Telugu Global
National

కాంగ్రెస్‌లో చేరిన జిగ్నేష్ మేవానీ.. ఆ వెంట‌నే..

ఎన్నిక‌లను దృష్టిలో ఉంచుకుని గుజ‌రాత్, క‌ర్ణాట‌క రాష్ట్రాల‌లో కాంగ్రెస్ పార్టీ సామాజిక స‌మీక‌ర‌ణాల‌ను స‌మ‌తూకం చేస్తూ మ‌రింత వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ద‌ళితుల స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తుతున్న గుజ‌రాత్ ఎమ్మెల్యే, ఉద్య‌మ‌కారుడు జిగ్నేష్ మేవానీని అధికారిగా కాంగ్రెస్ లో చేర్చుకుంది. ఆయ‌న పార్టీ తీర్థం పుచ్చుకున్న వెంట‌నే ఆయ‌న‌ను గుజ‌రాత్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ (జీపీసీసీ) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌న‌కు కీల‌క ప‌ద‌వి అప్ప‌గించిన కాంగ్రెస్ పార్టీ అధినాయ‌క‌త్వానికి […]

కాంగ్రెస్‌లో చేరిన జిగ్నేష్ మేవానీ.. ఆ వెంట‌నే..
X

ఎన్నిక‌లను దృష్టిలో ఉంచుకుని గుజ‌రాత్, క‌ర్ణాట‌క రాష్ట్రాల‌లో కాంగ్రెస్ పార్టీ సామాజిక స‌మీక‌ర‌ణాల‌ను స‌మ‌తూకం చేస్తూ మ‌రింత వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ద‌ళితుల స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తుతున్న గుజ‌రాత్ ఎమ్మెల్యే, ఉద్య‌మ‌కారుడు జిగ్నేష్ మేవానీని అధికారిగా కాంగ్రెస్ లో చేర్చుకుంది.

ఆయ‌న పార్టీ తీర్థం పుచ్చుకున్న వెంట‌నే ఆయ‌న‌ను గుజ‌రాత్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ (జీపీసీసీ) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌న‌కు కీల‌క ప‌ద‌వి అప్ప‌గించిన కాంగ్రెస్ పార్టీ అధినాయ‌క‌త్వానికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ మేవానీ శుక్ర‌వారం ఓ ట్వీట్ చేశారు.

మేవానీతో పాటు మ‌రో ఆరుగురిని కూడా వ‌ర్కంగ్ ప్రెసిడెంట్లుగా నియ‌మించిన‌ట్టు కాంగ్రెస్ అధిష్టానం పేర్కొంది. ఎమ్మెల్యేలు లలిత్ కగతర, రుత్విక్ మక్వానా, అంబరీష్ జే దేర్, హిమ్మత్‌సింగ్ పటేల్, కదిర్ పిర్జాదా, ఇంద్రవిజయ్‌సింగ్ గోహిల్ ను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియ‌మించారు.

ద‌ళితుల స‌మ‌స్య‌ల‌పై పోరాటం సాగిస్తున్న మేవానీ.. రాష్ట్రీయ ద‌ళిత్ అధికార్ మంచ్ పేరిట ఓ రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ త‌ర‌ఫునే గుజ‌రాత్‌లోని వ‌డ్గ‌మ్ అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీ చేసిన ఆయ‌న ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఎమ్మెల్యే హోదాలో ఆయ‌న ద‌ళితుల స‌మ‌స్య‌ల‌పై మ‌రింత‌గా పోరు సాగిస్తున్న వైనం తెలిసిందే. ఆయ‌న ముందునుంచీ కాంగ్రెస్ పార్టీకి బ‌హిరంగంగానే మ‌ద్ద‌తుగా నిలిచారు.

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీతో పాటు ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కుల‌తో క‌లిసి మేవానీ ప‌లు కార్య‌క్ర‌మాలు, వేదిక‌ల‌పై పాల్గొన్నారు. ఇప్పుడు ఆయ‌న అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ వెంట‌నే వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా నియ‌మితుల‌య్యారు. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో అనుచిత పోస్టులు చేశారంటూ ఆయ‌న‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిల్‌పై విడుద‌లైన మేవానీ.. ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిపోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ఏడాది చివ‌రిలో గుజ‌రాత్‌ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

క‌ర్ణాట‌క‌లోనూ..
వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న క‌ర్ణాట‌క‌లో కూడా కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి)లో కూడా కొత్త నియామకాలు చేసింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గేను కెపిసిసిలోని కమ్యూనికేషన్స్ అండ్ సోషల్ మీడియా యూనిట్ చైర్‌పర్సన్‌గా నియమించారు. పార్టీ నాయకుడు మన్సూర్ అలీఖాన్‌ను రాష్ట్రంలో కమ్యూనికేషన్స్ కో-చైర్‌పర్సన్‌గా, ఎమ్మెల్సీలు దినేష్ గులిగౌడ్, రమేష్ బాబు వైస్ చైర్‌పర్సన్లుగా నియ‌మించారు. శాసనమండలి సభ్యుడు నాగరాజు యాదవ్‌ను ముఖ్య అధికార ప్రతినిధి కమ్ కన్వీనర్ (కమ్యూనికేషన్స్)గా నియమించారు.

లావణ్య బల్లాల్, కవితారెడ్డి, నాగలక్ష్మి, ఐశ్వర్య మహదేవ్‌లు కెపిసిసిలో కమ్యూనికేషన్స్ అధికార ప్రతినిధి మరియు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. “రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వార్-రూమ్ ఛైర్మన్‌గా శశికాంత్ సెంథిల్ పేరును ఏఐసిసి ఆమోదించింది. తక్షణమే ఈ నియామ‌కాలు అమల్లోకి వస్తాయ‌ని పేర్కొంది. సునీల్ కానుగోలు మొత్తం ఇంచార్జ్‌గా ఉంటారు అని పార్టీ పేర్కొంది.

First Published:  8 July 2022 2:15 PM IST
Next Story