Telugu Global
International

షింజో అబే తీరుతో విసిగిపోయా.. అందుకే చంపాను : నిందితుడు

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను ఇవాళ ఉదయం ఒక వ్యక్తి గన్‌తో కాల్చి చంపిన విషయం తెలిసిందే. జపాన్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నరా నగరానికి వెళ్లారు. అక్కడ ప్రసంగిస్తున్న సమయంలో వెనుక నుంచి తెత్సూయా యమగమి అనే యువకుడు కాల్పులు జరిపాడు. బుల్లెట్లు అబే శరీరంలోకి దూసుకొని పోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. తీవ్రగాయాల పాలైన అబేను స్థానిక ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఆసుపత్రికి తీసువచ్చేసరికే అబే నాడి కొట్టుకోవడం లేదని.. ఆర్గాన్స్ […]

షింజో అబే తీరుతో విసిగిపోయా.. అందుకే చంపాను : నిందితుడు
X

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను ఇవాళ ఉదయం ఒక వ్యక్తి గన్‌తో కాల్చి చంపిన విషయం తెలిసిందే. జపాన్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నరా నగరానికి వెళ్లారు. అక్కడ ప్రసంగిస్తున్న సమయంలో వెనుక నుంచి తెత్సూయా యమగమి అనే యువకుడు కాల్పులు జరిపాడు. బుల్లెట్లు అబే శరీరంలోకి దూసుకొని పోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. తీవ్రగాయాల పాలైన అబేను స్థానిక ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఆసుపత్రికి తీసువచ్చేసరికే అబే నాడి కొట్టుకోవడం లేదని.. ఆర్గాన్స్ కూడా పని చేయడం మానేశాయని వైద్యులు చెప్పారు. అబే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

ఇక కాల్పులు జరిపిన వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది తెత్సూయా యమగమిని అదుపులోకి తీసుకున్నారు. 41 ఏళ్ల యమగమి గతంలో జపాన్ నేవీ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌లో పనిచేశాడు. కేవలం మూడేళ్ల పాటు పనిచేసిన తర్వాత సైన్యం నుంచి బయట‌కు వచ్చేశాడు. పోలీసులు నిందితుడి ఇంటిపై కూడా రైడ్‌ చేశారు. హెల్మెట్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించిన పోలీసులు నిందితుడి ఇంటిలోకి వెళ్లడాన్ని జపాన్ నేషనల్ చానల్ ఎన్‌హెచ్‌కే కూడా ప్రసారం చేసింది. నిందితుడి ఇంటిలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. అంతే కాకుండా తుపాకీని అతడు సొంతగా తయారు చేసుకున్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసుల విచారణలో యమగమి పలు విషయాలు వెల్లడించినట్లు తెలుస్తుంది. అబే తీరుతో తాను విసిగిపోయానని, ఆ అసంతృప్తితోనే చంపినట్లు వెల్లడించాడు. యమగమి తుపాకీతో కాలుస్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డు అయ్యాయి. నేవీ బ్లూ టీషర్ట్, ట్రౌజర్ ధరించిన అతడు అబే ప్రసంగానికి ముందు నుంచి వెనుక నిలబడి ఉన్నాడు. కొంత సమయం తర్వాత దగ్గరకు వెళ్లి వెనుక నుంచి కాల్పులు జరిపాడు. రెండు రౌండ్లు కాల్చడంతో బుల్లెట్లు ఒకటి మెడలోకి, మరొకటి ఎడమవైపు వీపులోకి దూసుకెళ్లాయి.

ప్రపంచ నేతల దిగ్భ్రాంతి..

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు గురికావడం ప్రపంచ నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది. షింజో అబేపై దుండగుడు కాల్పులు జరపడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ అన్నారు. షింబే విషయం తెలియగానే తీవ్ర విచారణకు గురయ్యాను. అబే నాకు మంచి మిత్రుడు. ఆయన తైవాన్‌కు చాలా సన్నిహితుడు అని, తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్ వెన్ అన్నారు.

అబే మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఇండియా-జపాన్ సంబంధాలపై ఆయన విస్తృత కృషి చేశాడని చెప్పారు. ఈ రోజు ఇండియా మొత్తం అబేను గుర్తు చేసుకొని బాధపడుతోందన్నారు. ఈ కష్ట సమయంలో జపాన్‌కు అండగా ఉంటామని, జపాన్ ప్రజలకు తన సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. షింజో అబే మృతికి జూలై 9న జాతీయ సంతాప దినం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.

First Published:  8 July 2022 11:30 AM IST
Next Story