ఆథునిక శ్రవణుడు ఈ కృష్ణకుమార్!
వృద్ధులైన అంధతలిదండ్రులను భుజాన కావిడితో మోసుకుంటూ తీర్ధ యాత్రలు చేశాడు శ్రవణ కుమార్ అనేది పురాణ గాథ. అంధులైన తలిదండ్రుల పనులన్నీ అతనే చక్కబెడుతూ వారి అవసరాలు తీరుస్తూ కంటికి రెప్పలా చూసుకునే వాడు. తీర్ధయాత్రలు చేయాలన్న వారి కోరికను తెలిపినప్పుడు కావిడి తయారు చేసుకుని వారిని అందులో కూర్చోబెట్టుకుని యాత్ర సాగించి ఆదర్శ పుత్రుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. నేటి ఆధునిక యుగంలో మైసూరుకు చెందిన కృష్ణకుమార్ అనే 44 యేళ్ళ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వృద్ధురాలైన […]
వృద్ధులైన అంధతలిదండ్రులను భుజాన కావిడితో మోసుకుంటూ తీర్ధ యాత్రలు చేశాడు శ్రవణ కుమార్ అనేది పురాణ గాథ. అంధులైన తలిదండ్రుల పనులన్నీ అతనే చక్కబెడుతూ వారి అవసరాలు తీరుస్తూ కంటికి రెప్పలా చూసుకునే వాడు.
తీర్ధయాత్రలు చేయాలన్న వారి కోరికను తెలిపినప్పుడు కావిడి తయారు చేసుకుని వారిని అందులో కూర్చోబెట్టుకుని యాత్ర సాగించి ఆదర్శ పుత్రుడిగా చరిత్రలో నిలిచిపోయాడు.
నేటి ఆధునిక యుగంలో మైసూరుకు చెందిన కృష్ణకుమార్ అనే 44 యేళ్ళ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వృద్ధురాలైన తన తల్లిని పాత స్కూటర్ పై తిప్పుతూ దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలతో పాటు పలు చారిత్రక సందర్శక ప్రాంతాలను చూపిస్తున్నాడు. 2018లో జనవరి 18న ఈ తల్లీ కొడుకులు స్కూటర్ మీద ఇంటి నుంచి బయలుదేరారు. ఇప్పటికి 57,100 కిలోమీటర్లు ప్రయాణించారు. భారతదేశమంతా తిరుగుతూనే నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాలనూ స్కూటర్ మీదే సందర్శించారు.
ఈ క్రమంలో వారు తిరుపతికి చేరుకున్నారు. ఇదెలా సాధ్యం..అనే ప్రశ్నకు ఆయన ఇలా చెప్పుకొచ్చాడు.
తన తండ్రి దక్షిణామూర్తి మరణంతో తల్లి చూడరత్నమ్మ దుఖంలో మునిగిపోయి అన్యమనస్కంగా దిగులుగా ఉండేదిట.
తాను ఉద్యోగరీత్యా తిరిగిన ప్రదేశాల గురించి చెబుతున్నప్పుడు ఆమె కళ్ళలో మెరుపు కనిపించేది. నీవు తిరిగిన ఊళ్ళ గురించి చెప్పమని అడిగినప్పుడు ఆమె దిగాలు పడడం గమనించానని కృష్ణకుమార్ చెప్పాడు. తీర్ధ యాత్రలు చేయాలని ఉందా అని అడిగినప్పుడు ఆమె మౌనం వెనక భావాన్ని గుర్తించాడు.
బస్సులు , రైళ్ళు వంటి ప్రయాణ సాధనాల ద్వారా అయితే గుళ్ళ వరకే పరిమితం అవుతామని భావించి తన తండ్రి ఉపయోగించిన స్కూటర్ ను ప్రయాణ సాధనం గా చేసుకున్నామని చెప్పారు. ఉద్యోగం వదిలిపెట్టి తల్లిని తీసుకుని యాత్రకు బయలుదేరాడు ఈ అపర శ్రవణుడు.
తమకు ఓపిక ఉన్నంత వరకూ ఇలా యాత్ర కొనసాగిస్తామని అంటున్నారు. నేటి తీరిక లేని దైనందిన జీవితంలో పడి తల్లిదండ్రులను యువత నిర్లక్ష్యం చేయొద్దని చెబుతున్నాడు. తలిదండ్రులకు సేవచేసుకోవడం ఒక భాగ్యంగా బాధ్యతగా భావించాలని చెప్పాడు.