Telugu Global
National

కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి రాజీనామా.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి అవుతారా..?

కేంద్రమంత్రి ప‌ద‌వికి ముక్తార్ అబ్బాస్ నక్వి బుధవారం రాజీనామా చేశారు. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు అభ్యర్థిగా ఆయన రేసులో ఉండవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. రాజ్యసభ సభ్యునిగా ఆయన సభ్యత్వం రేపు ముగియనుంది. ఇటీవల ఎగువసభ ఎన్నికల్లో నక్విని బీజేపీ మళ్ళీ రెండోసారి ఎంపిక చేయలేదు.. ఈ ఉదయం ఆయన ప్రధాని మోడీని, పార్టీ అధ్యక్షుడు జేపీ. నడ్డాను కలుసుకున్నారు. అప్పుడే ఆయన రాజీనామా చేయవచ్చని సూచనప్రాయంగా వార్తలు వచ్చాయి. మోడీ ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు మంత్రుల్లో నక్వి, […]

కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి రాజీనామా.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి అవుతారా..?
X

కేంద్రమంత్రి ప‌ద‌వికి ముక్తార్ అబ్బాస్ నక్వి బుధవారం రాజీనామా చేశారు. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు అభ్యర్థిగా ఆయన రేసులో ఉండవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. రాజ్యసభ సభ్యునిగా ఆయన సభ్యత్వం రేపు ముగియనుంది. ఇటీవల ఎగువసభ ఎన్నికల్లో నక్విని బీజేపీ మళ్ళీ రెండోసారి ఎంపిక చేయలేదు.. ఈ ఉదయం ఆయన ప్రధాని మోడీని, పార్టీ అధ్యక్షుడు జేపీ. నడ్డాను కలుసుకున్నారు. అప్పుడే ఆయన రాజీనామా చేయవచ్చని సూచనప్రాయంగా వార్తలు వచ్చాయి.

మోడీ ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు మంత్రుల్లో నక్వి, రాజ్ నాథ్ సింగ్ మాత్రమే వాజ్ పేయి ప్రభుత్వంలో కూడా ఉన్నారు. ఉపరాష్ట్రపతి పదవికి మైనారిటీ వర్గం నుంచి ఓ ప్రతినిధిని ఎంపిక చేయాలన్న విషయమై బీజేపీ ఇటీవల కాలంలో చర్చలు జరుపుతూ వచ్చింది. పార్టీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ.. మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల పట్ల దేశమంతా నిరసనలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో బీజేపీ ఊహించని ఇబ్బందుల్లో పడింది. ఈ తరుణంలో నక్విని దేశ రెండో అత్యున్నత పదవికి ఎంపిక చేస్తే .. డ్యామేజీ కంట్రోల్ కావచ్చన్నది ఈ పార్టీ యోచనగా తెలుస్తోంది.

ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్టు 10 తో ముగియనుంది. ఈ పదవికి నామినేషన్ల దాఖలుకు ఈ నెల 19 చివరితేదీ. ఆగస్టు 6న ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇదే సమయంలో ఈ పదవికి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, మాజీ కేంద్ర మంత్రి నజ్మా హెప్తుల్లా, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా బీజేపీ ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్మును ఎంపిక చేసింది. అయితే దేశ రెండు అత్యున్నత పదవులకూ తమ అభ్యర్థులను గెలిపించుకునే సత్తా ఈ పార్టీకి ఉంది.

మరో కేంద్ర మంత్రి ఆర్. సీపీ. సింగ్ కూడా రాజీనామా
మరో కేంద్రమంత్రి ఆర్. సీపీ. సింగ్ కూడా నేడు రాజీనామా చేశారు. ఎన్డీయే మిత్రపక్షమైన జనతాదళ్-యూకి చెందిన ఆయన సైతం నక్వితో పాటు రాజీనామా చేస్తారని ఉదయం వార్తలు వచ్చాయి. ఈయన రాజ్యసభ సభ్యత్వం కూడా రేపటితో ముగుస్తోంది. దేశానికి నక్వి, సింగ్ చేసిన సేవలను ప్రధాని మోడీ.. నేటి కేబినెట్ సమావేశంలో ప్రశంసించారని తెలుస్తోంది. ఇక ఉప రాష్ట్రపతి పదవికి తమ ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై విపక్షాలు ఇంకా చ‌ర్చించలేదు.. ఒకవేళ అభ్యర్థిని నిలబెట్టినా విజయావకాశాలు లేవని భావించే ఇవి కామ్ గా ఉన్నట్టు భావిస్తున్నారు.

First Published:  6 July 2022 7:35 AM GMT
Next Story