సహకార డెయిరీల మూత..? కేంద్రానిదే ఆ పాపం..
సహకార రంగంలో ఉన్న పాల డెయిరీలపై కేంద్రం జీఎస్టీ పిడుగు వేసింది. ఆ భారం మోయలేక.. సహకార డెయిరీలు మూతపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల వల్ల పాలు, పాల పదార్థాలపై జీఎస్టీ పెరిగింది. దీనివల్ల పాల ఉత్పత్తిదారులకు వచ్చిన ప్రయోజనం ఏమీ ఉండదు, వినియోగదారులపై భారం పెరుగుతుంది, ఆ లాభం కేంద్రం జేబులోకి పోతుంది. చివరిగా ఖర్చులు పెరిగి, రేట్లు పెంచుకోలేని పరిస్థితుల్లో సహకార పాల డెయిరీలు మూతపడాల్సిన పరిస్థితి. […]
సహకార రంగంలో ఉన్న పాల డెయిరీలపై కేంద్రం జీఎస్టీ పిడుగు వేసింది. ఆ భారం మోయలేక.. సహకార డెయిరీలు మూతపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల వల్ల పాలు, పాల పదార్థాలపై జీఎస్టీ పెరిగింది.
దీనివల్ల పాల ఉత్పత్తిదారులకు వచ్చిన ప్రయోజనం ఏమీ ఉండదు, వినియోగదారులపై భారం పెరుగుతుంది, ఆ లాభం కేంద్రం జేబులోకి పోతుంది. చివరిగా ఖర్చులు పెరిగి, రేట్లు పెంచుకోలేని పరిస్థితుల్లో సహకార పాల డెయిరీలు మూతపడాల్సిన పరిస్థితి.
ఇప్పటికేనా కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సహకార రంగంలోని పాలడెయిరీలపై కనికరం చూపాలని డిమాండ్ చేస్తున్నారు నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం లిమిటెడ్(నార్మాక్స్) చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి. సహకార డెయిరీలను, పరిశ్రమలను నిర్వీర్యం చేయడానికే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారాయన.
పెరుగు, లస్సీ, మజ్జిగ వంటి ప్రీ ప్యాక్డ్ లేదా ప్రీ లేబుల్డ్ (ఎలాంటి బ్రాండ్లు లేని) పాల ఉత్పత్తులపై ఇప్పటివరకు జీఎస్టీ లేదు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం ప్రకారం ఇకపై 5 శాతం పన్ను వసూలు చేస్తారు.
డెయిరీ మిల్కింగ్ మిషనరీపై ఇప్పటి వరకూ జీఎస్టీ 12శాతం ఉండగా దాన్ని 18 శాతానికి పెంచారు. ఈ నిర్ణయంతో సహజంగానే పాల ఉత్పత్తుల రేట్లు పెరుగుతాయి. ఇప్పటికే పశువుల మేత దగ్గరి నుంచి అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి.
జీఎస్టీ పెంపుతో దేశవ్యాప్తంగా పాల వ్యాపారంపై ఆధారపడిన 9 కోట్ల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కేంద్రం జీఎస్టీ విధిస్తే వినియోగదారులు నష్టపోతారు కానీ, వ్యాపారులకు, పాల ఉత్పత్తిదారులకు నష్టమేముంటుందని అనుకోవచ్చు. అక్కడే చిన్న మతలబు ఉంది. పాల ఉత్పత్తి ధర పెరిగితే పాల ధర పెంచుతారు.
కానీ ఇక్కడ ఉత్పత్తి ధర పెరగకపోయినా జీఎస్టీ కారణంగా ధర పెరుగుతోంది. అంటే ఉత్పత్తిదారుడికి ఏమాత్రం లాభం ఉండదు, పైగా ధర పెరగడం వల్ల వినియోగదారుడు ఇబ్బంది పడతాడు. కార్పొరేట్ శక్తులతో పోటీపడలేక, సహకార రంగం మూతపడుతుంది.
మోదీ ప్రభుత్వ నిర్ణయంతో సహకార రంగంలో ఉన్న డెయిరీ పరిశ్రమ పూర్తిగా దెబ్బతినే అవకాశముంది. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు మాత్రమే ఈ వ్యాపారంలో నిలబడతాయి.
అదే జరిగితే పాల ధర వారి చేతుల్లోనే ఉంటుంది. ప్రత్యామ్నాయం లేకపోతే కార్పొరేట్ శక్తులు ఆడిందే ఆట, పాడిందే పాట. అంటే ఒకరకంగా కార్పొరేట్ శక్తుల కొమ్ముకాసేందుకే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే సహకార రంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జీఎస్టీ నుంచి పాలు, పాల ఉత్పత్తులను మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు ఉత్పత్తిదారుల సంఘాల నేతలు.