కేసీఆర్ పాచికల ముందు విపక్షాలు దిగదుడుపే!
‘యుద్ధ క్రీడల్లో మీ పన్నాగాన్ని ఇతరులు అర్ధం చేసుకోలేకపోవడం చాలా ముఖ్యం.ప్రత్యర్థులపై రహస్యంగా దాడి చేయాలి. మీ కదలికలు ఊహించలేని విధంగా ఉండాలి.అప్పుడు అవతలివారు మిమ్మల్ని ఎదుర్కోలేరు.అలాంటి ప్రయత్నాలను సిద్ధం చేసుకోవడం వారికి అసాధ్యమవుతుంది’ అని క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో చైనాకు చెందిన తత్వవేత్త హూఐనన్ అన్నాడు. టిఆర్ఎస్ నిర్మాత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మిక నిర్ణయాలు, అనూహ్య ఎత్తుగడలు ఇలాగే ఉంటాయి.మెరుపు వేగంతో ఆయన తీసుకునే నిర్ణయాలకు గడచిన ఎనిమిదేండ్లుగా ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ అవుతూనే […]
‘యుద్ధ క్రీడల్లో మీ పన్నాగాన్ని ఇతరులు అర్ధం చేసుకోలేకపోవడం చాలా ముఖ్యం.ప్రత్యర్థులపై రహస్యంగా దాడి చేయాలి. మీ కదలికలు ఊహించలేని విధంగా ఉండాలి.అప్పుడు అవతలివారు మిమ్మల్ని ఎదుర్కోలేరు.అలాంటి ప్రయత్నాలను సిద్ధం చేసుకోవడం వారికి అసాధ్యమవుతుంది’ అని క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో చైనాకు చెందిన తత్వవేత్త హూఐనన్ అన్నాడు.
టిఆర్ఎస్ నిర్మాత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మిక నిర్ణయాలు, అనూహ్య ఎత్తుగడలు ఇలాగే ఉంటాయి.మెరుపు వేగంతో ఆయన తీసుకునే నిర్ణయాలకు గడచిన ఎనిమిదేండ్లుగా ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ అవుతూనే ఉంది. 2018 లో అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగా వెళ్లినా,2023 లో కూడా ‘ముందస్తు’కు వెళ్లినా,లేదా షెడ్యూలు ప్రకారమే ఎన్నికలకు వెళ్లినా కేసీఆర్ వ్యూహాన్ని పసిగట్టగలిగిన మహా మహా రాజకీయ పండితులు ఎవరూ లేరు.
‘యుద్ధాల్లో’ వేగం అత్యంత ముఖ్యమైంది. 2018 లో ‘ముందస్తు’గా వెళ్లిన తీరు,కొంగర కలాన్ సభ, కేబినెట్ రద్దు, అభ్యర్థుల ప్రకటన ఎంత వేగంగా జరిగిపోయాయో తెలంగాణ ప్రజలకు అనుభవంలో ఉన్నది.కేసీఆర్ అనూహ్యమైన నిర్ణయాలకు పేరు మోసిన ఘటికుడు. రాష్ట్ర ప్రజలంతా దుబ్బాక ఉపఎన్నికపై దృష్టిని కేంద్రీకరించినప్పుడు కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల రోడ్ మ్యాపును సిద్ధం చేశారని,అక్కడే రణ నీతిని రూపొందించారని చాలామందికి తెలియదు. కేసీఆర్ ‘ముందస్తు’ కార్యాచరణ ప్రణాళిక ఎవరికీ అంతుచిక్కదు.
ఆయన 24 గంటలూ రాజకీయాలే ఆలోచిస్తారు.రాజకీయమే ఆయన ఉఛ్వాస నిశ్వాసలు. మిగతా పార్టీలు, నాయకులలో ఈ సంసిద్ధత లేదని పలు సందర్భాలలో రుజువైంది. ముందస్తు ప్రణాళికలు ఉండవు. భవిష్యత్ పరిణామాలపై అంచనాలు శూన్యం. భవిష్యత్తుపై ఆశావహ దృక్పథంతో ప్రతిపక్షాలు లేవు. ప్రతికూల పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవడం ముఖ్యమంత్రి కేసీఆర్,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు మాత్రమే చెల్లింది.
బిజెపి ప్రజల్ని భావోద్రేకాలతో,మతపరమైన విభజనతో వెడుతోంది.కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో శిథిలావస్థ నుంచి తేరుకుంటోంది.ఆ పార్టీ నాయకులు ఎన్నికలు ప్రకటించినప్పుడే కళ్ళు నులుముకుని బయటకు వస్తారని చరిత్ర రుజువుచేస్తోంది.
నిరంతరం రాజకీయాల్లో ఉండేవాళ్ళు, అందులోనూ ‘పొటెన్షియల్’ వ్యక్తులెవరో కేసీఆర్ కు తెలుసు. అందువల్ల ఆయన 2015 నుంచే మిగతా పార్టీలను నిర్వీర్యం చేసే పనిలో చాలా వరకు సక్సెస్ అయ్యారు.టీడీపీ తెలంగాణలో తుడిచిపెట్టుకొని పోవడం టిఆర్ఎస్ కు ఒక అనుకూల అంశం.
అధికార,ధన వ్యామోహమే ఆయా పార్టీల నుంచి ఫిరాయింపులకు కారణం. ”త్యాగాలు తప్ప భోగాలకోసం వెంపర్లాడని దొడ్డికొమరయ్యలం” అని ఒక కవి అన్నాడు.కానీ ఆచరణలో జరుగుతున్నది వేరు.త్యాగాల సంగతి చాలా దూరం. భోగాల కోసం వెంపర్లాడని రాజకీయ నాయకులు అత్యంత అరుదు. కాంగ్రెస్, బీజేపీలు దాదాపు ఏడాది కాలంగా పోరాట పటిమను ప్రదర్శిస్తున్నవి.
ఎన్నికలు ఏవైనా ఓడిపోవడం కాంగ్రెస్ కు అలవాటుగా మారినట్టు 2014 నుంచి జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నవి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం కొన్ని జిల్లాలకు, కొన్ని నియోజకవర్గాలకే పరిమితమవడం ఒక వాస్తవం.ఖమ్మం,నల్లగొండ,మెదక్ వంటి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం కనిపిస్తోంది.ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పటిష్టమవడానికి బాగా కసరత్తు చేస్తున్నారు.
గులాబీపార్టీకి తామే ప్రత్యామ్నయమని కాంగ్రెస్,బిజెపిలతో పాటు షర్మిల,బహుజన పార్టీ ప్రవీణ్ కుమార్ కూడా వాదిస్తున్నారు.ఆ వాదనల్లో అంతగా పస లేదు.కాంగ్రెస్ మాదిరిగానే బీజేపీలోనూ కేసీఆర్ ‘రహస్య మిత్రులు’ ఉన్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నవి. తెలంగాణలో అత్యంత బలంగా ఉన్న అధికార టీఆర్ఎస్‌ను ఢీకొట్టాలంటే కేంద్రంలో తనకున్న విశిష్ఠ అధికారాలనుపయోగించడం ద్వారానే ఏమైనా సాధ్యం కావచ్చునని బీజేపీ ఆశ. కానీ ఇది వర్కవుట్ కాదేమో! ఆ పార్టీకి కాంగ్రెస్ వలె పోలింగు బూత్ స్థాయి నిర్మాణం లేదు.సమర్ధ అభ్యర్థుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.కేసీఆర్ ఏకంగా ఢిల్లీతోనే తలపడే ప్రయత్నాలలో తలమునకలై ఉన్నారు.
‘‘తెలంగాణ మే అగ్లీ బార్ హమారీ సర్కార్ హోగీ. (తెలంగాణలో వచ్చే ప్రభుత్వం బీజేపీదే)’’ అని ప్రధాని మోదీ 2019 లో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న సంకేతాలు ఇచ్చారని బిజెపి ఎంపీలు గర్వంగా చెప్పుకున్నారు.దుబ్బాక, హుజురాబాద్ ఫలితాలు వెలువడిన వెంటనే ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా ట్విట్టర్ ద్వారా అమితానందం వ్యక్తం చేశారు.
ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గసమావేశాలు,బహిరంగసభల్లో తెలంగాణను ఎట్లా ‘కబళించాలన్న’అంశంపై బీజేపీ అగ్రనాయకులు భారీ ప్రణాళికలు రచించారు. కాగా తెలంగాణ ప్రజల అవసరాలు,రాజకీయ పార్టీల,నాయకుల మానసిక పరిస్థితిని కేసీఆర్ 2001కి ముందే కాచి వడబోశారు.ఎవరిని ‘లొంగదీసుకోవచ్చునో’, ఎవరికి ఎలాంటి ‘ఎర’ వేయవచ్చునో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు.
పశ్చిమ బెంగాల్ లో నాలుగు దశాబ్దాల క్రితమే కాంగ్రెస్ అధికారానికి దూరమైంది. కానీ అక్కడ కాంగ్రెస్ మనుగడలో ఉన్నది. బీహార్ తదితర రాష్ట్రాలలోనూ ఆ పార్టీ ఉనికిలోనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితిలో ఉన్నది.ఇక తెలంగాణలో కాంగ్రెస్ కు ఓటువేసినా అది వృధా కావచ్చునని,గెలిచాక ఎలాగూ టిఆర్ఎస్ లో చేరిపోతారని ప్రజల్లో ఒక అనుమానం స్థిరపడిపోయింది.
అలాగే ”కాంగ్రెస్,టిఆర్ఎస్ ఒకే గూటిలో ఉన్నాయి.వాటి మధ్య అవగాహన ఉన్నది.కనుక కాంగ్రెస్ కు ఓటు వేసినా అది టిఆర్ఎస్ కు వెళుతుంద”ని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కొంతకాలంగా ప్రచారం సాగిస్తున్నారు.”టిఆర్ఎస్,బీజేపీ కుమ్మక్కయినట్టు” మరోవైపు కాంగ్రెస్ ప్రచారం సాగిస్తోంది.
బీజేపీ ప్రయోగించదలచుకున్న’హిందుత్వ’ కార్డు హైదరాబాద్ నగరంలో పనిచేయకపోవచ్చ్చు. ఆ కారణంగానే మజ్లీస్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ దూకుడుగా వెడుతున్నది.
మూడు,నాలుగు దశాబ్దాల క్రితం పాతబస్తీలో ఉన్న వాతావరణం వేరు. ప్రజల ఆలోచనా ధారలో చాలా మార్పు కనబడుతున్నది.వేగంగా మారుతున్న సామాజిక, ఆర్ధిక కారణాలు ప్రజల్ని ‘మతోన్మాదం’ నుంచి బయటకు నెట్టివేశాయి.అయితే కేసీఆర్ ను మించిన ‘మహా హిందూ’ ఎవరుంటారు ?యజ్ఞాలు, యాగాలు, యాదాద్రి చారిత్రక ఆలయ నిర్మాణం… ఇవన్నీ కేసీఆర్ ను హిందూ ప్రజలు అభిమానించేలా చేస్తున్నవి.
అటు ముస్లిం మైనారిటీలలోనూ ఆయనకు వ్యతిరేకత లేకుండా చక్కబెట్టుకుంటూ వస్తున్నారు. అందువల్లనే హిందూ ఓట్లను సంఘటితం చేసే పనిలో బిజేపీ నాయకత్వం బిజీగా ఉన్నది. ”ఆధునిక యుగంలో సంపూర్ణ విజయమే లక్ష్యం అనేది మూల సూత్రం. ఒకసారి గొప్ప విజయాన్ని సాధించాక,ఇక విశ్రాంతి గురించి మాట్లాడకూడదు. వెసులుబాటు కావాలని అనుకోకూడదు.”అని రాజకీయ శాస్త్రవేత్త నికోలో మాకియవెలి (1469 -1527) అన్నాడు. ”సంపూర్ణ విజయాన్ని సాధించాలంటే మీరు నిర్దయగా ఉండాల్సిందే” అని నెపోలియన్ (1769 -1821) చెప్పాడు. నికోలో మాకియవెలి చెప్పినట్లుగానే 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ విశ్రాంతి తీసుకోలేదు.
ప్రత్యర్థులను నిర్వీర్యం చేయడంలో, సొంత పార్టీని బలోపేతం చేయడంలో, అధికారాన్ని తిరిగి రాబట్టుకోవడానికి ప్రతిక్షణం వ్యూహాలు పన్నడంలో,ఓటుబ్యాంకులను స్థిరపరచుకోవడంలో, కుమారుడు కేటీఆర్ ను ‘వారసుని’గా శిక్షణ ఇస్తూ, తీర్చిదిద్దడంలో ఆయన తల మునకలై ఉన్నారు.ఇప్పటికే పార్టీ ‘కో పైలట్’గా, మంత్రిగా కేటీఆర్ తన సమర్ధతను చాటుకున్నారు.ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇతరత్రా కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నందున కేటీఆర్ పార్టీ సంస్థాగత కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.
”నాన్నా పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది” ఇది రజనీకాంత్ సినిమాలోని హిట్ డైలాగ్. గులాబీ బాస్ కేసీఆర్ 2018 లో ప్రజాకూటమి తరపున బరిలోకి దిగిన హేమాహేమీల ప్రచారాన్ని చిత్తు చేశారు.ప్రజాకూటమిలో చంద్రబాబు సహా ఎంతమంది స్టార్లు కనిపించినా కేసీఆర్ ‘పొలిటికల్ హీరోయిజం’ ముందు దిగదుడుపయ్యారు.2023 అసెంబ్లీ,2024 లోక్ సభకు జరిగే ఎన్నికల్లో రానున్న ఫలితాలతో రాష్ట్ర రాజకీయాలే కాదు, దేశ రాజకీయాలలో పెనుమార్పులు సంభవించవచ్చు.తెలంగాణ రాష్ట్ర సాధనలో చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించానని కేసీఆర్ ఎట్లా అయితే చెప్పారో, అలానే ముందస్తు ఎన్నికలకు వెళ్లి ‘వార్ వన్ సైడు’ చేసిపారేశారు.
2023 లోనూ బహుశా కేసీఆర్ వ్యూహాలను భగ్నం చేయగలిగిన పరిస్థితిలో విపక్షాలు లేవని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.