Telugu Global
NEWS

వ్యవసాయాన్ని పండగ చేసిన వైఎస్ఆర్ జయంతి.. నేడు ఏపీ రైతు దినోత్సవం

వర్షాలు రాక.. నీళ్లు లేక.. కరెంట్ ఎప్పుడొస్తుందో తెలియక ఉమ్మడి ఏపీలో రైతు అష్టకష్టాలు పడుతున్న రోజులు. పాలకులు వ్యవసాయం దండగ.. పొలాలమ్మేసి రియల్ ఎస్టేట్ చేసుకోండి.. టెక్నాలజీ నేర్చుకొని విదేశాలకు వెళ్లిపోండి అని ఊదరగొడుతున్న రోజులు. పెట్టిన పెట్టుబడి రాకా.. సమయానికి పంట చేతికందక అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రోజులు. అప్పుడొచ్చాడు ఒకడు. ఆయనే వ్యవసాయం దండగ కాదు పండగ అని రైతులకు భరోసా ఇచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ఆర్.. తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితుడు. ఆయనను […]

YSR
X

వర్షాలు రాక.. నీళ్లు లేక.. కరెంట్ ఎప్పుడొస్తుందో తెలియక ఉమ్మడి ఏపీలో రైతు అష్టకష్టాలు పడుతున్న రోజులు. పాలకులు వ్యవసాయం దండగ.. పొలాలమ్మేసి రియల్ ఎస్టేట్ చేసుకోండి.. టెక్నాలజీ నేర్చుకొని విదేశాలకు వెళ్లిపోండి అని ఊదరగొడుతున్న రోజులు. పెట్టిన పెట్టుబడి రాకా.. సమయానికి పంట చేతికందక అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రోజులు. అప్పుడొచ్చాడు ఒకడు. ఆయనే వ్యవసాయం దండగ కాదు పండగ అని రైతులకు భరోసా ఇచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ఆర్.. తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితుడు. ఆయనను అందరి కంటే ఎక్కువగా గుర్తుంచుకునే వర్గం మాత్రం రైతులనే చెప్పవచ్చు.

ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో బాధ్యతలు చేపట్టిన వేదిక నుంచే ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేసి రైతులకు నేనున్నాను అనే భరోసా కలిగించారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని ఆనాడు చంద్రబాబు వ్యాఖ్యానించినా.. దాన్ని సుసాధ్యం చేసి చూపించారు. 1978-83లో తొలి సారి వైఎస్ఆర్ శాసన సభలోకి అడుగుపెట్టారు. ఆ సభలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య చేసిన ప్రసంగం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని వైఎస్ఆర్ వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రమంతటా పారుతున్న నదీ జలాలను కనీసం ఒక పంటకు అయినా పొలాలకు అందిస్తే.. రైతుల కష్టాలు తీరుతాయి’ అన్న సుందరయ్య మాటలను వైఎస్ఆర్ పాటించారు. ఉచిత విద్యుత్‌తో పాటు జలయజ్ఞం పేరుతో నీటిపారుదల రంగం బలోపేతానికి శ్రీకారం చుట్టారు.

తెలంగాణ సహా రాయలసీమ, మరికొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలతోనే వ్యవసాయం చేసే వాళ్లు. చాలా చోట్ల రైతులు బోరు బావులు తవ్వుకొని మోటార్లు పెట్టుకున్నారు. అయితే విద్యుత్ బిల్లులు తలకు మించిన భారంగా మారాయి. దీంతో వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశారు. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 18.70 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ అమలు చేయడానికి ఆనాడు వైఎస్ఆర్ వేసిన పునాదే కారణం.

రైతులకు వ్యవసాయం చేయడానికి పెట్టుబడి లోన్లు ఇచ్చే కేంద్ర సహకార బ్యాంకులు వైఎస్ఆర్ వచ్చే సమయానికి దివాళా తీసే పరిస్థితి ఉన్నది. ఉమ్మడి ఏపీలోని 22 జిల్లా సహకార బ్యాంకుల్లో 18 బ్యాంకులు పూర్తిగా నష్టాల్లో ఉన్నాయి. అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు కూడా నష్టాల్లో ఉన్నాయి. దీంతో వైద్యానాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేసి రూ. 1,800 కోట్లను సహకార సంఘాలకు అందించి వాటిని కాపాడారు. వైఎస్ఆర్ చలువ వల్లే సహకార వ్యవస్థ తన ఉనికిని కాపాడుకోగలిగింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి రూ. 2లక్షల పరిహారం ఇచ్చేలా జీవో 421ని విడుదల చేశారు.

పావలా వడ్డీకే రుణాలు, 90 శాతం రాయితీతో బిందు సేద్య పరికరాలు అందజేయడం వంటి కార్యక్రమాల వల్ల రైతులకు ఎంతో లబ్ది చేకూరింది. రైతాంగ సమస్యలపై ఎవరైనా ఎప్పుడైనా ఏది చెప్పినా.. ఆ సలహాలను సహృదయంతో స్వీకరించిన నేత. రైతు సమస్యలపై పోరాడేవాళ్లను తన సొంత మనుషుల్లా చూసుకున్న మహానేత వైఎస్ఆర్. ఆయనతో రాజకీయంగా విభేదించిన వాళ్లు కూడా రైతుల పట్ల ఆయన చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు ఫిదా అయిపోయారు. ఆ విషయంలో ఎవరూ ఏనాడూ వ్యతిరేకత చూపించలేదు. అందుకే ఇవాళ్టికీ రైతులు వైఎస్ఆర్‌ను గుర్తు చేసుకుంటారు.

రైతు దినోత్సవం..

వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఆయన లేని లోటు రైతులకు తీవ్రంగా తెలిసొచ్చింది. ఏపీలో వైఎస్ఆర్ కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక మళ్లీ రైతులకు భరోసా ఇచ్చేలా పథకాలు ప్రారంభించారు. ప్రతీ ఏడాది వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి (జూలై 8) రోజు రాష్ట్ర రైతు దినోత్సవంగా ప్రకటించి అనేక కార్యక్రమాలు చేస్తోంది. వైఎస్ జగన్ పార్టీ పరంగా ప్లీనరీ నిర్వహిస్తూనే.. ప్రభుత్వ పరంగా రైతు దినోత్సవ వేడుకలు కూడా ఘనంగా చేస్తున్నారు.

ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయిలోనే కాకుండా రైతు భరోసా కేంద్రాల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు. రైతు సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు, జిల్లా వనరుల కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోదన కేంద్రం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాల వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి, ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ప్రవేశ పెట్టిన వైఎస్ఆర్ రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ యంత్రసేవా పథకం వంటి కార్యక్రమాలపై పూర్తి అవగాహన కల్పించనున్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో రైతులకు ఇప్పటి వరకు రూ. 1,27,633.08 కోట్లు అందించారు. అలాగే రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. రూ. 2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధి, ఆక్వా రైతులకు 5 ఎకరాల విద్యుత్ సబ్సిడీని 10 ఎకరాలు పెంచరు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారు.

First Published:  8 July 2022 4:48 AM IST
Next Story