Telugu Global
NEWS

రాజ్యసభకు పరుగులరాణి ! ఆలస్యంగానైనా పీటీ ఉషకు దక్కిన గౌరవం

అలనాటి భారత పరుగుల రాణి, పయ్యోలీఎక్స్ ప్రెస్ పీటీ ఉషకు అరుదైన గౌరవం దక్కింది. క్రీడారంగానికి దశాబ్దాలతరబడి ఉష చేసిన సేవలకు గుర్తింపుగా రాజ్యసభ సభ్యత్వం లభించింది. 58 సంవత్సరాల పీటీఉషను రాజ్యసభకు నామినేట్ చేస్తూ కేంద్రప్రభుత్వం అభినందనలు అందచేసింది….. పీటీ ఉష…ఈ పేరు వినగానే 1980 దశకం నాటి క్రీడాభిమానులు ఒక్కసారిగా పులకించిపోతారు. 1970-1980 దశాబ్దకాలంలో భారత, ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ ను తన అసాధారణ పరుగుతో ఉర్రూతలూగించిన పరుగుల రాణి కమ్ పయ్యోలీ […]

PT USHA
X

అలనాటి భారత పరుగుల రాణి, పయ్యోలీఎక్స్ ప్రెస్ పీటీ ఉషకు అరుదైన గౌరవం దక్కింది. క్రీడారంగానికి దశాబ్దాలతరబడి ఉష చేసిన సేవలకు గుర్తింపుగా రాజ్యసభ సభ్యత్వం లభించింది. 58 సంవత్సరాల పీటీఉషను రాజ్యసభకు నామినేట్ చేస్తూ కేంద్రప్రభుత్వం అభినందనలు అందచేసింది…..

పీటీ ఉష…ఈ పేరు వినగానే 1980 దశకం నాటి క్రీడాభిమానులు ఒక్కసారిగా పులకించిపోతారు. 1970-1980 దశాబ్దకాలంలో భారత, ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ ను తన అసాధారణ పరుగుతో ఉర్రూతలూగించిన పరుగుల రాణి కమ్ పయ్యోలీ ఎక్స్ ప్రేస్ ఉరఫ్ పయ్యోలి తెవరపరంపిల్‌ ఉష సాధించిన ఘనత, విజయాలు, రికార్డులు అన్నీఇన్నీకావు.

పరుగుకు మరోపేరు!

కేరళలోని ఓ మారుమూల గ్రామం పయ్యోలీ నుంచి భారత క్రీడారంగంలోకి దూసుకొచ్చిన ఉష కేవలం పరుగు కోసమే పుట్టిన క్రీడాకారిణి. ప్రముఖ శిక్షకుడు నంబియార్ శిక్షణలో రాటుదేలిన పీటీ ఉష 100, 200 మీటర్ల పరుగు, రిలే అంశాలతో పాటు 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో ప్రపంచ మేటి రన్నర్ గా, ఆసియా అత్యుత్తమ అథ్లెట్ గా గుర్తింపు తెచ్చుకొంది.

అంతర్జాతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ పురుషుల విభాగంలో భారత్ వెలవెలబోతున్న తరుణంలో మహిళల విభాగంలో పీటీ ఉష బంగారు పతకాల పంట పండించడం ద్వారా
దేశగౌరవాన్ని కాపాడుతూ వచ్చింది. కేవలం పీటీ ఉష అసాధారణ విజయాల ద్వారానే భారత్ తన ఉనికిని చాటుకొంటూ వచ్చింది.

ఆసియాక్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు, ప్రపంచ అథ్లెటిక్స్ ….పోటీలు ఏవైనా భారత పతకాల భారమంతా పీటీ ఉష పైనే ఉంటూ వచ్చేది.

గోల్డెన్ స్ప్రింటర్ ….

1976 నుంచి 1984 వరకు దశాబ్దకాలం పాటు పీటీ ఉష తన జైత్రయాత్రను కొనసాగించింది. రికార్డుల హోరు, పతకాల జోరుతో బంగారు కొండలా నిలిచింది.

25 సంవత్సరాల తన క్రీడాజీవితంలో ఏకంగా 102 జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించడం చూస్తే భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ కు పీటీ ఉష చేసిన సేవలు ఎంతటి అమూల్యమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

1984 లో లాస్‌ ఏంజెలిస్‌ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌ మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌ రేసులో ఉష త్రుటిలో కాంస్య పతకం చేజార్చుకొని నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నాటినుంచి నేటి వరకూ ఒలింపిక్స్ మహిళల పరుగులో ఓ భారత మహిళ సాధించిన అతిపెద్ద, గొప్ప విజయం పీటీ ఉష సాధించినదే కావడం విశేషం.

1985 నుంచి 1989 వరకు కువైట్, జకార్తా, సియోల్, సింగపూర్, న్యూఢిల్లీల్లో జరిగిన ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో ఉష వ్యక్తిగతంగా 16 బంగారు పతకాలు సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఓవరాల్ గా 18 స్వర్ణాలు సాధించడం మరో అరుదైన రికార్డుగా మిగిలిపోయింది.

అర్జున నుంచి పద్మశ్రీ వరకూ….

భారత క్రీడారంగానికి సంవత్సరాల తరబడి ఉష చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1984లో ‘అర్జున అవార్డు’తో పాటు ‘పద్మశ్రీ’పురస్కారాన్ని అందచేయటం ద్వారా సత్కరించింది.

ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఉష సాధించిన అరుదైన విజయాలు, క్రీడారంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య సైతం..అత్యంత అరుదైన వెటరన్ పిన్ అవార్డును ఇచ్చి గౌరవించింది.
దోహాలో జరిగిన 2019 ఐఏఏఎఫ్ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా..చైనా,జపాన్ వెటరన్ అథ్లెట్లతో పాటు పీటీ ఉషకు సైతం…అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య
అధ్యక్షుడు సెబాస్టియన్ కో పురస్కారాన్ని అందచేశారు.
రిటైర్మెంట్ తరువాత కేరళలోనే ఓ అకాడమీని ఏర్పాటు చేసిన ఉష..ప్రతిభావంతులైన గ్రామీణ క్రీడాకారులను గుర్తించి అత్యాధునిక శిక్షణతో వారిని అంతర్జాతీయ అథ్లెట్లుగా తీర్చిదిద్దుతోంది.

58 ఏళ్ల వయసులో పెద్దల సభకు…..

పీటీ ఉషను రాష్ట్రపతి కోటాకింద రాజ్యసభకు నామినేట్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పీటీ ఉష 2022 జులై 7 నుంచి 2028 జులై 6 వరకూ స్వతంత్ర సభ్యురాలిగా రాజ్యసభ విధులను నిర్వర్తించనున్నారు. రాజ్యసభసభ్యురాలిగా నెలకు 3 లక్షల 33వేల రూపాయల వేతనం, ఇతర భత్యాలను అందుకోనున్నారు.

పీటీ ఉషకు ముందే క్రీడల కోటాల రాజ్యసభ సభ్యులుగా సేవలు అందించిన వారిలో దారాసింగ్ ( 2003-2009 ), సచిన్ టెండుల్కర్ ( 2012 నుంచి 2018), మేరీ కోమ్ ( 2016 – 2022 ), నవజోత్ సింగ్ సిద్ధూ ( 2016- 2022 ) ఉన్నారు.

పీటీ ఉషకు ఎప్పుడో దక్కాల్సిన ఈ గౌరవం ఆలస్యంగానైనా అందటం దేశంలోని కోట్లాదిమంది మహిళామతల్లులకు లభించిన గౌరవంగా, పురస్కారంగా, గుర్తింపుగా మిగిలిపోతుంది.

పయ్యోలీ ఎక్స్ ప్రెస్ గా పేరుపొందిన పీటీ ఉష 1983లో అర్జున, 1985లో పద్మశ్రీ పురస్కారాలు అందుకోడం ద్వారా భారత మహిళా అథ్లెట్ల ఖ్యాతిని పెంచారు.

First Published:  8 July 2022 10:02 AM IST
Next Story