Telugu Global
NEWS

తెలంగాణ ఇంటర్ విద్యలో ప్రభుత్వ విప్లవం..

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవ, అధికారుల కఠిన నిర్ణయాలు.. వెరసి తెలంగాణలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల సంఖ్య ప్రైవేటు కాలేజీలను దాటేసింది. ఊరికో ప్రైవేటు కాలేజీ కొత్తగా పుట్టుకొస్తున్న ఈరోజుల్లో తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి మారిపోయింది. ఏడాది కేడాది ప్రైవేటు కాలేజీల సంఖ్య తగ్గిపోతుండగా.. ప్రభుత్వ కాలేజీల సంఖ్య పెరిగింది. ఈ ఏడాదికి తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు కాలేజీల సంఖ్య 1516 కాగా, ప్రభుత్వ జూనియర్ కాలేజీల సంఖ్య 1560కి చేరింది. విద్యా వ్యవస్థలో టీఆర్ఎస్ […]

తెలంగాణ ఇంటర్ విద్యలో ప్రభుత్వ విప్లవం..
X

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవ, అధికారుల కఠిన నిర్ణయాలు.. వెరసి తెలంగాణలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల సంఖ్య ప్రైవేటు కాలేజీలను దాటేసింది. ఊరికో ప్రైవేటు కాలేజీ కొత్తగా పుట్టుకొస్తున్న ఈరోజుల్లో తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి మారిపోయింది.

ఏడాది కేడాది ప్రైవేటు కాలేజీల సంఖ్య తగ్గిపోతుండగా.. ప్రభుత్వ కాలేజీల సంఖ్య పెరిగింది. ఈ ఏడాదికి తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు కాలేజీల సంఖ్య 1516 కాగా, ప్రభుత్వ జూనియర్ కాలేజీల సంఖ్య 1560కి చేరింది. విద్యా వ్యవస్థలో టీఆర్ఎస్ సర్కారు తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల ఫలితమే ఇదని అంటున్నారు విద్యావేత్తలు.

ఇతర రాష్ట్రాలకు భిన్నం..
దాదాపుగా ఇతర అన్ని రాష్ట్రాల్లోనూ ప్రైవేటు కాలేజీల హవా కొనసాగుతోంది. కానీ తెలంగాణలో మాత్రం ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలసంఖ్య పెరిగింది. కేవలం రాశి మాత్రమే కాదు, వాసిలో కూడా తాము మిన్న అని నిరూపించుకోబోతున్నారు గవర్నమెంట్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు. అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వ సూచనతో వినూత్నంగా ముందుకెళ్తున్నారు.

సర్కారు జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రత్యేకంగా అడ్మిషన్స్‌ డ్రైవ్‌ లు నిర్వహిస్తున్నారు. ఇంటర్‌ మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 1 నుంచి మొదలైంది, 17వతేదీతో ముగుస్తుంది. అడ్మిషన్లు పెంచేందుకు ఇంటర్‌ విద్య కమిషనర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ డీఐఈవోలు, నోడల్‌ అధికారులు, ప్రిన్సిపాళ్లకు పలు ఆదేశాలు ఇచ్చారు. కరపత్రాలు, బ్రోచర్లు, బ్యానర్లతో ప్రచారం చేయాలన్నారు.

టెన్త్ క్లాస్ పాసైనవారి జాబితా తీసుకుని లెక్చరర్లు కూడా ప్రైవేట్ కాలేజీలకు దీటుగా క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో చేరే ఇంటర్ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

గణాంకాలివీ..
తెలంగాణ ఇంటర్‌ బోర్డు 2014 నుంచి ఇప్పటివరకు కొత్త ప్రైవేట్‌ కాలేజీలకు అనుమతి ఇవ్వలేదు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 68 కాలేజీలను అధికారులు మూసివేశారు. గతంలో 2,600 పైగా కాలేజీలు ప్రైవేట్ సెక్టార్ లో ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 1,516కి పరిమితం అయింది. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, గురుకులాల సంఖ్య మొత్తం 1560. 394 కాలేజీలకు సొంత భవనాలుండగా.. మిగతావి ప్రభుత్వ స్కూల్స్ లో నిర్వహిస్తున్నారు.

ఇక గురుకులాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై కోర్సు రెండేళ్లలో రూ.1.25 లక్షలు ఖర్చుచేసి, పూర్తిగా ఉచిత విద్య అందిస్తున్నారు. ఉచితంగా జేఈఈ, నీట్‌, ఎంసెట్‌ కోచింగ్ ఇస్తున్నారు. ప్రతి ఏడాదీ బడ్జెట్ లో గురుకులాల అభివృద్ధి కోసం సగటున 500 కోట్ల రూపాయలు విడుదలవుతున్నాయి. మొత్తమ్మీద ఓ ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ కాలేజీలపై శ్రద్ధ పెట్టడంతో.. సత్ఫలితాలు సాధ్యమయ్యాయి. తెలంగాణలో ఇంటర్ విద్య అంటే.. ప్రభుత్వ కాలేజీల వైపు చూసే పరిస్థితి ఏర్పడింది.

First Published:  6 July 2022 1:31 AM IST
Next Story