తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయి.. జాగ్రత్తగా ఉండండి: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురియనుండటంతో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు శనివారం పలు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగాన్ని తక్షణమే అలర్ట్ చేయాలని, అవసరమైన రక్షణ చర్యలను ముందస్తుగా చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని […]
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురియనుండటంతో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు శనివారం పలు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగాన్ని తక్షణమే అలర్ట్ చేయాలని, అవసరమైన రక్షణ చర్యలను ముందస్తుగా చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్‌కు సూచించారు.
ఇప్పటికే ఎగువన ఉన్న మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. ఆ రాష్ట్రంతో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున.. రెడ్ అలర్ట్ జారీ చేశారు. అందుకే అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం అన్నారు. వరద ముంపు ప్రాంతాల్లోని అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, సహాయక బృందాలు సిద్దంగా ఉండాలని.. అవసరమైన సమయంలో తాను సమీక్ష చేస్తానని కేసీఆర్ చెప్పారు. వర్షాలు పెరిగి వరదలు వస్తే, పరిస్థితులను బట్టి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని సీఎస్‌కు స్పష్టం చేశారు.
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కేసీఆర్ సూచించారు. భారీ వరదల్లో బయటకు వచ్చి ప్రాణాలను రిస్క్‌లో పెట్టవద్దని అన్నారు. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు తమ పరిధిలోని ప్రజల రక్షణను బాధ్యతగా తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యల్లో పాల్గొని, ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలన్నారు.
గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాబట్టి నీటి పారుదల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాజెక్టుల వద్ద నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి.. ఇతర అధికారులకు సమాచారం చేరవేయాలని ఇరిగేషన్ అధికారులను కేసీఆర్ ఆదేశించారు.
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఈ నెల 15 నుంచి తలపెట్టిన రెవెన్యూ సదస్సులను వాయిదా వేశారు. ఈ నెల 11న ప్రగతి భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో నిర్వహించాల్సిన అవగాహనా సమావేశంతో పాటు.. రెవెన్యూ సదస్సులను మరో తేదీకి వాయిదా వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. భారీ వర్షాలు, వరదలు తగ్గిన తర్వాత అందరికీ అనుకూలమైన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్‌ను సీఎం ఆదేశించారు.