జగన్ నవరత్నాలు – పవన్ నవ సందేహాలు
వైసీపీ ప్లీనరీ వేళ.. పవన్ కల్యాణ్ ట్వీట్ వార్ మొదలు పెట్టారు. వైసీపీ నవరత్నాలకు కౌంటర్ గా ఆయన నవ సందేహాలు లేవనెత్తారు. ఆయా పథకాల అమలులో లోటుపాట్లున్నాయని తన సందేహాలకు సమాధానాలివ్వాలంటూ ఓ పోస్టింగ్ పెట్టారు. నవరత్నాలలోని ఒక్కో పథకానికి ఒక్కో ప్రశ్న సంధించారు పవన్ కల్యాణ్. ఇంతకీ పవన్ కి వచ్చిన సందేహాలేంటి..? రైతు భరోసా 64 లక్షల మందికి మేలు అని చెప్పి.. 50 లక్షల మందికే భరోసా ఇవ్వడం నిజం కాదా? […]
వైసీపీ ప్లీనరీ వేళ.. పవన్ కల్యాణ్ ట్వీట్ వార్ మొదలు పెట్టారు. వైసీపీ నవరత్నాలకు కౌంటర్ గా ఆయన నవ సందేహాలు లేవనెత్తారు. ఆయా పథకాల అమలులో లోటుపాట్లున్నాయని తన సందేహాలకు సమాధానాలివ్వాలంటూ ఓ పోస్టింగ్ పెట్టారు. నవరత్నాలలోని ఒక్కో పథకానికి ఒక్కో ప్రశ్న సంధించారు పవన్ కల్యాణ్.
ఇంతకీ పవన్ కి వచ్చిన సందేహాలేంటి..?
రైతు భరోసా
64 లక్షల మందికి మేలు అని చెప్పి.. 50 లక్షల మందికే భరోసా ఇవ్వడం నిజం కాదా? మూడేళ్లలో 3 వేలమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకొంటే కేవలం 700మందికే ఆర్థిక సాయాన్ని పరిమితం చేయలేదా? అంటూ రైతు భరోసా కార్యక్రమంపై తనకున్న సందేహాలను వెలిబుచ్చారు పవన్. రైతు భరోసా అందరికీ అందడంలేదని, ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పట్టించుకోవడంలేదని విమర్శించారు పవన్.
అమ్మఒడి
అమ్మఒడి 43 లక్షల మందికి మాత్రమే ఇచ్చి.. 83 లక్షల మందికి ఇచ్చామని ఎందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు పవన్ కల్యాణ్.
సామాజిక పింఛన్లు..
పింఛన్ల జాబితా కుదించి 5 లక్షల మందిని తొలగించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు పవన్. అదే సమయంలో పింఛన్ సొమ్ము 3వేల రూపాయలు ఇవ్వాల్సింది.. పెంచుకుంటూ పోతానంటూ కొత్త అర్థం చెప్పారని మండిపడ్డారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం
మద్యం ఆదాయం 2018-19లో రూ.14 వేల కోట్లు. 2021-22లో రూ.22 వేల కోట్లు.. ఇదేనా మద్యనిషేధం? ఈ ఆదాయం చూపించే రూ.8 వేల కోట్లు బాండ్లు అమ్మలేదా అని ప్రశ్నిస్తున్నారు పవన్. మిగతా రత్నాలు కనీసం అమలులోకి వచ్చినా.. మద్యపాన నిషేధం అనేది కేవలం హామీగానే మిగిలిపోయిందని అన్నారు పవన్.
జలయజ్ఞం
పోలవరం ప్రాజెక్టును ‘యుద్ధ ప్రాతిపదిక’న ఎప్పుడు పూర్తి చేస్తారో చెబుతారా? అని నిలదీశారు పవన్ కల్యాణ్. రివర్స్ టెండరింగ్ తో పాలన రివర్స్ లో సాగుతోందని ఎద్దేవా చేశారు.
ఆరోగ్యశ్రీ
ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆసుపత్రులు ఎందుకు పక్కకు తప్పుకొంటున్నాయని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. సీఎంఆర్‌ఎఫ్ నుంచి వైద్యం ఖర్చులు ఎందుకు చెల్లించడం లేదని నిలదీశారు.
ఫీజు రీయింబర్స్ మెంట్
పీజీ విద్యార్థులకు ఫీజు చెల్లింపులు ఎందుకు నిలిపివేశారో చెప్పాలన్నారు పవన్. రీయింబర్స్ మెంట్ చేయకపోవడం వల్లే విద్యార్థులకు హాల్ టికెట్లు ఆపేస్తున్నారని, అది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
పేదలందరికీ ఇళ్లు
జగనన్న కాలనీల పేరుతో చెరువుల్లో, గుట్టల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారని, ఇంటి నిర్మాణానికి కేంద్ర పథకాల నిధులు మల్లిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ ఎందుకు నిధులు మంజూరు చేయలేదని ప్రశ్నించారు.
ఆసరా
పొదుపు సంఘాల సంఖ్యను ఏటేటా లక్షల కొద్దీ తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. 2వేల కోట్ల రూపాయల అభయ హస్తం నిధులు ఎటుపోయాయని ప్రశ్నించారు. ఇలా ప్రతి ఒక్క పథకాన్ని సునిశితంగా విమర్శిస్తూ ప్రశ్నలు లేవనెత్తారు జనసేనాని. మరి దీనిపై వైసీపీ నుంచి కౌంటర్ వస్తుందో లేదో చూడాలి. ప్లీనరీలో ఉన్న వైసీపీ నేతలు పవన్ ని, ఆయన ట్వీట్లను పట్టించుకుంటారా, లేదా రెండు రోజుల తర్వాత విమర్శలతో విరుచుకుపడతారా.. చూడాలి.