Telugu Global
National

పాల్ రావాలి.. పాలన మారాలి.. తెలంగాణలో సంచలన సర్వే..

తెలంగాణలో మరో ఏడాదిలో ఎన్నికలున్నాయి. ఈ దశలో పలు సంస్థలు సర్వే చేపట్టడం సహజం. పీకే టీమ్ ఈపాటికే తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేపట్టి, టీఆర్ఎస్ కి ముందస్తు జాగ్రత్తలు సూచించింది. కాంగ్రెస్, బీజేపీ కూడా సీక్రెట్ గా సర్వేలు చేయించుకుంటున్నాయి. అయితే ఇప్పుడో సంచలన సర్వే తెలంగాణ ఫలితాలు ఎలా ఉంటాయో ప్రకటించింది. కనీవినీ ఎరగని రీతిలో ఫలితాలుంటాయని, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. వీటిలో ఏ ఒక్క పార్టీ కూడా అధికారంలోకి రాదని, కనీసం కూటమి […]

పాల్ రావాలి.. పాలన మారాలి.. తెలంగాణలో సంచలన సర్వే..
X

తెలంగాణలో మరో ఏడాదిలో ఎన్నికలున్నాయి. ఈ దశలో పలు సంస్థలు సర్వే చేపట్టడం సహజం. పీకే టీమ్ ఈపాటికే తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేపట్టి, టీఆర్ఎస్ కి ముందస్తు జాగ్రత్తలు సూచించింది. కాంగ్రెస్, బీజేపీ కూడా సీక్రెట్ గా సర్వేలు చేయించుకుంటున్నాయి. అయితే ఇప్పుడో సంచలన సర్వే తెలంగాణ ఫలితాలు ఎలా ఉంటాయో ప్రకటించింది. కనీవినీ ఎరగని రీతిలో ఫలితాలుంటాయని, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. వీటిలో ఏ ఒక్క పార్టీ కూడా అధికారంలోకి రాదని, కనీసం కూటమి కట్టినా వారికి అంత సీన్ లేదని తేల్చేసింది. ఆ సర్వే సారాంశం ఏంటంటే.. పాల్ రావాలి.. పాలన మారాలి.

ఎన్నికలయ్యాక బిచాణా ఎత్తేసి, మళ్లీ ఎన్నికల ఏడాదిలో ఎక్కడినుంచో సడన్ గా ఊడిపడే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. మళ్లీ తెరపైకి వచ్చారు. ఆమధ్య తనపై దాడి జరిగిందని, నేరుగా ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రికి కంప్లయింట్ చేసి వచ్చిన పాల్, మళ్లీ ఇప్పుడు సంచలన సర్వే వివరాలు బయటపెట్టారు. ఒక్కసారిగా తెలంగాణ ప్రజానీకాన్ని నవ్వుల్లో ముంచెత్తారు.

ఆ సర్వే గణాంకాలు ఇలా ఉన్నాయి..
– ప్రజాశాంతి పార్టీకి 70 శాతం మంది తెలంగాణ ప్రజల మద్దతు ఉందట.
– టీఆర్ఎస్ కి 18 శాతం
– బీజేపీకి 5నుంచి 6 శాతం
– కాంగ్రెస్ కి 4నుంచి 5 శాతం
ఇవి కాకి లెక్కలు కావు, పాల్ లెక్కలు. కడుపుబ్బా నవ్వించే కేఏ పాల్ లెక్కలు.

70శాతం మంది ప్రజల మద్దతు కేఏపాల్ ప్రజాశాంతి పార్టీకి ఉందని చెప్పుకోవడమే పెద్ద కామెడీ అయితే.. అంతకు మించిన హాస్యాన్ని తన ప్రెస్మీట్ లో పండించారు పాల్. 70శాతం మంది ప్రజల మద్దతు తనకు ఉందని, అయితే ఆ 30శాతం మంది ప్రజలు ఇంకా భ్రమల్లో ఎందుకున్నారని ప్రశ్నిస్తున్నారు పాల్. వారందరికీ తనపై నమ్మకం లేకపోవడం విచిత్రం అంటున్నారు.

అమాయకత్వమా, అతి తెలివా, చిత్త చాంచల్యమా..?
2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల లిస్ట్ ప్రకటించేసి హడావిడి చేశారు కేఏపాల్. ఏపీలో వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలి ఉండేవారిని అభ్యర్థులుగా ఎంపిక చేసి ఆ పార్టీకి షాకిచ్చారు. ఇలాంటి లోపాయికారీ ఎత్తులు చాలానే వేస్తుంటారు పాల్. అందుకే ఆయన్ను అమాయకుడు అనుకోలేం, అతి తెలివి అని కూడా అనుకోలేం, అసలు పూర్తిగా ఆయన మానసిక వైకల్యంతో ఉన్నారా అనేది కూడా అనుమానమే. మొత్తానికి పాల్ ని ఓ పొలిటికల్ కమెడియన్ గా మాత్రమే మీడియా హైలైట్ చేస్తోంది.

మిగతా నాయకులు సీరియస్ గా తిట్టుకున్నా పట్టించుకోని జనం, పాల్ ప్రెస్మీట్లలో ఆయన డైలాగులు విని హాయిగా నవ్వుకుంటారు. అమలాపురం ఎమ్మెల్యే పదవినుంచి అమెరికా అధ్యక్ష పదవి వరకు అన్నిటికీ ఉన్న ఏకైక పోటీదారుగా తనని తాను అభివర్ణించుకుంటారు పాల్. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో కాస్త గట్టిగానే కామెడీ చేయడానికి రెడీ అయ్యారు. తెలంగాణ, ఏపీలో పాదయాత్ర చేస్తానని కూడా ప్రకటించారు. పాల్ ని రంగంలోకి దించి క్రిస్టియన్ ఓట్లను చీల్చడానికి బీజేపీ వేస్తున్న కొత్త ఎత్తుగడ ఇది అనే ఆరోపణలు కూడా బలంగానే వినపడుతున్నాయి. ఏది ఏమైనా.. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో పాల్ చేయబోయే హడావిడి మూమూలుగా ఉండద‌నే విషయం ఈపాటికే జనాలకి అర్థమైపోయింది. కేసీఆర్ పై కేసీఆర్ అనే మరో వ్యక్తిని పోటీకి దింపగల సమర్థుడు పాల్. కేటీఆర్ కి పోటీగా కేటీఆర్ అనే పేరున్న మరో వ్యక్తిని వెతికి పట్టుకుని తీసుకురాగల మేధావి. కానీ ఇంత చేసినా పాల్ ఆటలో అరటిపండు మాత్రమే.

First Published:  6 July 2022 1:38 PM IST
Next Story