేశామని, మరింత పాదర్శక పాలన కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని వివరించారు. పెత్తందార్ల ద్వారా పెత్తందార్ల కోసం నడుస్తున్న పార్టీ టీడీపీ అని, చంద్రబాబు పార్టీ సిద్ధాంతమే వెన్నుపోటు అని దుయ్యబట్టారు జగన్.
దేవుడి స్క్రిప్ట్ ఇది..
అప్పట్లో కాంగ్రెస్, టీడీపీ కలసి తనపై కేసులు పెట్టాయని, ఓదార్పు యాత్ర మానుకోవాలంటూ ఒత్తిడి చేశాయని, శక్తిమంతమైన వ్యవస్థలతో దాడి చేయించారని అన్నారు జగన్. ఆనాడు మనకు అన్యాయం చేసిన పార్టీల పరిస్థితి ఇప్పుడు ఏమైందో చూడండని చెప్పారు.
తనను అన్యాయంగా అరెస్ట్ చేయించిన కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయిందని, 2014లో 23మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు సంతలో పశువుల్లా కొన్నారని, 2019లో బాబుకి 23 సీట్లు మాత్రమే వచ్చాయని.. దేవుడి స్క్రిప్ట్ అలాగే ఉంటుందని చెప్పారు. మూడేళ్లుగా మంచి పాలన అందించడంపైనే దృష్టిపెట్టామని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలను లాక్కోవడంపై దృష్టి పెట్టలేదని చెప్పారు. నాయకుడిని, పార్టీని నడిపించేవి.. క్యారెక్టర్, క్రెడిబులిటీ మాత్రమేనని చెప్పారు జగన్.