Telugu Global
National

మోడీ ‘బాహుబలి’గా ఎలా మారారు?.. ఆయన వ్యూహ బృందం ఎవరు?

ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని కలుసుకున్నారు. కృష్ణమూర్తి కూతురు పసల కృష్ణభారతికి ఆయన పాదాభివందనం చేశారు. ఈ సన్నివేశం చూడడానికి పెద్దగా ఆసక్తికరమైనదిగా కనిపించదు. అలాగే ప్రధాని తరచూ గుజరాత్ వెళ్లి తన తల్లికి పాదాభివందనం చేసి ఆమె ఆశీస్సులు తీసుకునే దృశ్యాలు మీడియాలో చూస్తుంటాం. ఇలాంటి సన్నివేశాలు మామూలుగా చూస్తే ఎవరికీ ఉత్కంఠగాను, ఆశ్చర్యకరంగాను కనిపించవు. […]

మోడీ ‘బాహుబలి’గా ఎలా మారారు?.. ఆయన వ్యూహ బృందం ఎవరు?
X

ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని కలుసుకున్నారు. కృష్ణమూర్తి కూతురు పసల కృష్ణభారతికి ఆయన పాదాభివందనం చేశారు. ఈ సన్నివేశం చూడడానికి పెద్దగా ఆసక్తికరమైనదిగా కనిపించదు. అలాగే ప్రధాని తరచూ గుజరాత్ వెళ్లి తన తల్లికి పాదాభివందనం చేసి ఆమె ఆశీస్సులు తీసుకునే దృశ్యాలు మీడియాలో చూస్తుంటాం.

ఇలాంటి సన్నివేశాలు మామూలుగా చూస్తే ఎవరికీ ఉత్కంఠగాను, ఆశ్చర్యకరంగాను కనిపించవు. కానీ వీటి వెనుక ‘భారీ కసరత్తు’, ప్రణాళిక ఉన్నట్టు చాలామందికి తెలియదు. అట్లా ఒక ప్రణాళిక ముందుగానే రచించి ఉంటారని మన ఊహకు అందదు. అయితే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం మోడీని ‘భారతదేశ హీరో’గా మలచడానికి 2012 నుంచే ప్రయత్నాలు జరుగుతున్నవి. 2014 లో పార్లమెంటులో అడుగిడే ముందు ఆ భవనం ప్రవేశ ద్వారం దగ్గర మోకాళ్లపై కూర్చొని శిరస్సు వంచి ప్రణామం చేయడం యధాలాపంగా జరిగింది కాదు. ఖచ్చితంగా మోడీ ‘వ్యూహ నిపుణుల’ప్రణాళిక ఉంటుంది.

ప్రధానమంత్రి మోడీ దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకునిగా రాత్రికి రాత్రి తయారు కాలేదు. కఠోర శ్రమ, పట్టుదల, తెగింపు, ప్రత్యర్థులను అణచివేయడం వంటి అంశాలు ఆయన అప్రతిహత విజయాలకు కారణం అన్నది నాణానికి ఒక వైఫు దృశ్యమే. కనిపించని దృశ్యం మరొకటున్నది. అది ఆయన వెన్నంటి, అంకిత భావంతో పనిచేసే బృందం. భారత రాజకీయ క్రీడకు చెందిన నియమాలనే మోడీ మార్చిపారేశారు. 2014 నుంచి ఆయన ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. నరేంద్ర మోడీకి దేశవ్యాప్తంగా ఎంతో ఇమేజ్ ఉంది. పలు సర్వేలు ఆయనకు ఉన్న పాపులారిటీని తరచూ చెబుతున్నవి. సోషల్ మీడియా వేదికల్లో ఆయన ఎంతో చురుగ్గా ఉంటారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు గాను బేగంపేట ఎయిర్ పోర్టులో దిగగానే ‘డైనమిక్ నగరానికి చేరుకున్నా’అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు.

మోడీ హావభావాలు, ఆహార్యం, బాడీ లాంగ్వేజ్, ఏ రాష్ట్రానికి లేదా ఏ దేశానికి వెడుతున్నారు? ఏ కార్యక్రమానికి వెడుతున్నారు? ఏ నియోజకవర్గానికి వెడుతున్నారు? అక్కడి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఏమిటి? అక్కడ ఏమి మాట్లాడాలి? ఎట్లా మాట్లాడాలి? ప్రసంగాన్ని ఎట్లా ప్రారంభించాలి? ఎట్లా ముగించాలి? తదితర అనేక అంశాల్లో ఆయనకు శిక్షణ నిచ్చే బృందం ఒకటి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అయితే ఆ బృందంలో అందరూ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉండరు. మోడీ విధేయ బృందంలో వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు ఉన్నారు. మోడీని ఒక ‘బ్రాండ్’గా వాళ్ళు కష్టపడి మలిచారు. ఎందుకంటే కేసీఆర్ వలె ఒక ఉద్యమాన్ని 13 ఏళ్ల పాటు నిర్విరామంగా నడిపి సొంతంగా సంపాదించుకున్న ‘బ్రాండ్’కాదు. జనరంజక ప్రసంగాలు చేయడంలో మోడీని మించిన వారు లేరన్న అభిప్రాయాన్ని ప్రజల హృదయాల్లో బలంగా నాటారు.

మోడీ తెలివితేటలు, సామర్ధ్యం, ఆర్థిక విషయాల్లో ఆయన పరిజ్ఞానం చాలా తక్కువే ఉండవచ్చు. కానీ అవేవీ ప్రజలకు కనబడకుండా ఆయన ‘టీమ్’ నిరంతరం పనిచేస్తూ ఉంటుంది .పెద్ద నోట్ల రద్దు కావచ్చు, కాశ్మీర్ అంశం కావచ్చు ఆయన ఏమి నిర్ణయం తీసుకున్నా దాని వెనుక భారీ ‘హోమ్ వర్కు’ఉన్న విషయం కొద్దిమందికే తెలుస్తుంది. ఎనిమిదేళ్ల కిందట క్రితం మోడీ చెప్పిందేమిటి, దేశం ఇప్పుడు ఎదుర్కుంటున్న సమస్యలేమిటి, మోడీ నోట వెలువడుతున్న మాటలేమిటి ? అనే ప్రశ్నలకు చోటు లేకుండా ‘సోషల్ మీడియా’వేదికల్లో మోడీ ఇమేజ్ హోరెత్తుతూ ఉంటుంది.

”ప్రపంచ ఆర్థిక వ్యవస్థ‌లో మాంద్యం వున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ‌ ఎంతో బాగా పని చేస్తోంది. జిఎస్‌టి, పన్నుల సంస్కరణల వంటి పునాదులు వేశారు. మోడీ ఆర్థిక‌ విధానం ప్రపంచంలోని అగ్రరాజ్యాలలో ఒకటిగా దేశాన్ని మార్చేసింది.” అని బీజేపీ ప్రతినిధి సంబిత్‌ పాత్ర అంటున్నారు. దేశభక్తి, జాతీయవాదాన్ని రంగరించి పథకం ప్రకారమే జనంపైకి వదిలారు. మోడీ విజయాల వెనుక కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సహా పలువురు నాయకులు, బీజేపీ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకున్న కొందరు వ్యూహకర్తలూ ఉన్నారు. మోడీ ‘వ్యూహబృందం’లో సీనియర్లు, యువకులూ ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, ఓమ్ మాథుర్, భూపేంద్రయాదవ్, డాక్టర్ వినయ సహస్ర బుద్ధితో పాటు శ్రీకాంత్ శర్మ, అరవింద్ గుప్తా వంటి యువతరం కూడా మోడీని ‘ప్రభావశీల’ నాయకునిగా తయారుచేయడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా వ్యవహారాలూ, డిజిటల్ వార్ రూమ్ ను శ్రీకాంత్ శర్మ, అరవింద్ వంటి వాళ్ళు సమర్ధంగా నడుపుతున్నారు. వీళ్ళు కాకుండా కనీసం 20 మందికి పైగా మోడీ కోసం రేయింబవళ్లు పనిచేస్తుంటారు.

”నవభారత నిర్మాణానికి మోడీ సమర్థ‌ నాయకత్వం అవసరం. ఆయన శక్తి సామర్ధ్యాలు అసమానమైనవి. ఆర్థిక‌, విదేశాంగ విధానాల పట్ల మోడీ వైఖరి ఎట్లా ఉంటుందోనని అందరూ అనుమానించారు. కానీ ప్రధానమంత్రిగా పదవిని చేబట్టిన ఏడాదిలోపే అలాంటి విమర్శకుల నోళ్లను మోడీ మూయించగలిగారు ”అని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ 2015లో వ్యాఖ్యానించారు. మోడీ ‘కోర్ టీమ్’ కు అమిత్ షా సారథ్యం వహిస్తున్నారు. ఆ టీమ్ లో భూపేంద్రయాదవ్ కేంద్రప్రభుత్వం రచించి అమలు చేస్తున్న ప్రధానమంత్రి జన్ -ధన్ యోజన సహా పీఎం సురక్షా బీమా యోజన, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన తదితర సామాజిక భద్రతకు హామీని ఇచ్చే పలు సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. భారత ప్రణాళికా మండలి పేరును ‘నీతి ఆయోగ్’ గా మార్చడంలోనూ భూపేంద్రయాదవ్ పాత్ర ఉన్నట్టు బీజేపీ శ్రేణులు చెబుతున్నవి. 2014 లో కాంగ్రెస్, బీజేపీ మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో మోడీ విజయం వెనుక పనిచేసిన వారిలో భూపేంద్ర యాదవ్ కూడా ముఖ్యుడు. ఆయన సుప్రీం కోర్టు న్యాయవాదిగానూ గుర్తింపు పొందిన వ్యక్తి. ”గడచిన ఎనిమిదేండ్లలో బీజేపీని,కేంద్రప్రభుత్వాన్ని మోడీ సమర్ధంగా నడుపుతున్నారు. ఆయన ప్రతిభ తిరుగులేనిది.” అని పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ వినయ్ సహస్ర బుద్ధి అంటున్నారు.

ఇక అమిత్ షా చెప్పవలసిన అవసరం లేదు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడంలో షా కృషి అమోఘం. కేంద్రంలోనే కాదు, ఉత్తరప్రదేశ్ లోనూ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో అమిత్ షా కాంట్రిబ్యూషన్ ను విస్మరించలేం. ఆయన ఆపార్టీ నెట్ వర్క్ ను ఎట్లా విస్తరింపజేసే నైపుణ్యం అమిత్ షాకు తప్ప‌ మరెవరికీ లేదు. పార్టీ సభ్యత్వనమోదు ప్రక్రియలో 10 కోట్లకు పైగా రికార్డును దాటడం అమిత్ షా వల్లనే సాధ్యమైంది. మోడీకి విశ్వాసపాత్రుల్లో ఒకరైన ఓం మాథుర్ ఉత్తరప్రదేశ్ లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలోనూ, మహారాష్ట్ర ఇంచార్జ్ గా, వారణాసిలో మోడీ విజయానికి వ్యూహకర్తగా పనిచేశారు.

బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న అనిల్ జైన్ మోడీ ర్యాలీలను ఆర్గనైజ్ చేస్తుంటారు. హర్యానా ఎన్నికల్లో ఇంచార్జ్ గా పని చేశారు. పార్టీలో యువతరాన్ని ప్రోత్సహించడం, పార్టీ అభ్యర్థుల ఎంపిక, పోలింగ్ బూత్ ల నిర్వహణ వంటి పనులన్నీ జైన్ ఒంటి చేత్తో చక్కబెడుతున్నారు. మోడీ విధేయుడు అరవింద్ గుప్తా ఐఐటి పట్టభద్రుడు. ఆయన అమెరికా ఇల్లినాయిస్ యూనివర్సిటీ నుంచి పిహెచ్ డీ పొందారు. బీజేపీ ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ విభాగానికి ఆయనే సారధి. ఢిల్లీ ఆఫీసులో కూర్చొని 543 లోక్ సభ నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు, బలాబలాలను అంచనా వేస్తుంటారు. పరిస్థితులను సమీక్షించి నివేదికలను ప్రధాని మోడీకి పంపుతుంటారు.

పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంలో ఉన్న నైపుణ్యం వల్ల, మోడీ కోర్ టీమ్ సభ్యుడైన నడ్డా పార్టీకి జాతీయ అధ్యక్షుడయ్యారు. ఆయన కూడా అమిత్ షా లాగానే పార్టీకి ‘ఫ్రంట్ రన్నర్’లలో ఒకరు. ఏబివిపి, బీజేపీ యువజన విభాగాల్లో చురుగ్గా పనిచేసిన శ్రీకాంత్ శర్మ తన ప్రతిభను పలు సందర్భాలలో రుజువు చేసుకున్నారు. 2010 లో నితిన్ గడ్కరీ పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన కాలం నుంచే పార్టీలో క్రియాశీల భూమిక పోషిస్తున్నారు. ఇటీవల మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో వివాదాస్పదమైన నూపుర్ శర్మ పార్టీ యువముఖాల్లో ఒకరు. 2014 ఎన్నికల నుంచి ఆమెకు పార్టీలో బాగా ప్రాచుర్యం లభించింది. ఏబివిపిలో చురుగ్గా పనిచేసిన నూపుర్ లోక్ సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పోషించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సారధి అరవింద్ కేజ్రీవాల్ పై పోటీ చేసి ఓడిపోయారు.

కాగా, మోడీ ఎదురులేని మనిషిగా మారడం వెనుక ఆయన గుజరాత్ లో పడ్డ శ్రమ ప్రధానం. గుజరాత్ లో ఆయన హ్యాట్రిక్ సాధించారు. అయితే ఆయన ఏ నియోజకవర్గానికి వెళ్లినా ”ఇక్కడ నిలబడిన అభ్యర్థి ముఖ్యం కాదు.. నేనే అభ్యర్థిని.. నన్ను చూసి ఓటేయండి. ” అంటూ అభ్యర్థించేవారు. 1985 ప్రాంతాల్లో గుజరాత్ లో 149 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉండింది. కానీ మోడీ రంగప్రవేశంతో అక్కడ బలాబలాల్లో అనూహ్యమైన మార్పులు సంభవించాయి.మోడీ ‘కాంగ్రెస్ ఓటు బ్యాంకు’ను చీల్చుతూ వెళ్లారు. అభివృద్ధి లక్ష్యంగానే ఆయన జనంలోకి దూసుకుపోయారు.” నాకంటూ వెనకేసుకునేందుకు ఏమీ లేదు. నా జీవితం ప్రజల కోసమే. 6 కోట్ల గుజరాతీలు సుభిక్షంగా ఉండాలన్నదే నా ఆశ. అందుకు మీరు మద్దతు ఇస్తే మరో ప్రపంచాన్ని మీకు చూపిస్తా” అంటూ ప్రజల హృదయాలను కొల్లగొట్టేవారు.

యూపీఏ రెండో విడత పరిపాలనలో అవినీతి కుంభ కోణాలతో కాంగ్రెస్ అప్రతిష్టపాలయ్యింది. అందుకే దేశమంతటా నరేంద్ర మోడీ ప్రభంజనం కనిపించింది. కాగా అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్థాన్‌ లో సర్జికల్‌ స్ట్రైక్‌, ఎయిర్‌ స్ట్రైక్‌ వంటి ఘటనలు ‘దేశభక్త మోడీ’కి జనం హారతులు పట్టే విధంగా ఆయన ‘విధేయబృందం’చాకచక్యంగా’ డిజైను చేశారు. కాగా నరేంద్రమోడీ గడ్డం పెంచడం కూడా ఒక వ్యూహమే! పశ్చిమ బెంగాల్ ప్రజలను ఆకట్టుకోవడానికి రవీంద్రనాథ్ ఠాగూర్ అవతారంలో మోడీ కనిపిస్తున్నారని బెంగాల్ ఎన్నికల సందర్భంగా ప్రచారం జరిగింది.

First Published:  5 July 2022 5:16 AM GMT
Next Story