కేసీఆర్ టేబుల్ పై రఘురామ కేసు..
ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ పై దాడి కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజు, అతని కుమారుడు భరత్ సహా మరికొందరిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను కూడా సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. అయితే ఈ కేసు విషయంలో తెలంగాణ పోలీసులు.. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర.. ఉద్దేశపూర్వకంగానే తమను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేస్తున్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఈమేరకు ఆయన తెలంగాణ సీఎం […]
ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ పై దాడి కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజు, అతని కుమారుడు భరత్ సహా మరికొందరిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను కూడా సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.
అయితే ఈ కేసు విషయంలో తెలంగాణ పోలీసులు.. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర.. ఉద్దేశపూర్వకంగానే తమను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేస్తున్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఈమేరకు ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ కి ఓ లేఖ రాశారు. తనను అన్యాయంగా కేసుల్లో ఇరికించారని, ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తనకు రక్షణ ఇవ్వాలని కోరారు రఘురామ.
వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజు, అటు పార్టీకి రాజీనామా చేయకుండా, ఇటు పార్టీ నాయకులనే తిడుతూ డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఆ తిట్లు శృతి మించడంతో.. ఆమధ్య రాజద్రోహం కేసు కూడా ఎదుర్కొన్నారు. తాజాగా మోదీ భీమవరం సభతో ఆయన తన సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టాలనుకున్నారు. అయితే ఆయనకు అధికారిక ఆహ్వానం అందలేదు. భీమవరంలో అడుగు పెడితే తగిన శాస్తి చేస్తామని హెచ్చరికలు రావడంతో ఆయన హైదరాబాద్ లోనే ఆగిపోయారు.
తన అనుచరులను వైసీపీ నేతలు ఇబ్బంది పెడతారని, అందుకే తాను భీమవరం సభకు రాలేదని చెప్పుకొచ్చారు రఘురామ. ఆ తర్వాతే అసలు ట్విస్ట్ మొదలైంది. హైదరాబాద్ లో రఘురామ కృష్ణంరాజు ఇంటి బయట ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ని కొందరు బలవంతంగా కారులో ఎక్కించుకుని ఆయన ఇంటిలోకి తీసుకుపోవడం, కానిస్టేబుల్ పై దాడి చేయడం, బాధితుడి కంప్లయింట్ ద్వారా హైదరాబాద్ పోలీసులు ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఆయన కొడుకు, పీఏపై కేసులు పెట్టడం చకచగా జరిగిపోయాయి.
ఈ గొడవలో రఘురామకు సెక్యూరిటీగా ఉన్న ఇద్దరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. అయితే తనపై హత్యాయత్నం చేయాలని చూస్తున్నారని, తనను అంతమొందించాలనుకుంటున్నారని రఘురామ ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు ఈ విషయంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు ఎంపీ.
ఏపీ ఎంపీ తనకు ప్రాణ హాని ఉందని తెలంగాణ సీఎంకు లేఖ రాయడం ఇప్పుడు సంచలనంగా ఉంది. సదరు ఎంపీ హైదరాబాద్ లోనే నివాసం ఉండొచ్చు కానీ.. ఈ మొత్తం వ్యవహారం మాత్రం రాజకీయ కలకలం రేపుతోంది.
తనపై దాడికి రెక్కీ నిర్వహించిన వారిని తెలంగాణ పోలీసులు వదిలేశారని, వారి మాటలు విని తనపై కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు ఎంపీ రఘురామ. తెలంగాణ సీఎం కేసీఆర్ ని శరణు కోరారు. మరి కేసీఆర్ ఈ లేఖపై స్పందిస్తారో లేదో చూడాలి. భీమవరం వదిలి రఘురామ వనవాసం ఎన్నాళ్లు కొనసాగుతుంతో వేచి చూడాలి.