Telugu Global
NEWS

రాజోలు వైసీపీలో రాజీనామాల పర్వం..

వైసీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీకోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్న వేళ.. రాజోలు నియోజకవర్గంలో రాజీనామాలు మళ్లీ జోరందుకున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున రాజోలు నియోజకవర్గంలో పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు రాష్ట్ర సలహాదారు పదవికి రాజీనామా చేశారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారాయన. అయితే ఆయన పార్టీకి రాజీనామా చేయకపోవడం విశేషం. కేవలం రాష్ట్ర సలహాదారు పదవికి మాత్రమే బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు. ఆ పదవితో తాను కార్యకర్తలకు ఉపయోగపడలేకపోతున్నానని చెప్పారు. ఇప్పటి […]

రాజోలు వైసీపీలో రాజీనామాల పర్వం..
X

వైసీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీకోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్న వేళ.. రాజోలు నియోజకవర్గంలో రాజీనామాలు మళ్లీ జోరందుకున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున రాజోలు నియోజకవర్గంలో పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు రాష్ట్ర సలహాదారు పదవికి రాజీనామా చేశారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారాయన. అయితే ఆయన పార్టీకి రాజీనామా చేయకపోవడం విశేషం. కేవలం రాష్ట్ర సలహాదారు పదవికి మాత్రమే బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు. ఆ పదవితో తాను కార్యకర్తలకు ఉపయోగపడలేకపోతున్నానని చెప్పారు. ఇప్పటి వరకూ ఆయన పి.ఆర్, ఆర్.డి. అండ్ ఆర్.డబ్ల్యు.ఎస్. రాష్ట్ర సలహాదారుగా ఉన్నారు. ఇప్పుడు రాజీనామా చేశారు.

సరిగ్గా రెండు వారాల క్రితం, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకటరామరాజు, దాదాపు వెయ్యిమంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు. అదే రాజోలు నియోజకవర్గం నుంచి ఇప్పుడు మరో కీలక నేత కూడా రాజీనామా చేయడం సంచలనంగా మారింది. 2019లో రాజోలులో ఓటమి తర్వాత బొంతు రాజేశ్వరరావు నియోజకవర్గ ఇన్ చార్జ్ గా కొనసాగుతున్నారు. అయితే జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావడంతో సీన్ రివర్స్ అయింది. రాపాకను నియోజకవర్గ ఇన్ చార్జిగా ప్రకటించారు. ఆయన కూడా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో అప్పటి వరకూ వైసీపీలో ఉన్న నేతలు ఇబ్బంది పడ్డారు. గతంలో రుద్రరాజు వెంకట రామరాజు అయినా, ఇప్పుడు బొంతు రాజేశ్వరరావు అయినా అదే కారణంతో పార్టీని వీడారు. రాపాకకు ప్రాధాన్యం పెరిగిందని, పార్టీలో ముందునుంచి ఉన్నవారిని నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

కోనసీమ జిల్లా లక్కవరంలో రాజోలు నియోజకవర్గ అసమ్మతి నేతలు ఇటీవల ఓ సమావేశం పెట్టుకున్నారు. 11ఏళ్లుగా పార్టీకోసం కష్టపడుతున్నా తమకు న్యాయం జరగలేదని ఆ సమావేశంలో చాలామంది తమ ఆవేదన వ్యక్తం చేశారట. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమపై వేధింపులు పెరిగాయని ఓ వర్గం చెబుతోంది. నియోజకవర్గంలో నెలకొన్న అసమ్మతిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, నియోజకవర్గ బాధ్యతలు రాపాకకు కట్టబెట్టడం సరికాదని వారు అంటున్నారు. మొత్తమ్మీద.. ప్లీనరీకి ఏర్పాట్లు జోరుగా సాగుతున్న వేళ.. రాజోలు నియోజకవర్గం వైసీపీకి తలనొప్పిగా మారింది. జనసేన ఎమ్మెల్యే రాపాకపై ఆరోపణలు చేస్తూ ఒక్కొక్కరే పార్టీకి దూరమవుతున్నారు.

First Published:  5 July 2022 11:52 AM IST
Next Story