Telugu Global

అన్ని ఆధారాలు ఉంటే ఆర్టీఐ ఎందుకన్నా?

తెలంగాణ రాష్ట్రాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ తన లక్ష్యాన్ని సాధిస్తుందా ? టీఆరెస్ వ్యతిరేక ప్రచారాలు, ధర్నాలు, రాస్తారోకోలు, పార్టీలో చేరికలు, జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభలు, మతాలను రెచ్చగొట్టే ఉపన్యాసాలు, ఎమ్ ఐ ఎమ్ భుజంపై తుపాకీ పెట్టి టీఆరెస్ ను కాల్చే వ్యూహాలు….టీఆరెస్ పై అవినీతి ఆరోపణలు…ఒకటి కాదు వీలైనన్ని ఎత్తుగడలు, వ్యూహాలతో టీఆరెస్ ఓడించడానికి తహతహలాడుతున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విజయం సాధిస్తారా ? చాలా […]

అన్ని ఆధారాలు ఉంటే ఆర్టీఐ ఎందుకన్నా?
X

తెలంగాణ రాష్ట్రాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ తన లక్ష్యాన్ని సాధిస్తుందా ? టీఆరెస్ వ్యతిరేక ప్రచారాలు, ధర్నాలు, రాస్తారోకోలు, పార్టీలో చేరికలు, జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభలు, మతాలను రెచ్చగొట్టే ఉపన్యాసాలు, ఎమ్ ఐ ఎమ్ భుజంపై తుపాకీ పెట్టి టీఆరెస్ ను కాల్చే వ్యూహాలు….టీఆరెస్ పై అవినీతి ఆరోపణలు…ఒకటి కాదు వీలైనన్ని ఎత్తుగడలు, వ్యూహాలతో టీఆరెస్ ఓడించడానికి తహతహలాడుతున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విజయం సాధిస్తారా ?

చాలా కాలంగా బండి సంజయ్ తో సహా, ఆ పార్టీ కేంద్ర నాయకులు కూడా త్వరలోనే కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్ళక తప్పదని, వాళ్ళు చేసిన అవినీతి కార్యకలాపాలకు సంబంధించి తమ దగ్గర అన్ని ఆధారాలున్నాయని చెప్తూ వస్తున్నారు.

ఒక సారి , రెండు సార్లు కాదు రెండేళ్ళుగా బీజేపీ నాయకులు ఇదే మాట చెప్తున్నారు. కాని ఒక్క రోజు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలేంటో , ఆధారాలుంటే ఇంత కాలంగా కేసీఆర్ కుటుంబంపై చర్యలు ఎందుకు తీసుకోలేదో మాత్రం చెప్పడం లేదు. ఈ అంశంపై మీడియా ప్రశ్నించినా కూడా సమయం వచ్చినప్పుడు అన్ని ఆధారాలు బైట పెడతామని చెప్పారు కానీ ఆ సమయం ఇప్పటి వరకు రాలేదు.

నిజంగానే వాళ్ళ దగ్గర ఆధారాలుంటే ఇప్పటి వరకు ఆగుతారా ? గెలవక పోయినా అనేక రాష్ట్రాల్లో ఈడీ సహాయంతో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ నిజంగానే కేసీఆర్ అవినీతికి పాల్పడి ఉంటే ఇప్పటి వరకు ఊరుకునే వాళ్ళేనా అనే చర్చ ప్రజల్లో ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు బండి సంజయ్ చేసిన ఓ పని అదే నిజమని తేల్చింది.

బండి సంజయ్ ఈ మధ్య ఆర్టీఐ చట్టం కింద ఏకంగా 86 అంశాలపైన ఎనిమిదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, అమలు చేసిన పథకాలు, అమలు చేయాల్సినవి.. అలాగే ఇప్పటివరకు చేసిన ప్రభుత్వ ఖర్చులపై సమాచారాన్ని కోరుతూ ఆర్టీఐ దరఖాస్తులు చేశారు. పైగా మీడియాకు ఇచ్చిన ప్రకటనల విలువపైనా లెక్క‌లు ఇవ్వాలని దరఖాస్తు చేశారు.

నిజంగానే అన్ని వివరాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర, బీజేపీ అధిష్టానం దగ్గర ఉన్నాయని ఊదరగొడుతున్న బండి సంజయ్ మరి ఆర్టీఐ కింద ఎందుకు అప్లై చేసినట్టు? నిజంగానే టీఆరెస్ ప్రభుత్వంలో అవినీతే జరిగి ఉంటే ఆ వివరాలు సంపాదించడం అతి పెద్ద యంత్రాంగం ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కష్టమా ? దాని కోసం ఆర్టీఐ కింద దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉందా ?

ఇదంతా చూస్తూ ఉంటే..ఇవన్నీ బీజేపీ ప్రచారం కోసం చేస్తున్న ఎత్తుగడలుగానే కనిపిస్తున్నాయని ప్రజలు భావిస్తే తప్పేం ఉంది ? రెండేళ్ళుగా వాళ్ళు చేస్తున్న అవినీతి ఆరోపణలన్నీ ఉత్తివే అని తేలిపోవడంలేదా ? ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం మాట్లాడుతున్న మాటలని, చేస్తున్న పనులని అందులో కాస్తంత కూడా నిజాయితీ కానీ నిజాలు కానీ లేవని అనుకోవచ్చా ?

First Published:  7 July 2022 12:02 PM IST
Next Story